కర్ణాటక రాజకీయ పీఠంపై నూతన సీఎం గా DK శివకుమార్ ప్రమాణ స్వీకారం తో నూతన అధ్యాయం మొదలవుతుంది. సామాజిక సమీకరణాల నడుమ కాంగ్రెస్ అధికార మార్పిడి వ్యూహం ప్రస్తుతానికి సాఫీగానే జరుగుతుంది. బుధవారం సాయంత్రం 4.05 నిముషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు D k శివ కుమార్. ఆయన తో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అధికార నివాసం అయిన కావేరి బంగ్లా లోనే సిద్ధరామయ్య ఉండబోతున్నారు. DK శివ కుమార్ కు వేరే బంగ్లా కేటాయించేటట్లుగా తెలుస్తుంది. ఆ విధంగా వారి మధ్య సయోధ్య కుదిరింది. బెంగళూరులోని లోక్ భవన్ (రాజ్ భవన్) ప్రాంగణంలో ఉన్న గ్లాస్ హౌస్ లో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు.
సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఇప్పటికే ఆమోదించారు. డి.కె. శివకుమార్ దిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో కొత్త క్యాబినెట్ కూర్పు, డిప్యూటీ సీఎంల నియామకంపై చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత గా ఎన్నికైన డీకే , అనంతరం ప్రమాణ స్వీకార అధికారిక తేదీ మరియు సమయాన్ని ఖరారు చేసుకున్నారు.
కర్ణాటక రాజకీయ పీఠంపై సుదీర్ఘకాలంగా సాగుతున్న అంతర్గత అధికార పీఠం మార్పిడి కోసం ఉత్కంఠకు తెర దించుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడం జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల విజయానంతరం కాంగ్రెస్ అధిష్ఠానం తెరవెనుక కుదిర్చిన పవర్-షేరింగ్ (అధికార విభజన) ఫార్ములా ప్రకారమే ఈ మార్పు జరుగుతుంది. దేశంలోనే అత్యంత కీలకమైన దక్షిణాది రాష్ట్రంలో సామాజిక సమీకరణాల రీత్యా ఇది ఒక పెద్ద మలుపు. మే 2026 నాటికి, మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య తప్పుకోవడంతో, డి.కె. శివకుమార్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం అయ్యింది.
ఈ పరిణామం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరిన ఒప్పందం కాదని, రాష్ట్రంలోని ఓటు బ్యాంక్ సమీకరణాలను, ప్రభుత్వ భవితవ్యాన్ని మార్చే ఒక వ్యూహాత్మక అడుగు అని స్పష్టమవుతోంది. ఈ సంచలన మార్పు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద చర్చకు దారితీయడానికి ప్రధాన కారణం కర్ణాటకలోని సామాజిక ఆధిపత్య పోరాటమే. సిద్ధరామయ్య వెనుకబడిన తరగతులు, దళితులు, మరియు మైనారిటీల ఐక్య కూటమి అయిన అహింస (AHINDA – అల్పసంఖ్యాకాతరు, హిందుళిదవరు, దలితరు) ఓటు బ్యాంక్‌కు తిరుగులేని ప్రతినిధి. కాగా, ముఖ్యమంత్రి కాబోతున్న డి.కె. శివకుమార్ కర్ణాటకలోనే అత్యంత ప్రభావవంతమైన, భూస్వామ్య మరియు రాజకీయ ఆధిపత్యం కలిగిన “ఒక్కలిగ” సామాజిక వర్గానికి చెందిన అగ్రనేత.
రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్లలో వీరికి ప్రత్యేక కోటా (3A కేటగిరీ కింద 4%) ఉన్నప్పటికీ, కేంద్ర స్థాయిలో వీరు ఓసి (General Category) గానే పరిగణించబడతారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 60 శాతం పైగా ఉంటూ సిద్ధరామయ్యకు అండగా నిలిచిన ఒక బలమైన ఓబీసీ (OBC) కూటమి నేత స్థానంలో, సాంప్రదాయ అగ్రవర్ణానికి చెందిన నేత పీఠం ఎక్కడం వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌కు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
రాజీనామా చేసిన సిద్ధరామయ్య బలాలు, బలహీనతల ను విశ్లేషిస్తే… ఆయన కర్ణాటకలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన మాస్ లీడర్ కావడం ఆయనకున్న అతిపెద్ద బలం. ఐదు గ్యారంటీ వంటి విప్లవాత్మక ఉచిత పథకాల ద్వారా పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆయన సంపాదించుకున్న ఆదరణ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచింది. అయితే, సొంత పార్టీలోనే ఉన్న ఒక్కలిగ, లింగాయత్ వంటి ఇతర బలిష్టమైన సామాజిక వర్గాల నేతలను ఎల్లప్పుడూ సమన్వయం చేసుకోలేకపోవడం మరియు తాజా ‘ముడా’ (MUDA) భూముల వివాదం వంటి చట్టపరమైన సవాళ్లు ఆయనకు బలహీనతలుగా మారాయి. తన రాజీనామా తర్వాత కూడా తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకుండా కర్ణాటకలోనే ఉంటానని ప్రకటించడం ద్వారా, రాష్ట్రంలో తానొక “ప్రత్యామ్నాయ పవర్ సెంటర్”గా కొనసాగుతానని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో శివకుమార్ నిర్ణయాలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.
మరోవైపు, నూతనంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్న డి.కె. శివకుమార్ బలాలు రాజకీయ వ్యూహకర్తలను సైతం ఆశ్చర్యపరుస్తాయి. పార్టీలో అత్యంత నమ్మకమైన ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన ఆయనకు బలమైన ఆర్థిక వనరులు, కేడర్‌ను నడిపించే అద్భుతమైన సంస్థాగత నైపుణ్యం ఉన్నాయి. పాత మైసూరు, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఒక్కలిగ సామాజిక వర్గంపై ఆయనకున్న పట్టు కాంగ్రెస్‌కు పెద్ద అండ. కాని, ఆయనకు ఉన్న అతిపెద్ద బలహీనత గతంలో నమోదైన ఐటీ, ఈడీ ఆర్థికపరమైన కేసులు. వీటిని అడ్డం పెట్టుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షాలు ఎప్పుడైనా ఆయనను ఇరుకున పెట్టే ప్రమాదం ఉంది. పైగా మాస్ ఇమేజ్ పరంగా సిద్ధరామయ్య స్థాయి సోషల్ బేస్ (అహింస కూటమి పట్టు) శివకుమార్‌కు లేకపోవడం ఆయనకు ఒక మైనస్.
ఈ అధికార మార్పిడి నేపథ్యంలో నూతన ముఖ్యమంత్రిగా శివకుమార్‌కు తొలి రోజు నుండే సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యమంత్రి మారినందున పాత క్యాబినెట్ రద్దయి, పూర్తిగా కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సిద్ధరామయ్య వర్గానికి చెందిన సీనియర్ మంత్రులు కీలక శాఖల కోసం ఒప్పందాల ఒత్తిడి తెస్తుండగా, మరోవైపు జనాభా పరంగా పెద్ద వర్గమైన లింగాయత్‌లు తమకు కూడా ఉపముఖ్యమంత్రి పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కుల సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ అసమ్మతి రాకుండా మంత్రివర్గాన్ని కూర్చడం శివకుమార్‌కు అత్యంత కఠినమైన పరీక్ష కానుంది.
దీనికి తోడు, గ్యారంటీ పథకాల రూపంలో ఉన్న ఆర్థిక భారం శివకుమార్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ఈ సంక్షేమ పథకాల ఘనత అంతా ప్రజల్లో సిద్ధరామయ్య ఖాతాలోనే పడిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాపై పడుతున్న వేల కోట్ల భారాన్ని మోస్తూనే, ఈ పథకాలను అంతే సమర్థవంతంగా డీకే శివకుమార్ కొనసాగించాల్సి ఉంటుంది. ఒకవేళ నిధుల కొరతతో ఎక్కడైనా పథకాల అమలు కుంటుపడితే, “సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగుండేది” అనే విమర్శ ప్రజల నుంచే కాకుండా సొంత పార్టీ శ్రేణుల నుంచే వచ్చే ప్రమాదం కూడా ఉంది.
ఈ అంతర్గత సందిగ్ధతను అనుకూలంగా మార్చుకోవడానికి కర్ణాటకలో బలమైన ప్రతిపక్షాలైన బీజేపీ మరియు జేడీఎస్ (HD కుమారస్వామి) కూటమి ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసింది. సిద్ధరామయ్య తప్పుకున్న క్షేత్రస్థాయి ఉద్రిక్తతలను, సామాజిక అసంతృప్తిని వాడుకుని కాంగ్రెస్ సంకీర్ణాన్ని బలహీనపరచాలని వారు భావిస్తున్నారు. శివకుమార్‌పై ఉన్న పాత కేసులను మళ్లీ తెరపైకి తెచ్చి నైతికంగా దెబ్బతీయడానికి, తద్వారా 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే పునాది వేయడానికి విపక్ష కూటమి దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. అని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు బావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, సిద్ధరామయ్య రాజీనామా మరియు డి.కె. శివకుమార్ పట్టాభిషేకం అనేది పైకి ప్రశాంతమైన అధికార మార్పిడిలా కనిపిస్తున్నా, లోపల అనేక రాజకీయ సుడిగుండాలు దాగి ఉన్నాయి. “సిద్ధరామయ్య” నుంచి “శివకుమార్”కు లభించే క్షేత్రస్థాయి మద్దతు, అహింస ఓటర్లలో నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, మరియు ఆర్థిక సవాళ్లను అధిగమించడంపైనే ఈ నూతన ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ తన సొంత సర్కారులోని అంతర్గత విభేదాలను పరిష్కరించి 2028 వరకు బండిని సజావుగా నడిపిస్తారా, లేక కర్ణాటక రాజకీయం మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.