డ్యూడ్

Published by
Srinivas

‘డ్యూడ్’ రివ్యూ: ప్రదీప్ రంగనాథన్ కోసం!

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా, శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘డ్యూడ్’. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన సినిమా ‘డ్యూడ్’. శరత్ కుమార్, రోహిణి కీలక తారాగణం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ మొదటి చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి. 

కథ:

మేనమామ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి కుమార్తె కుందన (మమితా బైజు) ప్రపోజ్ చేస్తే నో చెబుతాడు గగన్ (ప్రదీప్ రంగనాథన్). ఫీలింగ్స్ లేవని అంటాడు. అతనిలో ఫీలింగ్స్ కలిగి మావయ్యకు చెబితే పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అప్పటికి వేరే అబ్బాయి పార్థు (హ్రిదు హరూన్) మీద ఫీలింగ్స్ కలుగుతాయి. ఆ విషయం గగన్ చెవిలో పడేస్తుంది. తనకు ఫీలింగ్స్ లేవని మరదలుకు చెప్పిన గగన్, పార్థుతో పంపించడానికి ఓకే చెబుతాడు. అయితే ఇద్దరూ పెళ్లి నుంచి వెనక్కి అడుగు వేయలేని పరిస్థితి. తర్వాత ఏమైంది? గగన్, కుందన, పార్థు జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయి? అనేది సినిమా. 

విశ్లేషణ:

సాధారణ కథను సైతం అసాధారణంగా మార్చగల సత్తా ఉన్న అతి కొద్దిమంది నటులలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఎటువంటి కొత్తదనం లేని డ్యూడ్ కథకు తన మేనరిజమ్స్,‌ నటనతో కొత్త కళ అద్దాడు ప్రదీప్ రంగనాథన్. నటుడిగా తనకు ఎటువంటి పరిధిలు, పరిమితులు పెట్టుకోలేదు ప్రదీప్ రంగనాథన్. లూజర్ క్యారెక్టర్స్ చేయడం అతనికి ప్లస్ అవుతోంది.‌ ఈ సినిమాలోని అటువంటి క్యారెక్టర్ కావడంతో చాలా ఈజీగా చేసేసాడు. 

నటుడుగా ప్రదీప్ రంగనాథన్ 100% ఎఫర్ట్ పెడితే…‌‌ దర్శక రచయితగా కీర్తిశ్వరన్ మాత్రం కాలం చెల్లిన కథతో ప్రేక్షకులకు పరీక్ష పెట్టాడు. డ్యూడ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు కథలో అసలు ఎటువంటి కొత్తదనం లేదు. కానీ ప్రదీప్ రంగనాథన్ క్యారెక్టర్ – ఆ నటన చూసేలా చేయగలిగాయి. దర్శకుడు తీసుకున్నది బోల్డ్ పాయింట్. దాన్ని అంతే బోల్డుగా, ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్ వరకు ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్ కొంచెం బోర్డర్ దాటింది. పరువు హత్య కాన్సెప్ట్ ఇరికించినట్టు ఉంది. క్లైమాక్స్ రొటీన్ అయ్యింది. రైటింగ్ లూప్ హోల్స్ కవర్ చేసేలా మ్యూజిక్, టెక్నికల్ వేల్యూస్ ఉన్నాయి. సాయి అభ్యంకర్ మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్. సాంగ్స్, ఆర్ఆర్ ఫ్రెష్‌గా ఉన్నాయి. ఫస్టాఫ్ ఎంజాయ్ చేసేలా ఉంది. సెకండాఫ్ మెలోడ్రామా ఎక్కువ కావడంతో బోర్ కొట్టించిన మూమెంట్స్ వచ్చాయి. 

ప్రదీప్ రంగనాథన్ తప్ప మరొక నటుణ్ని గగన్ పాత్రలో ఊహించుకోలేం. అంత చక్కగా నటించారు. కామెడీ టైమింగ్ సూపర్. మేనరిజమ్స్ బావున్నాయి. మమితా బైజు డ్యాన్స్ ఒక్కటే కాదు, ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేసింది. శరత్ కుమార్ నటన లైవ్లీగా ఉంది. రోహిణి ఎప్పటిలా చేశారు. సత్య, నేహా శెట్టి అతిథి పాత్రల్లో నటించారు. 

తీర్పు:

బోల్డ్ కాన్సెప్ట్ తీసుకుని ఎటువంటి క్లాసులు పీకాకుండా ఏడుపులు పెడబొబ్బలు లేకుండా వినోదాత్మకంగా తీసిన సినిమా ‘డ్యూడ్’. ప్రదీప్ రంగనాథన్ కోసం ఈ సినిమాను ఒక్కసారి చూడొచ్చు. జస్ట్ ఫర్ ఫన్ డ్యూడ్… నథింగ్ మచ్!

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

మృత్యుంజయ్

మార్చి 6, 2026

విష్ణు విన్యాసం

ఫిబ్రవరి 27, 2026

కపుల్‌ ఫ్రెండ్లీ

ఫిబ్రవరి 16, 2026

ఫంకీ

ఫిబ్రవరి 14, 2026

విత్ లవ్

ఫిబ్రవరి 7, 2026