K-Ramp

Published by
Srinivas

కె రాంప్ రివ్యూ: బోర్డర్ దాటిన అబ్బవరం!

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజ జంటగా నటించిన సినిమా ‘కె రాంప్’. దీపావళి బరిలో అన్నిటి తర్వాత వచ్చిన చిత్రమిది. జైన్స్ నాని దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కె రాంప్’. యుక్తి తరేజ కథానాయిక. జైన్స్ నాని దర్శకుడిగా పరిచయమయ్యారు. సాయి కుమార్, సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్ ఇతర ప్రధాన తారాగణం. దీపావళి బరిలో అన్ని చిత్రాల కంటే ఆలస్యంగా విడుదలైన చిత్రమిది. ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి. 

కథ:

తల్లి లేని బిడ్డ అని బాల్యం నుంచి కుమారుడు కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం)ని గారాబంగా పెంచుతాడు తండ్రి కృష్ణ (సాయికుమార్). దాంతో చదువు సంధ్యలు అబ్బకుండా మందు వెధవ తిరుగుళ్లకు అలవాటు పడి పెరుగుతాడు. కొడుకు దారిలోకి రావాలంటే కేరళ పంపించాలని పురోహితులు చెప్పింది నమ్మిన అలాగే చేస్తాడు తండ్రి. కేరళలో మెర్సీ జాయ్ (యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయికి మానసిక సమస్య ఉంటుంది. దాంతో కుమార్ అబ్బవరం ఎన్ని కష్టాలు పడ్డాడు? అమ్మాయి సమస్య తెలిశాక ఏం చేశాడు? అనేది కథ. 

విశ్లేషణ:

‘కె రాంప్’ టీజర్‌లో బూతులు ప్రేక్షకులు అవాక్కయ్యేలా చేశాయి. కిరణ్ అబ్బవరం నుంచి ఇటువంటి లేకి, బూతు కామెడీ ఏమిటని కుటుంబ ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారంతా. ఫీడ్ బ్యాక్ సీరియస్‌గా తీసుకుని ట్రైలర్‌లో బూతులు తగ్గించారు. సినిమా సైతం అలాగే సవ్యంగా ఉంటుందని భావిస్తే డబుల్ మీనింగ్ డైలాగ్స్‌లో కాలేసినట్టే. బీప్ సౌండ్స్, బూతు ధ్వనించే పదాలకు లోటు లేదు. ఈరోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. చీకటిగదిలో చితకొట్టుడు వంటి సినిమాల్లో అడల్ట్ సన్నివేశాలు ఉన్నాయి. కాని ‘కె రాంప్’ తరహాలో జుగుప్స కలిగించేలా లేవని చెప్పాలి.

‘కె రాంప్’లో కథ తక్కువ కనిపించింది. మాటల్లో కామం ఎక్కువ వినిపించింది. ఈ మాట హీరోతో పాటు దర్శక రచయితల మనసు నొప్పించే విధంగా ఉండొచ్చు. ఆ బాధ కలిగితే తండ్రీ కొడుకులుగా సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్ సంభాషణలు ఓ సామాన్య కుటుంబం కలిసి చూసేలా ఉన్నాయా? అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడకంలో కిరణ్ అబ్బవరం & గ్యాంగ్ బోర్డర్ దాటింది.

అడల్ట్ కామెడీలు తీయడం ఓ కళ. బోర్డర్ దాటకుండా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడటం అందరికి అబ్బే కళ కాదని అబ్బవరం & గ్యాంగ్ తీసిన సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఎంత చిల్లర వేషాలు వేసే మనిషి అయినా సరే బూతులు మాట్లాడితే అలవోకగా వచ్చినట్టు ఉండాలి కానీ ఆడియన్స్‌లో కొందరి వీక్‌నెస్ క్యాష్ చేసుకునేలా ఉండకూడదు. ఆ గీత హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు జైన్స్ నానికి తెలియలేదు. ఇప్పటి వరకు విమర్శించిన డైలాగ్స్, నరేష్ కిశోర్ ట్రాక్ మెచ్చే ప్రేక్షకులు తప్పకుండా ఉంటారు. అయితే అటువంటి సంభాషణలు, సన్నివేశాల వల్ల కుటుంబ ప్రేక్షకులకు కిరణ్ అబ్బవరం దూరమయ్యే పరిస్థితి ఉంది.

‘కె రాంప్’ కథలో హీరోయిన్ పాత్రకు ఎదురయ్యే సమస్య సగటు సభ్య సమాజంలో ఎంత మందికి ఉందో మనకు తెలియదు. అటువంటి సీరియస్ సబ్జెక్ట్ తీసుకుని లేకి కామెడీతో సినిమా తీయడం అసలు సమస్య. విశ్రాంతి వరకు రొటీన్ కథలా ఉన్నా, తర్వాత సమస్యలోకి వెళ్లడం వల్ల కొంత సీరియస్‌నెస్ వచ్చింది. కాని కామెడీ చేసి పారేశారు. సినిమాటిక్ స్వేచ్ఛ తీసుకుని మమ అంటూ ముగించారు. సమస్యకు సరైన పరిష్కారం లేదా ముగింపు ఇవ్వలేదు. సాంకేతికంగా చైతన్ భరద్వాజ్ పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు.

చిల్లర వేషాలు వేసే సంపన్నుడిగా కిరణ్ అబ్బవరం నటించారు. ఆయన నటనలో హుషారు ఉంది. అందాల ప్రదర్శనలో యుక్తి తరేజా హద్దులు పెట్టుకోలేదు. హీరోకి ముద్దులు పెట్టడంలో మొహమాట పడలేదు. నటన కంటే గ్లామర్‌కు ప్రాముఖ్యం ఇచ్చింది. వయసుకు తగ్గ పాత్రలు నరేష్ ఎంపిక చేసుకోవడం మంచిది. వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్ నవ్వించారు. సాయికుమార్ నటన గౌరవప్రదంగా ఉంది.

తీర్పు:

డబుల్ మీనింగ్ డైలాగ్స్‌లో బోర్డర్ దాటి మాస్ ఆడియన్స్ మెప్పు కోసం కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘కె రాంప్’. కుటుంబంతో కలిసి చూడలేం. మోస్తరు కామన్ సెన్స్ ఉన్న ఆడియన్స్ సైతం చూడలేరు. కామం ఎక్కువైన ఆడియన్స్ ఎంజాయ్ చేయవచ్చు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

సిగ్మా

అక్టోబర్ 2, 2026

తెల్ల కాగితం

అక్టోబర్ 2, 2026

డోరతీ

అక్టోబర్ 2, 2026

అనుమాన పక్షి

సెప్టెంబర్ 25, 2026

ది ప్యారడైజ్

సెప్టెంబర్ 24, 2026