హైదరాబాద్‌లో జరిగిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాకింగ్ స్టార్ యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేజీఎఫ్’ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు కూడా తనకు సమయం దొరకలేదని, పూర్తిగా తన పనిలో నిమగ్నమైపోయానని తెలిపారు.
తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమకు యశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీ, సంకల్పంతో పనిచేస్తే ప్రేక్షకులు ఎవరినైనా ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు నిరూపించారని అన్నారు. సినిమాకు ఎలాంటి సరిహద్దులు ఉండవని, భాష, ప్రాంతాలకు అతీతంగా మానవత్వం, ప్రేమ, నిజాయితీ ఉంటాయని పేర్కొన్నారు.
కర్ణాటకలో కూడా తెలుగు ప్రజలను, తెలుగు సినిమాలను ఎంతో ఇష్టపడతామని యశ్ తెలిపారు. భారతీయ సినిమా ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని, అందుకోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
యువతను ఉద్దేశించి యశ్ మాట్లాడుతూ.. “మీరు అనుకున్నది మనసులో బలంగా సంకల్పించుకుని ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. ముందుగా మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. మీపై నమ్మకంతో పనిచేయండి. ఇతరుల మాటలను పట్టించుకోకండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది” అని అన్నారు.
‘టాక్సిక్’ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని యశ్ తెలిపారు. ఈ సినిమా కోసం దేశంలోని అత్యుత్తమ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పనిచేశారని, ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని చెప్పారు.
‘కేజీఎఫ్’కు అద్భుతమైన సంగీతాన్ని అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా మ్యాజిక్ క్రియేట్ చేశారని యశ్ ప్రశంసించారు. ఆయన అహర్నిశలు ‘టాక్సిక్’ కోసం పనిచేశారని తెలిపారు.
నిర్మాత కేవీఎన్‌ను కూడా యశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. కేవీఎన్ ఇండస్ట్రీకి డబ్బు సంపాదించడానికి రాలేదని, ఫిల్మ్ ఇండస్ట్రీకి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో వచ్చారని అన్నారు. బెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌గా మైలురాయి చిత్రాలను నిర్మిస్తున్నారని ప్రశంసించారు.
దిల్ రాజుతో తనకు ‘కేజీఎఫ్ 2’ సమయంలో పరిచయం ఏర్పడిందని యశ్ తెలిపారు. ఆయన చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని, ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు. ఆయనతో కలిసి ‘టాక్సిక్’ను విడుదల చేయడం ఆనందంగా ఉందని, ప్రేక్షకులకు తప్పకుండా మంచి ఎక్స్‌పీరియన్స్ అందిస్తామని చెప్పారు.
హుమా ఖురేషి ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించారని, కియారా అద్వానీతో ప్రేక్షకులు మరోసారి ప్రేమలో పడతారని యశ్ అన్నారు. రుక్మిణి వసంత్‌తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆమె ప్రతి ఇండస్ట్రీలోనూ అద్భుతమైన సినిమాలు చేస్తోందని ప్రశంసించారు.
లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశారని యశ్ తెలిపారు. ‘టాక్సిక్’ పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది.. మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది అని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు ప్రేక్షకులు తనకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు రెండింతలు తిరిగి ఇస్తానని యశ్ హామీ ఇచ్చారు. “ఇంతకంటే అద్భుతమైన సినిమాలు చేస్తాను” అని అన్నారు.
చివరగా మెగాస్టార్ చిరంజీవికి యశ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.