దుబాయ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూఏఈతో పాటు సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దాదాపు 30 ఏళ్లుగా దుబాయ్ వస్తున్నా, ఈ సారి తెలుగు ప్రజల ఉత్సాహం ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. “గల్ఫ్‌లో ఉన్న తెలుగు వారు ఇప్పుడు గ్లోబల్ సిటిజెన్స్ మాత్రమే కాదు, గ్లోబల్ లీడర్స్‌గా మారుతున్నారు” అని ఆయన గర్వంగా తెలిపారు.
ఇక దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ శ్రీ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ — “నేను రెండేళ్లుగా దుబాయ్‌లో పని చేస్తున్నా, ఈ రోజు చంద్రబాబు గారికి లభించిన రిసెప్షన్ లాంటిది ఎప్పుడూ చూడలేదు. ఇది తెలుగు ప్రజల్లో ఆయన పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం,” అని అన్నారు.
చంద్రబాబు తన ప్రసంగంలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు ప్రజల త్యాగం, కృషిని కొనియాడారు. “మొన్న ఎన్నికల్లో మీరు సొంత ఖర్చుతో రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసి, కూటమి విజయానికి తోడ్పడ్డారు. మీరు చూపిన ఆ విశ్వాసం జీవితంలో మర్చిపోలేను,” అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
తన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తోందని చెప్పారు. “గతంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వచ్చింది, ఇప్పుడు విశాఖపట్నానికి గూగుల్ వస్తోంది. 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటవుతోంది,” అని చంద్రబాబు వెల్లడించారు.