శశివదనే

Published by
Srinivas

Sasivadane Review: గోదావరిపై గీసిన అందమైన ప్రేమ కథ!

రక్షిత్ అట్లూరి (Rakshit Atluri), కోమలి ప్రసాద్ (Komali Prasad) జంటగా సాయి మోహన్ ఉబ్బన (Sai Mohan Ubbena)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అహితేజ బెల్లంకొండ నిర్మించిన సినిమా శశివదనే (Sasivadane). ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల సంయుక్తంగా నిర్మించారు. హనుమాన్ చిత్రంతో పేరు తెచ్చుకున్న అనుదీప్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు. గోదావరి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.

కథ:

గోదావరి ప్రాంతంలో సగటు కుర్రాడు రాఘవ (రక్షిత్ అట్లూరి). ప్రేమగా చూసుకునే తండ్రి, స్నేహితుడి కంటే మిన్నగా ఎప్పుడూ తోడుగా ఉండే మావయ్య కొడుకు… రాఘవ జీవితం సరదాగా గడుస్తున్న రోజులవి. డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న అతను, శశి‌ (కోమలి ప్రసాద్)తో తొలిచూపులో ప్రేమలో పడతాడు. తొలుత పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని శశి… రాఘవను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించడం మొదలు పెడుతుంది. ఈ జంట ప్రేమకు ఎటువంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ప్రేమలో విజయం కోసం ఇద్దరూ ఎన్ని కష్టాలు పడ్డారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

గోదావరిపై గీసిన అందమైన పెయింటింగ్‌లా ఉంటుందీ ‘శశివదనే’. తెరపై ఆహ్లాదకరంగా కనిపించే దృశ్యాలు, చెవులకు శ్రావ్యంగా వినిపించే సంగీతం, చూడముచ్చటగా కనిపించే జంట… చిత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు అందమైన పెయింటింగ్ చూసినట్టే ఉంటుంది. పెయింటింగ్ మధ్యలో బొమ్మలు కొన్ని మనల్ని సహనంతో కూర్చునేలా చేస్తాయి.

శశివదనే విడుదలకు ముందు ప్రచార చిత్రాల్లో పతాక సన్నివేశాల గురించి చిత్ర బృందం గొప్పగా చెప్పింది. వాస్తవం మాట్లాడాలంటే ఆయా సన్నివేశాలు ప్రేక్షకులందరికీ ఒక షాక్ ఇస్తాయి. తండ్రిపై కుమారుడికి ఉన్న అమితమైన ప్రేమకు ఆ విధంగా జరగకూడదని ప్రేక్షకులు ఫీలయ్యేలా చేస్తుంది ప్రీ క్లైమాక్స్. ప్రియుడి కోసం అమ్మాయి చేసిన పని సైతం షాక్ ఇస్తుంది. భావోద్వేగాలు, పతాక సన్నివేశాలలో మలుపులు ప్రేక్షకులను 15 నిమిషాల పాటు ఎటూ కదలనివ్వకుండా చేస్తాయి.

పతాక సన్నివేశాల ముందు వరకు జరిగిన కథలో విజువల్ బ్యూటీ తప్ప బలమైన కంటెంట్ లేదు. సంగీతంతో, కెమెరా వర్క్‌తో కట్టిపడేసే ప్రయత్నం చేశారు దర్శకుడు. రచనలో బలమైన సంభాషణలు గాని సన్నివేశాలు గానీ రాసుకోలేదు. అందువల్ల విశ్రాంతికి ముందు ఆ తరువాత పతాక సన్నివేశాలు వచ్చేవరకు నిదానంగా సినిమా ముందుకు సాగింది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడానికి బలమైన కారణం అలాగే విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేయడంలో సినిమా కాస్త వెనకబడింది.

అనుదీప్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం సాధారణ సన్నివేశాలకు సైతం ప్రాణం పోసింది. శరవణన్ వాసుదేవ్ అందించిన స్వరాలు బావున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. కానీ కథ పరంగా నిరాశకు గురిచేసింది శశివదనే‌. ఎడిటింగ్ పరంగా కాస్త స్పీడ్ ఉండేలా చూసుకుంటే బాగుండేది.

శశివదనే థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులకు గుర్తు ఉండేది శశి పాత్రలో కోమలి ప్రసాద్ నటన. పల్లెటూరి అమ్మాయిగా ఆమె ఒదిగిన తీరు ప్రేక్షకులు మనసుల్లో ముద్ర వేసుకుంటుంది. ఇక రాఘవ పాత్రలో రక్షిత్ అట్లూరి చక్కగా నటించారు. తండ్రిగా శ్రీమాన్ ఎమోషనల్ సీన్స్ చేశారు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు.

తీర్పు:

మీకు ప్రేమ కథలు ఇష్టమైతే ‘శశివదనే’కి వెళ్లండి. శ్రావ్యమైన సంగీతం, చూడముచ్చటి జంట, అందమైన దృశ్యాలు… రెండు గంటల సమయం హాయిగా గడుస్తుంది. పతాక సన్నివేశాలు తప్ప కథలో బలం లేకపోవడం వల్ల అందమైన పెయింటింగ్ లాంటి సినిమా ఎప్పటికీ గుర్తుండే సినిమాను అందించలేకపోయింది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

బాలన్: ది బాయ్

జూన్ 20, 2026

దీవాన

జూన్ 20, 2026

వంద దేవుళ్లు

జూన్ 19, 2026

సింగ్ గీతం

జూన్ 12, 2026

గవర్నర్

జూన్ 12, 2026