దూరదర్శిని

Published by
Srinivas

Duradashini Movie Review: యథార్థ గాథ వెండితెరపై ఎలా ఉందంటే..

సువిక్షిత్‌, గీతికా రతన్‌ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘దూరదర్శిని’. ‘కలిపింది ఇద్దరిని’ అనే ట్యాగ్‌లై‌న్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమని.. ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించామంటూ మేకర్స్ ఈ చిత్ర ప్రమోషన్స్‌లో చెప్పడంతో పాటు ఈ సినిమా టికెట్‌తో పాటు ఖర్చీఫ్‌ ఫ్రీగా ఇస్తామంటూ హైప్ క్రియేట్ చేసే యత్నమైతే గట్టిగానే చేశారు. మరి సినిమా ఆ స్థాయిలో ఉందా? చూద్దాం.

కథ:

ఒక చిన్న అందమైన పల్లెటూరు.. రంగయ్య టీ కొట్టు దగ్గరకు ఓ కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఓ వ్యక్తి దిగుతాడు. అక్కడ కూర్చొంటే మతాలకు అతీతంగా చేసుకున్న వివాహాలను చూసి ఆశ్చర్యపోతాడు. అదేమిటని అడిగితే రంగయ్య.. హరి (సువిక్షిత్ బొజ్జా), వాణి (గీతిక రతన్)ల కథ చెప్పడం ఆరంభిస్తాడు. వాణి వేరే ఊరిలో చదువుతూ ఉంటుంది. హరి మాత్రం తన తల్లిదండ్రులను వదిలి బయటకు వెళ్లలేక ఆ ఊరిలోనే ఉండిపోతాడు. హరి, వాణిలు దూరదర్శన్‌లో చిత్రలహరి చూసేందుకని వెళ్లి ప్రేమలో పడతారు. వాణి ఒకరోజు సొంతూరుకు వస్తుంది. టీవీ చూసేందుకని పేక బాబు (భాస్కర్) ఇంటికి వాణి, హరి తన స్నేహితులు చంటి(తేజ విహాన్), బండ (బాలరాజు పులుసు)తో కలిసి వెళతాడు. అక్కడ వీరిని చూసిన పేకబాబుకు వాణి, హరి ప్రేమలో ఉన్నారన్న విషయం తెలుస్తుంది. అసలే అమ్మాయిల పిచ్చి ఉన్న పేక బాబు ఎలాగైనా వాణిని దక్కించుకోవాలనుకుంటాడు. దాని కోసం అతను ఏం చేశాడు? హరి, వాణిల ప్రేమ చివరకు ఏ మలుపు తీసుకుంది? వీరి ప్రేమకు విలన్‌లా మారిన పరశురామ్ (విజయ్ కృష్ణ) ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

ప్రేమకథలు ఇటీవలి కాలంలో తిరిగి ఊపందుకున్నాయి. అలాగే టీవీ కథాంశంతో రూపొందిన చిత్రాలు సైతం ఇటీవలి కాలంలో వచ్చాయి. ‘శుభం’, ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వంటి చిత్రాలు ఆ కోవకు చెందినవే. మరి ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటారా? ఒకరకంగా చెప్పాలంటే ఏమీ లేదు. అందమైన ఊరు.. పేలవమైన ప్రేమకథ అంతే. ఇలాంటి స్టోరీలు గతంలోనూ వచ్చాయి. ఆసక్తికరంగా మలచకపోగా.. పిరియాడిక్ మూవీగా రూపొందించడం ఒక మైనస్ అనే చెప్పాలి. అసలు ఈ చిత్రం అటు యూత్‌కి కానీ.. ఇటు పెద్దవారికి కానీ కనెక్ట్ అవడమనేది ఒకింత కష్టమే. ఫస్ట్ హాఫ్ అంతా.. హరి, వాణి కుటుంబ నేపథ్యాలు.. వారి ప్రేమకథ వంటి అంశాలతో రూపొందింది. ఆ తరువాత సెకండాఫ్ ఆ గ్రామంలోని కుల చిచ్చు.. దాని మధ్య కులాంతర వివాహం చేసుకున్న శారద అనే గర్భిణికి ఎవరూ సాయమందించక మరణించడం వంటి అంశాలతో రూపొందింది. రియల్ స్టోరీ అని చెప్పారు కాబట్టి దానిని కాస్తంత ఆసక్తికరంగా మలిస్తే బాగుండేది. ముఖ్యంగా సినిమాకు ప్రధాన పాత్రల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. రియల్ స్టోరీ అయినా కూడా ఈ చిత్రం గత చిత్రాల ఫ్లేవర్‌ను గట్టిగానే ఇస్తుంటుంది. రియల్ స్టోరీలో కొత్తదనం అనేది ఆశించకూడదు కానీ స్క్రీన్‌ప్లేపై పట్టు లేదు. ఆసక్తికర అంశాలే చిత్రంలో లేవు. సెకండాఫ్‌లో కాస్త ఎమోషన్‌ మాత్రం బాగానే వర్కవుట్ అయ్యే అవకాశం ఉంది.

ఎవరెలా చేశారంటే..

ప్రధాన పాత్రల్లో నటించిన సువిక్షిత్ బొజ్జా, గీతిక రతన్‌లు బాగానే నటించారు కానీ ఎందుకో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక సినిమాలో చెప్పుకోదగిన నటులంటే తేజ విహాన్, బాలరాజు పులుసు. ముఖ్యంగా బాలరాజు అయితే సినిమాను కొంతమేర తన భుజస్కందాలపై మోశాడనే చెప్పాలి. అంతో ఇంతో ఫన్ జెనరేట్ అయ్యిందంటే దానికి కారణం బాలరాజే. ఇక విలన్స్‌గా నటించిన విజయకృష్ణ, భాస్కర్‌లు తమ నటనతో ఆకట్టుకున్నారు. జెమినీ సురేష్, భద్రం, లావణ్య రెడ్డి, చిత్తూరు కుర్రాడు, ధనలక్ష్మి వంటివారు తమ నటనతో ఆకట్టుకున్నారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు కార్తికేయ కొమ్మి.. యథార్థ గాథను తెరకెక్కించడంలో తడబడ్డారేమో అనిపిస్తుంది. ఇక చిత్రానికి నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సంగీతం సినిమాకు కొంతమేర ప్లస్ అయ్యింది. ఎడిటర్ విషయానికి వస్తే తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది.

తీర్పు:

అంతలా ఆకట్టుకోలేకపోయిన ‘దూరదర్శిని’

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

సిగ్మా

అక్టోబర్ 2, 2026

తెల్ల కాగితం

అక్టోబర్ 2, 2026

డోరతీ

అక్టోబర్ 2, 2026

అనుమాన పక్షి

సెప్టెంబర్ 25, 2026

ది ప్యారడైజ్

సెప్టెంబర్ 24, 2026