కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీ ఎలా ఉండబోతుంది, అనేది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ లో ఈ పార్టీ ఎవరిని రాజకీయంగా ముంచబోతుంది…. ఎవరికి “ప్రాణాధారం” గా నిలువబోతుంది, అనేది రాష్ట్రం అంతా చర్చనీయాంశంగా మారింది. ఆమె అడుగులు ఎలా ఉండబోతున్నాయి. ఆమె పెట్టే పేరు ఎలా ఉంటుందో అని సోషల్ మీడియా లో విపరీతంగా చర్చ మొదలైంది. ఆమె పార్టీ ఏ ఏ అంశాల పై దృష్టి పెట్టబోతుంది. కేంద్రం తీసుకువస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమె తన రాజకీయ అస్త్రంగా ఎలా మార్చుకోబోతున్నారు….? ఈ పరిణామాలు రాష్ట్ర మరియు జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయనున్నాయి…? అనేది సోషల్ మీడియా ఆధారంగా ఒకసారి పరిశీలించి విశ్లేషిద్దాం.
”మహిళా బిల్లు” : బీజేపీ ప్రభుత్వం ‘నారీ శక్తి వందన్ అధినియం’ ద్వారా చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, దాని అమలులో ఉన్న సాంకేతిక అంశాలు (జనగణన, నియోజకవర్గాల పునర్విభజన) కొంత జాప్యానికి కారణమవుతున్నాయి. సరిగ్గా ఇక్కడే కల్వకుంట్ల కవిత తన రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నారు. కేవలం చట్టం వస్తే సరిపోదు, అది తక్షణమే అమలు కావాలని, అందులోనూ సామాజిక న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ అమలులో ఉంది. అయితే, చట్టసభల్లో (లోక్‌సభ మరియు అసెంబ్లీలలో) ఎస్సీ (SC), ఎస్టీ (ST)లకు ఉన్నట్లుగా ఓబీసీలకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు లేవు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) విషయంలో ఓబీసీ కోటా అనేది ప్రధాన చర్చనీయాంశమైంది. ప్రస్తుత మహిళా బిల్లు లో 33% కోటాలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు అంతర్గత రిజర్వేషన్లు కల్పించారు. ఈ 33% రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కేటాయించలేదు. దీనివల్ల ఓబీసీ వర్గాలకు చెందిన మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించదని కవిత తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు వాదిస్తున్నారు.
ఈమే పెట్టబోయే నూతన పార్టీకి ప్రధాన అజెండా గా ఈ “ఓబీసీ సబ్ కోటా” నినాదం గా మారబోతోంది అని అంటున్నారు. ఓబీసీ కోటా లేకపోతే చట్టసభల్లో బలహీన వర్గాల మహిళల ప్రాతినిధ్యం, తగ్గిపోతుందనేది ఆమె వాదన. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో 50% పైగా ఉన్న ఓబీసీ జనాభాను ఆకర్షించడానికి, “బీసీ మహిళల హక్కుల కోసం పోరాడే పార్టీ”గా తన పార్టీ ని తీర్చిదిద్దబోతున్నారు అని రహస్య రాజకీయ వర్గాల బోగట్టా….
పార్టీ స్థాపనతో పాటు ఆమె మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఒక కొత్త తరం మహిళా నాయకత్వాన్ని తయారు చేయడం. ప్రతి గ్రామాన ‘మహిళా సంఘాల’ (SHG) స్థాయికి చొచ్చుకు పోయేలా తమ పార్టీ ని తీసుకువెళ్లి రిజర్వేషన్ల ప్రాముఖ్యతను వివరించడం. చట్టంతో సంబంధం లేకుండా, తన పార్టీలో ముందస్తుగానే మహిళలకు 33% కంటే ఎక్కువ టికెట్లు కేటాయించి “ఆదర్శ పార్టీ”గా నిలబెట్టడం.
కేంద్రం తో ప్రతి అంశంపై పోరాడుతున్న డీఎంకే , టీఎంసీ లాంటి ప్రాంతీయ పార్టీలను (DMK, TMC వంటివి) ఏకం చేసి, కేంద్రంపై ఒత్తిడి పెంచి పోరాడటం.
తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతిని ఎలా గ్రామ గ్రామాన ఎలా నెలకొల్పి జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించారో, అలానే ఇప్పుడు రాజకీయ పార్టీ ద్వారా రాష్ట్ర హక్కుల కోసం గళం వినిపించి తమ పార్టీ అస్తిత్వానికి ఒక గుర్తింపు దేశ స్థాయిలో కల్పించడం. ఆవిడ ముందు ఉన్న తక్షణ కర్తవ్యం గా భావిస్తున్నారు అని నెటిజన్లు సోషల్ మీడియా వేదిక గా తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.
మహిళా బిల్లు అనేది కవిత గారికి ఒక రాజకీయ వేదికను సిద్ధం చేసింది. ఒకవైపు మహిళా సాధికారత, మరోవైపు ఓబీసీ సబ్-కోటా.. ఈ రెండు అంశాలతో ఆమె ప్రజల్లోకి వెళ్లనున్నారు. అయితే, ఈ కొత్త పార్టీ పేరు మరియు విధివిధానాలపై అధికారిక స్పష్టత వచ్చే వరకు రాజకీయ వర్గాల్లో ఈ ఆసక్తి ఇలాగే కొనసాగుతుంది.
తెరాస నుండి భారాస గా మారడం వలన తమ పార్టీ ఓడిపోయింది అని, అది పార్టీలో, ప్రజల్లో వాళ్ళ మనసులోకి చొచ్చుకుపోయిన పేరు అని, దానిని మార్చడం వలన ప్రజల్లో సెంటిమెంట్ లేకుండా పోయింది అని తన సన్నిహిత వర్గాల వద్ద వ్యాఖ్యనిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఆ పదం ద్వనించేల తమ పార్టీ పేరు ఉండాలని ఆమె ఆలోచిస్తున్నట్లు గా చెబుతున్నారు. ఆమె పరిశీలనలో “తెలంగాణ రాజ్య సమితి” అనే పేరును ఖరారు చేసే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తుంది. సెంటిమెంట్ చెడకుండా అదే సౌండ్ ధ్వనించేలా ఆమె ఈ పేరు సెలెక్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.