హీరో రోషన్‌కు ‘కోర్టు’ సినిమా తర్వాత మంచి క్రేజ్ వచ్చింది. ఆయన సినిమా వస్తోందంటేనే ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికీ తమ లైఫ్, చేసిన తప్పులు వంటివి చెప్పుకోలేనన్ని గుర్తొస్తాయని దర్శకుడు ఓ ఈవెంట్‌లో చెప్పారు. మొత్తానికి ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా తెలిపారు. మరి నిజంగానే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందా? తెలుసుకుందాం.
కథేంటంటే…
ఆశ (నక్షత్ర), రాము (హర్ష్ రోషన్)ల కథే ఈ సినిమా. ఆశ తండ్రి మూర్తి (అజయ్) తను తప్పు చెయ్యడు.. ఎవరైనా చేసినా సహించడు. తల్లిదండ్రులు లేకపోవడంతో రాము తాము అన్నా వదినల దగ్గరుండి చదువుకుంటూ ఉంటాడు. గుడిలో దణ్ణం పెట్టుకుని వెళ్ళమని వదిన చెప్పడంతో లంచ్ బాక్సులు బయటపెట్టి వెళ్తారు. అలా ఆశ, రాముల బాక్స్ మారిపోతాయి. ఆశ బాక్సులో నాన్ వెజ్ ఉండటంతో ఫ్రెండ్ శివతో కలిసి ఆనందంగా తింటాడు. మరోవైపు ఆశకు నాన్ వెజ్ తిని బోర్ కొట్టడంతో ఆనందంగా వెజ్ తింటుంది. ఆ తరువాత రోజూ నాన్ వెజ్ తినడం ఇష్టం లేని ఆశ గుడి దగ్గర బాక్స్ మార్చి దానితో పాటు ఓ లెటర్ పెడుతుంది. ఆ లెటర్ చదివిన రాము రిప్లై లెటర్ పెడతాడు. అలా ఇద్దరి మధ్య లెటర్స్ నడుస్తుంటాయి. ఇద్దరూ మెల్లగా ప్రేమలో పడతాడు. బెజవాడ మామయ్య (కసిరెడ్డి) ఇచ్చిన సలహాలను రాము ఫాలో అవుతుంటాడు. తనకు ఆశ దూరం కాకుండా ఉండాలంటే.. బెజవాడ మామయ్య ఇచ్చిన సలహాతో ఆమెతో ఫిజికల్‌గా కలుస్తాడు. దీంతో ఆశ ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తరువాత సినిమా ఎలాంటి మలుపు తీసుకుంది? రాము, ఆశల జీవితాలు చివరకు ఏమయ్యాయి? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే…
టీనేజర్స్‌లో ప్రేమ పుట్టడం చాలా సహజం. ఆ ప్రేమ విషయంలో అసూయ ఉండటం మరింత కామన్. తెలిసీ తెలియనితనంతో ఎవరెవరి మాటలో విని జీవితాలను పాడు చేసుకుంటున్న టీనేజర్స్ కథే ఈ సినిమా. ఏమైనా సమస్య వస్తే తల్లిదండ్రులకు చెప్పాలి కానీ వేరెవరినో ఆశ్రయించకూడదనే మెసేజ్ కూడా దర్శకుడు ఈ సినిమాతో ఇచ్చాడు. అంతా బాగానే ఉంది కానీ సినిమాను నడిపించిన తీరే ఏమాత్రం ఆకట్టుకోదు. హీరో రాము, అతని స్నేహితుడు శివలను కొన్ని విషయాల్లో మరింత వెర్రిపప్పలుగా చూపించినట్టుగా అనిపించింది. ప్రస్తుత తరుణంలో పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు. ప్రతిదీ వాళ్లకు తెలుస్తోంది. ఈ సినిమాలోని హీరోను కొన్ని విషయాల్లో మరింత అమాయకుడిగా చూపించారు. రాము చదువు కోసం అతని వదిన.. ఏకంగా కడుపులో బిడ్డని వద్దనుకుని ఆబార్షన్ చేయించుకునే సీన్ ఉంటుంది. వాస్తవానికి అది ఎమోషనల్ టచ్ ఉన్న సీన్. కానీ ఆ సన్నివేశాన్ని సైతం స్ట్రాంగ్‌గా చూపించలేకపోయారు. ఎమోషన్ పెద్దగా పండలేదు. క్లైమాక్స్‌ను సైతం తెలుగు ప్రేక్షకులు అంగీకరించడం కష్టమే. మొత్తంగా సినిమాను స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దలేకపోయారు. జీవితం అనే ‘తెల్లకాగితం’పై ఒకసారి మచ్చ పడితే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఈ చిత్రం సారాంశం. కానీ సినిమాను ఆసక్తికరంగా మలచకపోవడంతో మంచి అంశాన్ని తీసుకున్నా కూడా అది సరిగా ప్రేక్షకుల మనసులకు టచ్ అవదు.
ఎవరెలా నటించారంటే..
బాలనటుడిగా, ‘కోర్ట్’ సినిమాతో హీరోగా ఆకట్టుకున్న హర్ష్ రోషన్.. ఈ చిత్రంలో రాముగా నటించి ఆకట్టుకున్నాడు. తన పాత్రలో హర్ష్ రోషన్ అద్భుతంగా నటించాడు. ఆశ పాత్రలో నటించిన నక్షత్రకు ఇదే తొలి మూవీ అయినా కూడా మంచి నటననే కనబరించింది. అందంగా కనిపించింది. రాము స్నేహితుడిగా నటించిన శివకు మంచి రోల్ దక్కింది. అతను కూడా చక్కగా దానిని ఉపయోగించుకున్నాడు. ఆశ తండ్రి మూర్తిగా అజయ్, రాజ్ కసిరెడ్డి తదితరులు అంతా తమ పాత్రలో చక్కగా నటించారు.
టెక్నికల్ పరంగా…
మ్యూజిక్ పరంగా ఈ సినిమా బాగుంది. ఇప్పటికే సినిమాలోని పాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సింది. కొంచెం సాగదీతగా అనిపించింది. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.
ఫైనల్‌గా.. ‘తెల్ల కాగితం’ ప్రేక్షకులకు కనెక్ట్ అవడం కష్టమే.