ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రామాపురం వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ‘పల్లె పండుగ 3.0’ను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్లతో చేపట్టనున్న వివిధ గ్రామీణాభివృద్ధి పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు.. “ఉదయగిరి నుంచి పల్లెల్లో నవోదయానికి అడుగులు వేస్తున్నాం. మన గ్రామాల్లో అద్భుతమైన మార్పునకు నాంది పలుకుతున్నాం” అని అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పల్లె పండుగ 1.0, 2.0 మాదిరిగానే 3.0 కూడా విజయవంతమవుతుందని పేర్కొన్నారు.
2024 కంటే కూటమి హవా ఇప్పుడు మరింత పెరిగిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహిళల్లో కనిపిస్తున్న ఉత్సాహాన్ని ప్రస్తావిస్తూ.. రాబోయే పంచాయతీ ఎన్నికలకు సైతం వారు సిద్ధంగా ఉన్నారన్న భావన కలుగుతోందన్నారు.
పల్లె పండుగ 3.0లో భాగంగా గ్రామాల్లో రహదారి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్డు తీసుకురావడంతో పాటు రాకపోకలను సులభతరం చేస్తామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 880 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే నిర్మించారని చంద్రబాబు ఆరోపించారు. రోడ్ల కోసం ఖర్చు చేసిన నిధులపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో రోడ్ల కోసం ఖర్చు చేసిన సొమ్ము దుర్వినియోగమైందని ఆరోపించారు.
ప్రస్తుత ప్రభుత్వం పల్లె పండుగ 3.0 కింద రూ.2,700 కోట్లతో 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది.
రూ.11,085 కోట్లతో చేపట్టనున్న పల్లె పండుగ 3.0లో రోడ్లతో పాటు పలు గ్రామీణ మౌలిక వసతుల పనులు చేపట్టనున్నారు. రూ.300 కోట్లతో 22 వేల మినీ గోకులాలు, రూ.225 కోట్లతో 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి, రూ.110 కోట్లతో 1,000 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు. మరో రూ.200 కోట్లతో బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.
“బ్లీచింగ్ పౌడర్ కొనలేని స్థాయి నుంచి.. తమ గ్రామాలకు ఏం కావాలో వారే నిర్ణయించుకునే స్థాయికి పంచాయతీలను తీసుకొచ్చాం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
గ్రామీణ మౌలిక వసతులు, రైతు సంక్షేమం, పారిశుద్ధ్యం, ఉద్యాన అభివృద్ధి వంటి అంశాలకు పల్లె పండుగ 3.0లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్.. సీఎం చంద్రబాబు నాయుడిపై ప్రశంసలు కురిపించారు. “ఒక గ్రామానికి ఎలాంటి సదుపాయాలు కల్పించాలో మొదటిసారి దేశానికి చూపించిన దార్శనికుడు మన సీఎం చంద్రబాబు నాయుడు” అని వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పల్లె పండుగ 1.0, 2.0లో చేపట్టిన పనుల కొనసాగింపుగా 3.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తృతంగా మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.