సినిమా వార్తలు

బంపర్ ఆఫర్ దక్కించుకున్న మిరాయ్ డైరెక్టర్ – మెగాస్టార్ చిరంజీవి సినిమాకి…

Published by
Rahul N

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన చిత్రం మిరాయ్ మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. హనుమాన్ విజయం తర్వాత, అంతకు మించిన విజయమని చెప్పుకోవచ్చు యువ హీరో తేజ సజ్జ కి. ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చిన ఈ యువ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని మరో పెద్ద ఆఫర్‌ను దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సినిమాటోగ్రాఫర్‌గా (డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ) ఎంపిక కావడం విశేషంగా మారింది.

సెప్టెంబర్ 12న భారీ ఎత్తున విడుదలైన మిరాయ్, తొలి రోజే రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. రెండో రోజుకే ఈ సినిమా రూ.55 కోట్లను దాటేయడం విశేషం. ఈ విజయానికి కార్తీక్ ఘట్టమనేని చేసిన కృషి కీలకమైంది. దర్శకుడిగానే కాకుండా సినిమాటోగ్రాఫర్‌గా కూడా ఆయన పనిచేయడం వల్లే మిరాయ్ కి విజువల్స్ అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి.

ఇప్పుడీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న కార్తీక్, బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాలో పని చేసే అవకాశం రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచారు. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘మన శంకర వ‌రప్రసాద్ గారు’ సినిమాలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో, మరోవైపు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ కూడా షూటింగ్ దశలో ఉంది.

ఈ రెండు పెద్ద ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న మెగాస్టార్ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక కావడం ఆయన కెరీర్‌లో మైలురాయిగా మారనుంది. మిరాయ్ తో తాను దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో కెమెరామెన్‌గా పనిచేయబోతుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది.

Rahul N