సినిమా వార్తలు

‘రావు బహదూర్’పై నాగచైతన్య ప్రశంసలు.. “తెలుగు సినిమాకు ఇది కొత్త రిఫరెన్స్ పాయింట్”

Published by
Srinivas

సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావు బహదూర్’ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటోంది.

తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య చిత్రబృందాన్ని కలిసి అభినందించారు. సినిమా గురించి మాట్లాడుతూ ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

“చాలా రోజుల తర్వాత నేను చూసిన నిజమైన ఒరిజినల్ సినిమా ‘రావు బహదూర్’. ఇలాంటి కథను తెరపైకి తీసుకురావాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఒక నటుడిగా ఇలాంటి పాత్ర చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సత్యదేవ్ అద్భుతమైన నటనతో ఆ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లారు” అని నాగచైతన్య అన్నారు.

దర్శకుడు వెంకటేష్ మహాపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. “ఇది ఒక మాస్టర్‌క్లాస్ లాంటి సినిమా. ప్రతి సన్నివేశం, ప్రతి డీటైల్ ఎంతో ఆలోచింపజేస్తుంది. ‘రావు బహదూర్’ ప్రపంచాన్ని వెంకటేష్ మహా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇప్పటివరకు మలయాళం, కన్నడ సినిమాల గురించి కంటెంట్ పరంగా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు తెలుగులో కూడా అలాంటి గొప్ప సినిమాను ఆయన అందించారు” అని పేర్కొన్నారు.

ప్రేక్షకులు రివ్యూలు లేదా ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకుండా స్వయంగా థియేటర్‌కు వెళ్లి సినిమాను అనుభవించాలని నాగచైతన్య సూచించారు. “ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఎలాంటి ఫార్ములాలు, లెక్కలు లేకుండా రూపొందిన ఈ చిత్రం ధైర్యవంతమైన ప్రయత్నం. తెలుగు సినిమాకు ‘రావు బహదూర్’ ఒక కొత్త రిఫరెన్స్ పాయింట్‌గా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.

చివరగా చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి విభిన్నమైన సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.