వర్షాకాలం వచ్చిందంటే చాలా మందికి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అందరికీ. మిర్చి బజ్జీలు, ఇతర ఫాస్ట్ ఫుడ్స్ మీద ఆసక్తి పెరుగుతుంది. కానీ అదే పానీపూరీ అయితే ఒక కాలమంటూ లేదు. పానీపూరి బండి కనిపిస్తే చాలు… ఆగలేరు చాలామంది. కానీ, అదే సమయంలో అపరిశుభ్రమైన ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక సంఘటన దీనికి మంచి ఉదాహరణ.
నగరానికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, వర్షం పడుతున్న సమయంలో రోడ్డు పక్కన పానీపూరీ తిని తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. మొదట వాంతులు, బలహీనత వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు పరీక్షలు చేసి అతనికి తీవ్రమైన హెపటైటిస్ A ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించారు. పానీపూరీ తయారీలో వాడిన అపరిశుభ్రమైన నీరు దీనికి కారణమని వైద్యులు గుర్తించారు.
ఈ హెపటైటిస్ A ఇన్ఫెక్షన్ వల్ల ఆ యువకుడికి కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు), కడుపులో నొప్పి, వికారం, వాంతులు, మరియు మూత్రం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించాయి. ఈ పరిస్థితి తీవ్రంగా మారడంతో అతను దాదాపు నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. వైద్యులు నిరంతరం చికిత్స అందించి, సరైన ఆహారం ఇవ్వడం వల్ల అతను క్రమంగా కోలుకున్నాడు. సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్లడం వల్ల ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
హెపటైటిస్ A మరియు E గురించి వైద్యుల హెచ్చరికలు
ఈ సంఘటన నేపథ్యంలో వైద్యులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్డు పక్కన దొరికే పానీపూరీ, మిర్చి బజ్జీలు, సమోసాలు, సరిగా ఉడకని నూడుల్స్, కట్ చేసిన పండ్ల ముక్కలు వంటి వాటిని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
హెపటైటిస్ A మరియు E వ్యాధులు అపరిశుభ్రమైన ఆహారం, కలుషితమైన నీటి ద్వారా వ్యాపిస్తాయి.
హెపటైటిస్ A ఒక వైరస్ ద్వారా కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా కలుషితమైన ఆహారం, నీరు లేదా సోకిన వ్యక్తి మలంతో సంబంధం ఉన్న ఆహారం లేదా వస్తువుల ద్వారా వ్యాపిస్తుంది.
హెపటైటిస్ E కూడా హెపటైటిస్ A లాగే కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మురుగునీరు తాగునీటిలో కలిసే అవకాశం ఉన్నందున ఈ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
ఈ వ్యాధుల లక్షణాలు సాధారణంగా వాంతులు, వికారం, జ్వరం, అలసట, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు, మరియు కామెర్లు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
ఈ వర్షాకాలంలో వీధి పక్కన అమ్మే ఆహార పదార్థాలను తినడం తగ్గించి, ఇంటి వద్ద తయారు చేసిన శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో రాజీ పడకుండా జాగ్రత్తలు పాటించడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు.