అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ విడుదలకు సిద్ధమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో నాగార్జున అందించిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అయితే తాజాగా చిత్రబృందం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ‘లెనిన్’ కోసం ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ అందించారు. సినిమాలోని కథ, నేపథ్యం, శ్రీరామపురం ప్రపంచాన్ని ఎన్టీఆర్ తన గంభీరమైన స్వరంతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. థియేటర్లలో ఆయన వాయిస్‌కు వచ్చే ఎలివేషన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని అభిమానులు భావిస్తున్నారు.
ఎన్టీఆర్ అందించిన ఈ వాయిస్ ఓవర్ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అక్కినేని నాగార్జునతో పాటు అక్కినేని కుటుంబంతో ఉన్న సన్నిహిత అనుబంధం కారణంగానే అఖిల్ కోసం ఎన్టీఆర్ ఈ ప్రత్యేక సహకారం అందించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక అఖిల్ ఈ సినిమాలో రగ్డ్, రస్టిక్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో ఆయన మేకోవర్ అభిమానులను ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు ఎస్. తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరో బలంగా నిలుస్తాయని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
భారీ అంచనాల మధ్య ‘లెనిన్’ చిత్రం జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.