విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఒక ఎత్తయితే.. తాజాగా విడుదలైన ట్రైలర్ మరో ఎత్తు. త్రివిక్రమ్ సినిమా అంటే చమత్కారమైన మాటలు, కుటుంబ భావోద్వేగాలు, వినోదం గుర్తొస్తాయి. కానీ ఈసారి ఆయన రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ నిండా హింస, రక్తపాతం, యాక్షన్ సన్నివేశాలు కనిపించడంతో సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి పెరిగింది.
వరుస వాయిదాల తర్వాత ఈ చిత్రాన్ని అక్టోబర్ 30, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరికొత్త యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నారు.
కుటుంబం చుట్టూ క్రైమ్ కథ..
ట్రైలర్‌ను గమనిస్తే.. దారుణమైన నేరాలకు పాల్పడే ఓ క్రూరమైన గ్యాంగ్, కథానాయకుడి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ కుటుంబాన్ని కాపాడుకునేందుకు కథానాయకుడు, అతని కుటుంబ సభ్యులు ఎదురుదాడికి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, వెంకటేష్ పాత్రకు గతంలో జైలు జీవితంతో సంబంధం ఉన్నట్లు ట్రైలర్‌లో చూపించడం కథపై మరిన్ని ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుందా?
త్రివిక్రమ్ సినిమాల్లో సహజంగా కనిపించే ప్రాసతో కూడిన సంభాషణలు, అక్కడక్కడా వినిపించే కామెడీ ట్రైలర్‌లోనూ ఉన్నాయి. అయితే, ఈసారి వాటికంటే యాక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. కుటుంబ కథకు క్రైమ్, హింసను జోడించి దర్శకుడు ఎలాంటి కథనాన్ని సిద్ధం చేశారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు అంశాలను ఆయన ఎలా సమన్వయం చేశారో సినిమా విడుదలయ్యాకే స్పష్టత రానుంది.
వెంకటేష్ తనదైన నటనతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. శ్రీనిధి శెట్టితో పాటు దేవయాని శర్మ, యువినా పార్థవి, నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటివరకు త్రివిక్రమ్ నుంచి ఆశించిన వినోదానికి భిన్నంగా, క్రైమ్ మరియు యాక్షన్ అంశాలతో ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ ప్రయోగంతో వెంకటేష్, త్రివిక్రమ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారో తెలియాలంటే అక్టోబర్ 30 వరకు వేచి చూడాల్సిందే.