హనుమాన్ అంశ్

Published by
Srinivas

‘హనుమాన్ అంశ్’ చిత్రం బాలీవుడ్‌లో చాలా పెద్ద హిట్. విమర్శకుల ప్రశంసలు అందుకుని ఈ సినిమా దూసుకెళ్లింది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక గురువు, హనుమంతుని భక్తుడైన నీమ్ కరోలి బాబా కథే ఈ సినిమా. ఈయన గురించి దక్షిణాది వారికి చాలా తక్కువగా తెలుసు. ఉత్తరాదిలో నీమ్ కరోలి బాబా ఆలయాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా? తెలుసుకుందాం.

కథేంటంటే…

ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా అక్బర్‌పూర్‌లో జన్మించిన లక్ష్మణ్ నారాయణ్ శర్మ చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తండ్రి మరొకరిని వివాహం చేసుకోవడం లక్ష్మణ్‌కు నచ్చదు. తన తల్లిని శ్రీరాముడే తీసుకెళ్లాడని నమ్మి.. ఆయనను చేరుకునేందుకు హనుమంతుడిని ఆరాధిస్తూ.. ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. అక్కడి నుంచి లక్ష్మణ్ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది. ప్రవహించే నీరులా ఎక్కడా ఒకచోట ఉండడు. అలా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉత్తరాఖండ్‌లోని కైంచికి చేరుకుంటాడు. అక్కడే పదేళ్ల పాటు నివసిస్తాడు. అక్కడే కరోలి బాబాగా మారుతాడు. అక్కడి ప్రజలు కరోలి బాబాలోని మహత్యాన్ని గ్రహించి ఆయనకు సేవ చేస్తూ జీవిస్తూ ఉంటారు. కరోలి బాబా తన జీవిత కాలంలో ఏమేం చేశారు? ప్రజలకు ఎలాంటి సేవ అందించారు? వంటి విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే…

‘హనుమాన్ అంశ్’ చిత్రం చాలా సింపుల్‌గా నడుస్తుంది. భారీ హంగులు,ఆర్భాటాలు ఉండవు. విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆవిష్కరించింది. నిత్యం భగవన్నామ స్మరణ, నిస్వార్థ సేవ చేసేవారికి భగవంతుడే కొన్ని శక్తులు అందజేస్తాడనడానికి కొందరు వ్యక్తుల జీవితాలే నిదర్శనం. అలాంటి వ్యక్తులలో ఒకరి జీవితమే ఈ సినిమా. నీబ్ కరోలి బాబా గురించి ముఖ్యంగా దక్షిణాది వారికి పెద్దగా తెలియదు. తల్లిని కోల్పోయిన బాధ, జీవితానికి అర్థం వెతుక్కోవాలనే తపన ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే అంశాలే. ఈ సినిమాకు ప్రధాన బలం ఆధ్యాత్మికతను చూపించిన విధానమే. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడం వంటి అంశాలకు ఈ చిత్రంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. షిర్డీ సాయిబాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమాను పరిశీలిస్తే ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. సాయిబాబా జీవిత చరిత్రకు సంబంధించిన సినిమా చూసిన వారికి ఈ సినిమా ఆ ఫ్లేవర్‌ను అందిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇది తెలుగు ప్రేక్షకులకు ఎంత మేర నచ్చుతుందనేది ప్రధానాంశం. ఎందుకంటే కథంతా చాలా స్లోగా సాగుతుంది. అలాగే తెలుగు ప్రేక్షకులకు తెలియని వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణం. కాకపోతే హనుమంతుడు.. దాదాపుగా హిందువులందరికీ ఇష్టదైవం కాబట్టి దీనిపై ఆసక్తి ఉంటే ఉండొచ్చు. వేగవంతమైన కథనం, భారీ డ్రామా, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను ఆశించే ప్రేక్షకులకు ఇది ఏమాత్రం నచ్చదు.

ఎవరెలా చేశారంటే..

నీమ్ కరోలి బాబా పాత్రలో శోభినవ్ సత్యా నటన సినిమాకు ప్రధాన బలం. ఒక గౌరవనీయమైన ఆధ్యాత్మిక వ్యక్తి పాత్రను పోషించేటప్పుడు అతిగా నటించడం, ఆర్టిఫిషియల్ హావభావాలు ప్రదర్శిస్తే అది ఏమాత్రం వర్కవుట్ కాదు. శోభినవ్ సత్య ప్రశాంతమైన నటనతో పాత్రకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. మిగిలిన పాత్రదారులంతా బాగానే నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు విశాల్ చతుర్వేది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాను విశాల్ చతుర్వేది అనవసరమైన హంగులతో తెరకెక్కించలేదు. కథకు తగినట్లుగా చాలా సహజమైన వాతావరణంలో సినిమాను తీశారు. నిర్మాణ విలువలు సైతం పరిమితమే. కానీ స్లో నెరేషన్ కారణంగా ప్రేక్షకులకు కొంత మేర ఇబ్బంది అనిపిస్తుంది. సినిమాను చాలా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సినిమా అంతా ఆధ్యాత్మిక సంఘటన సమాహారంగా చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది. సంగీతం పర్వాలేదనిపిస్తుంది.

ఫైనల్‌గా.. ‘హనుమాన్ అంశ్’ ఓపికతో ప్రశాంతంగా చూస్తే తప్పక నచ్చుతుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

కామ్రేడ్‌ కళ్యాణ్

అక్టోబర్ 9, 2026

సిగ్మా

అక్టోబర్ 2, 2026

తెల్ల కాగితం

అక్టోబర్ 2, 2026

డోరతీ

అక్టోబర్ 2, 2026

అనుమాన పక్షి

సెప్టెంబర్ 25, 2026