ఇంటర్వ్యూలు

The Paradise: నాని కోసం అలాంటి కథనే ఎంచుకున్నా.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Published by
Srinivas

న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’తో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన విజయం తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్, టీజర్‌కు మంచి స్పందన లభించింది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV Cinemas బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నిజ జీవిత సంఘటనలు, ఫిక్షన్ కలయికతో కథ

‘ది ప్యారడైజ్’ కథకు మూడు ప్రధాన అంశాలు స్ఫూర్తిగా నిలిచాయని శ్రీకాంత్ ఓదెల తెలిపారు. నిజ జీవిత సంఘటనలు, కొన్ని నిజ జీవిత పాత్రల నుంచి తీసుకున్న అంశాలు, ఫిక్షన్‌ను కలిపి ఈ కథను రూపొందించినట్లు చెప్పారు.

తన చిన్ననాటి అనుభవాలు కూడా సినిమాలోని కొన్ని సన్నివేశాలు, పాత్రలకు స్ఫూర్తిగా నిలిచాయని వెల్లడించారు. ముఖ్యంగా తన తల్లి ఆడపిల్ల కావాలని కోరుకున్నప్పటికీ తాను అబ్బాయిగా పుట్టడంతో చిన్నతనంలో తనకు జడలు వేసి, గౌన్ వేసి పెంచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ జ్ఞాపకాన్ని కూడా సినిమాలోని ఒక ఎమోషనల్ ఎలిమెంట్‌కు ఉపయోగించినట్లు తెలిపారు.

గోదావరిఖని, ఆదిలాబాద్ ప్రాంతాల్లో తాను చూసిన సంఘటనలు, అక్కడి సామాజిక పరిస్థితులు కూడా కథపై ప్రభావం చూపాయని శ్రీకాంత్ చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో ఉన్న సమయంలో తన చుట్టుపక్కల చూసిన బస్తీ జీవితాన్ని కూడా కథలో ఒక భాగంగా తీసుకున్నట్లు తెలిపారు.

‘దసరా’లో మిస్ అయిన నాని.. ‘ది ప్యారడైజ్’లో చూపిస్తా

‘దసరా’ తర్వాత నాని నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలను దృష్టిలో పెట్టుకుని ‘ది ప్యారడైజ్’ను రూపొందించినట్లు శ్రీకాంత్ ఓదెల తెలిపారు.

‘దసరా’ను తాను మొదట మంచి డ్రామాగా చేయాలని భావించానని, అయితే ప్రమోషనల్ కంటెంట్ కారణంగా ప్రేక్షకులు దాన్ని పూర్తిస్థాయి మాస్ సినిమా అని ఊహించారని చెప్పారు. సినిమా చూసిన తర్వాత కొంతమంది ప్రేక్షకులు మొదట భిన్నంగా స్పందించినప్పటికీ, రెండు రోజుల తర్వాత సినిమాతో కనెక్ట్ అయ్యారని, చివరికి అది ఘన విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు.

అయితే ఈసారి ప్రేక్షకులు నాని నుంచి కోరుకునే మాస్ ఎలిమెంట్స్‌ను కూడా అందించాలనే ఉద్దేశంతో ‘ది ప్యారడైజ్’ను రూపొందించినట్లు చెప్పారు.

యాక్షన్ కంటే ఎమోషన్‌దే ఎక్కువ ప్రాధాన్యత

‘ది ప్యారడైజ్’లో యాక్షన్, ఎమోషన్, మదర్ అండ్ సన్ బాండింగ్ వంటి అంశాలు కలిసివుంటాయని శ్రీకాంత్ ఓదెల తెలిపారు.

సినిమాలో యాక్షన్ ఉన్నప్పటికీ ఎమోషన్‌నే తాను ప్రధానంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు భావోద్వేగాలకు బలంగా కనెక్ట్ అవుతారని ఆయన పేర్కొన్నారు.

ట్రైలర్ ఎందుకు విడుదల చేయలేదు?

‘ది ప్యారడైజ్’కు ప్రత్యేకంగా ట్రైలర్ విడుదల చేయకపోవడం వెనుక కూడా కారణం ఉందని శ్రీకాంత్ ఓదెల వివరించారు.

ఒక మంచి ట్రైలర్‌ను కట్ చేయడానికి చాలా సమయం అవసరమని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ సమయాన్ని కేటాయించడం సాధ్యం కాలేదని చెప్పారు. అయితే వ్యక్తిగతంగా తాను సినిమాను ఎక్కువగా చూడకుండా, నేరుగా థియేటర్‌కు వెళ్లి ప్రతి సన్నివేశానికి సర్‌ప్రైజ్ అవ్వడాన్ని ఇష్టపడతానని తెలిపారు.

తన తదుపరి సినిమాకు కూడా సాధ్యమైనంత తక్కువ అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

170 రోజుల్లో ‘ది ప్యారడైజ్’ షూటింగ్ పూర్తి

‘ది ప్యారడైజ్’ షూటింగ్ మొత్తం 170 రోజుల్లో పూర్తయిందని శ్రీకాంత్ ఓదెల తెలిపారు. మొదట 160 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, సినిమా చిత్రీకరణ సాగుతున్న కొద్దీ మరో పది రోజులు పెరిగిందని చెప్పారు.

తాను అనుకున్న షాట్ వచ్చే వరకు ఎన్నిసార్లయినా షూట్ చేస్తానని, అయితే ఒకసారి ఓకే అయిన తర్వాత మళ్లీ రీషూట్ చేయడానికి ఇష్టపడనని తెలిపారు.

షూటింగ్ ఆలస్యానికి కంటెంట్ లేదా రీషూట్స్ కారణం కాదని, తాను అనుకున్న విధంగా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించడానికి ఎక్కువ సమయం పట్టడం వల్లే డేట్స్ పెరిగాయని స్పష్టం చేశారు. ఈ సినిమా కోసం ఎక్కడా రీషూట్స్ చేయలేదని, మొదట రూపొందించిన బౌండ్ స్క్రిప్ట్ ప్రకారమే చిత్రీకరణ పూర్తి చేశామని చెప్పారు.

నానితో అన్నదమ్ముల్లాంటి అనుబంధం

నాని తనకు అన్నదమ్ములాంటి వ్యక్తి అని శ్రీకాంత్ ఓదెల తెలిపారు. దర్శకుడిగా తనకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిగా నానిపై ఎప్పటికీ కృతజ్ఞత ఉంటుందని చెప్పారు.

తాను నానితో ప్రతి విషయాన్ని స్వేచ్ఛగా చర్చిస్తానని, ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని వెల్లడించారు.

మోహన్ బాబు పాత్ర చాలా కీలకం

‘ది ప్యారడైజ్’లో మోహన్ బాబు పోషించిన పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుందని శ్రీకాంత్ ఓదెల తెలిపారు.

మోహన్ బాబు, నాని పాత్రల మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని, ఇద్దరి పాత్రల మధ్య ఉండే పేస్ ఆఫ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.

అలాగే సంపూర్ణేష్ బాబు హీరో స్నేహితుడి పాత్రలో కనిపిస్తారని, ఆయన నటన ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుందని దర్శకుడు తెలిపారు.

అనిరుధ్‌తో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ గురించి కూడా శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ఏం చెప్పాలనుకుంటున్నానో అనిరుధ్ చాలా త్వరగా అర్థం చేసుకుంటారని, ఇద్దరు స్నేహితులు కలిసి పనిచేసినట్లుగా ఈ సినిమాకు సంగీతాన్ని రూపొందించామని చెప్పారు.

‘ది ప్యారడైజ్’లో బిట్స్, సాంగ్స్ కలిపి మొత్తం ఆరు పాటలు ఉంటాయని వెల్లడించారు.

‘ఏష నాగుల’ పాట వెనుక చిన్ననాటి జ్ఞాపకం

‘ఏష నాగుల’ పాట తన చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించినదని శ్రీకాంత్ ఓదెల తెలిపారు.

తాను ఏడో తరగతిలో ఉన్న సమయంలో ఆటోలో ప్రతిరోజూ ఆ పాట వినిపించేదని, ఆ జ్ఞాపకంతోనే ఈ పాట ఆలోచన వచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని అనిరుధ్‌కు చెప్పడంతో ఆయన అద్భుతంగా కంపోజ్ చేశారని తెలిపారు.

నిజానికి ఈ పాటను ‘దసరా’లోనే ఉపయోగించాలని అనుకున్నప్పటికీ, ఆ సమయంలో కుదరలేదని, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో అవకాశం దొరికిందని చెప్పారు. తనకు జానపద గీతాలంటే చాలా ఇష్టమని శ్రీకాంత్ తెలిపారు.

‘ది ప్యారడైజ్’కు సీక్వెల్ ఉండదు

‘ది ప్యారడైజ్’కు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉండబోదని దర్శకుడు స్పష్టం చేశారు. ఇది సింగిల్ మూవీగానే ఉంటుందని తెలిపారు.

‘జగడం’ చూసిన తర్వాత సినిమా తీయాలని నిర్ణయం

తనకు సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడిందో కూడా శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు.

తాను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ‘జగడం’ సినిమాను థియేటర్‌లో చూశానని, ఆ సినిమా చూసిన తర్వాత తాను కూడా సినిమా తీయాలని బలంగా నిర్ణయించుకున్నానని చెప్పారు.

ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ వచ్చి నేరుగా దర్శకుడు సుకుమార్ను కలిసేందుకు ప్రయత్నించానని తెలిపారు. నాలుగేళ్ల తర్వాత సుకుమార్ తనను ఒక షార్ట్ ఫిలిం చేసి తీసుకురమ్మని చెప్పారని, దాన్ని చూసిన తర్వాత తన టీమ్‌లోకి తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ‘రంగస్థలం’ సినిమాకు కూడా పనిచేసినట్లు వెల్లడించారు.

కృష్ణవంశీ, రాజమౌళి, సుకుమార్, శేఖర్ కమ్ముల, పూరి జగన్నాథ్ వంటి దర్శకుల ప్రభావం తనపై బలంగా ఉందని శ్రీకాంత్ ఓదెల తెలిపారు.

చిరంజీవితో సినిమా ఉంటుంది

మెగాస్టార్ చిరంజీవితో సినిమా గురించి కూడా శ్రీకాంత్ ఓదెల స్పష్టత ఇచ్చారు.

‘ది ప్యారడైజ్’ విడుదలైన తర్వాత సుమారు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కొంతకాలం కుటుంబంతో గడపాలని, మెదడుకు కూడా విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు.

చిరంజీవి గారితో సినిమా 100 శాతం ఉంటుందని శ్రీకాంత్ ఓదెల తెలిపారు.

భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నాని, శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ కాంబినేషన్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts