వార్తలు

ఇక వారికి ఎస్సీ హోదా రద్దు… సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Published by
Suresh Thota

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన షెడ్యూల్డ్ కాస్ట్ (SC) హోదాపై కీలక అంశంలో సుప్రీం కోర్టు మరోసారి స్పష్టతనిచ్చింది. హిందూ మతానికి చెందిన ఎస్సీ వ్యక్తి క్రిస్టియన్ లేదా ఇతర మతంలోకి మారినట్లయితే, అతనికి ఎస్సీ హోదా కొనసాగదని కోర్టు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిట్టలవాని పాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, తన మతాన్ని క్రిస్టియన్‌గా మార్చుకున్న తర్వాత కూడా ఎస్సీ హోదా కొనసాగుతుందని వాదిస్తూ ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశాడు. ఈ కేసు స్థానిక స్థాయిలో ప్రారంభమై, అనంతరం ఉన్నత న్యాయస్థానాల ద్వారా సుప్రీం కోర్టుకు చేరింది.

పిటిషనర్ తరఫున న్యాయవాదులు…

“మతం మారినా కుల వివక్ష సమాజంలో కొనసాగుతూనే ఉంది. అందువల్ల ఎస్సీ హక్కులు తొలగించడం అన్యాయం” అని వాదించారు. అయితే ప్రత్యర్థి వర్గం, రాజ్యాంగ నిబంధనల ప్రకారం మత మార్పిడి తర్వాత ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేసింది.

ఈ కేసు నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు, ఎస్సీ హోదా పరిమితులపై స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్ కాస్ట్ హోదా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు మాత్రమే పరిమితం, క్రిస్టియన్ లేదా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులకు ఈ హోదా వర్తించదు. అటువంటి వ్యక్తులు ఎస్సీ కేటగిరీలోకి రాకపోవడంతో పాటు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్ట ప్రయోజనాలు కూడా వర్తించవు అని సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ అభిప్రాయం వెలిబుచ్చింది.

ఈ సందర్భంగా కోర్టు 1950లో అమలులోకి వచ్చిన “Constitution (Scheduled Castes) Order, 1950” నిబంధనలను మరోసారి గుర్తు చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం, ఎస్సీ హోదా మొదట హిందువులకు మాత్రమే వర్తించగా, తర్వాత సిక్కులు (1956), మరియు బౌద్ధులు (1990) కూడా చేర్చబడ్డారు.

ఇప్పుడు చట్టపరమైన స్పష్టత ఇచ్చింది. ఈ తీర్పు కొత్తది కాదు అయినా న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సుప్రీం కోర్టు తాజా స్పష్టీకరణ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడం కాదని, ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలను మళ్లీ నిర్ధారించడమేనని….. గతంలో కూడా పలు తీర్పుల్లో ఇదే సూత్రాన్ని కోర్టులు ప్రస్తావించిన విషయం గుర్తించాల్సినదిగా వారు పేర్కొంటున్నారు.

ఈ అంశం దేశవ్యాప్తంగా సామాజిక, రాజకీయ ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటున్నారు…. న్యాయ నిపుణులు…. ఈ విషయం దేశంలో చాలా కాలంగా చర్చనీయాంశంగా కొనసాగుతోంది. మత మార్పిడి తర్వాత కూడా కుల వివక్ష కొనసాగుతుందని కొందరు వాదిస్తుండగా, మరికొందరు ఎస్సీ హోదా హిందూ సామాజిక వ్యవస్థకు సంబంధించినదని అభిప్రాయపడుతున్నారు.

తాజా పరిణామంతో: రిజర్వేషన్ వ్యవస్థపై మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తమ తమ దృక్కోణంలో వినియోగించే అవకాశముంది. మత మార్పిడి, సామాజిక న్యాయం మధ్య సంబంధం పై విస్తృత చర్చలు ప్రారంభమవుతాయి.

ఈ అంశం పై దేశవ్యాప్తంగా పలు పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా క్రిస్టియన్ మరియు ముస్లిం మతాలకు మారిన దళితులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలా అనే ప్రశ్నపై భవిష్యత్తులో పెద్ద బెంచ్ విచారణ జరగాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

న్యాయ నిపుణుల అంచనా ప్రకారం, ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలంటే…. “సుప్రీం కోర్టు రాజ్యాంగ బెంచ్” విచారణ లేదా “పార్లమెంట్ ద్వారా చట్ట సవరణ” ద్వారా ఈ అంశం నకు ముగింపు పలకవచ్చు అంటున్నారు.

గుంటూరు పిట్టలవాని పాలెం కేసు నేపథ్యంలో వెలువడిన ఈ స్పష్టీకరణతో, మత మార్పిడి తర్వాత ఎస్సీ హోదాపై ఉన్న అనుమానాలకు కొంతవరకు స్పష్టత లభించింది. అయితే సామాజిక, రాజకీయ మరియు చట్టపరమైన స్థాయిలో ఈ అంశం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతుంది.

Suresh Thota