నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #NBK111 సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘దాదా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్‌తో పాటు విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.
వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ గ్లింప్స్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకోగా, ఇప్పుడు ‘దాదా’ టైటిల్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
‘దాదా’ టైటిల్‌కు తగ్గట్టుగానే బాలకృష్ణ లుక్‌ను డిజైన్ చేశారు. కళ్లకు కూలింగ్ గ్లాసెస్, లెదర్ జాకెట్, మెడలో భారీ గోల్డ్ చైన్.. భుజంపై ఆయుధంతో బాలయ్య కనిపించిన తీరు ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది.
గంభీరమైన చూపు, దూకుడైన బాడీ లాంగ్వేజ్‌తో బాలకృష్ణను కంప్లీట్ మాస్ అవతార్‌లో చూపించారు. చూస్తుంటే ఈసారి బాలయ్య పాత్రలో రఫ్‌నెస్‌తో పాటు గ్యాంగ్‌స్టర్ షేడ్స్ కూడా బలంగా ఉండేలా కనిపిస్తోంది.
అందుకే మేకర్స్ ఆయన పాత్రను ‘ది కింగ్ ఆఫ్ ఖయాస్’గా పరిచయం చేశారు.
గ్లింప్స్ అసలు హైలైట్ బాలకృష్ణ-పోలీసుల మధ్య వచ్చే సీక్వెన్స్. బాలయ్య పాత్రను ‘షేర్’గా అభివర్ణిస్తూ వాయిస్‌ఓవర్ మొదలవుతుంది. ఆ తర్వాత పోలీసులు ఆయనను చుట్టుముట్టి, ఛాతీలో కాల్చేస్తామని హెచ్చరిస్తారు.
అక్కడ బాలయ్య ఇచ్చే సమాధానం గ్లింప్స్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. ట్రిగ్గర్ నొక్కడం అంత సులభం కాదనే భావనతో వచ్చే ఆయన డైలాగ్ మాస్ ఆడియన్స్‌కు మంచి ఎలివేషన్ ఇస్తోంది.
దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సన్నివేశాన్ని బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీగా డిజైన్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
బాలకృష్ణ ఎలివేషన్‌కు తోడుగా ఎస్. థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌లో మరో ఆకర్షణగా నిలిచింది. ‘రాజా హూన్ మైన్’ ట్రాక్‌తో సన్నివేశానికి మరింత పవర్ వచ్చింది.
స్టైలిష్ మేకింగ్, మాస్ ఎలివేషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ టచ్‌తో ‘దాదా’ గ్లింప్స్ సినిమా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చింది.
టైటిల్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. 2026 డిసెంబర్ 24న ‘దాదా’ థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్ హాలిడేస్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా, న్యూ ఇయర్ వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని చూస్తోంది.
ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు.
బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌కు ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’తో మంచి క్రేజ్ ఉంది. ఆ విజయవంతమైన కాంబో ఇప్పుడు ‘దాదా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తాజా గ్లింప్స్‌ను బట్టి చూస్తే.. కథ కంటే ముందు బాలయ్య క్యారెక్టర్, ఆయన మాస్ ఇమేజ్, యాక్షన్ ఎలివేషన్స్‌ను హైలైట్ చేస్తూ సినిమాను భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ‘దాదా’గా బాలయ్య థియేటర్లలో ఎలాంటి మాస్ రచ్చ చేస్తారో చూడాలి.