తెలంగాణ రాజకీయ యవనికపై శనివారం ఒక సంచలన ఘట్టం ఆవిష్కృతమైంది. సుదీర్ఘ కాలం పాటు తన తండ్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి, ఉద్యమ సమయం నుంచి ‘జాగృతి’ ద్వారా సంస్కృతిని చాటిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు సొంత రాజకీయ అస్తిత్వం కోసం ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సాక్షిగా ‘సర్వోదయ తెలంగాణ’ నినాదంతో ఆమె కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.
“జెండా రంగులు” తో తన పార్టీ భావజాలాన్ని, తన దూరదృష్టిని, అంతరంగాన్ని ఆవిష్కరించారు. సామాజిక విప్లవానికి సంకేతాలు గా, కవిత తన పార్టీ జెండాను మూడు ముఖ్యమైన రంగులతో “పసుపు, నీలం, తెలుపు” రూపొందించారు. కేవలం అలంకారం కోసం కాకుండా, వీటి వెనుక లోతైన రాజకీయ మరియు సామాజిక అర్థాలు ఉన్నాయి.
“పసుపు” (Yellow): జెండా మొత్తం పసుపు రంగులో ఉండటం అభివృద్ధికి, ఐశ్వర్యానికి మరియు సౌభాగ్యానికి గుర్తు. ఇది ప్రధానంగా రైతు సంక్షేమాన్ని, వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. ధాన్యాన్ని పసిడి తో పోలుస్తారు.
“నీలం” (Blue): జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్‌ను నీలం రంగులో ముద్రించారు. ఇది సామాజిక న్యాయం మరియు బహుజన రాజ్యాధికారానికి సంకేతం. అణగారిన వర్గాల గొంతుకగా పార్టీ నిలుస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇది శ్రామిక శక్తికి నిదర్శనం
“తెలుపు” (White): TRS అనే అక్షరాలు తెలుపు రంగులో ఉన్నాయి. ఇది శాంతి, స్వచ్ఛత, పారదర్శకత మరియు నిస్వార్థమైన పాలనకు గుర్తు.
ఇలా మూడు రంగులతో, తండ్రి “తెలంగాణ రాష్ట్ర సమితి” గుర్తు చేసేలా(TRS), తెలంగాణ రాష్ట్ర సేన గా(TRS) పేర్కొన్నారు.
కృష్ణుడు పాంచజన్యం గుర్తుకు వచ్చేలా, ఐదు హామీలు ప్రకటిస్తున్న అని ప్రజల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. కవిత ప్రకటించిన ‘పంచజన్యం’ ఎజెండా మధ్యతరగతి, పేద వర్గాలను నేరుగా తాకేలా ఉంది.
“విద్య” ప్రైవేట్ పాఠశాలల్లో సైతం ఉచిత విద్య,
“వైద్యం” కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం.
“యువతకు ఊతం” ఇచ్చేలా 2 లక్షల రూపాయలు నుంచి 20 కోట్ల వరకు రుణాలు, 4 లక్షల ఉద్యోగాల భర్తీ. “ఉద్యమకారులకు గౌరవం” లక్ష మంది ఉద్యమకారులకు ‘సూపర్ న్యూమరరీ’ పోస్టుల ప్రకటన.
“కవిత” నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సేన (TRS) భవిష్యత్తు ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన రాజకీయ వ్యూహకర్త “ప్రశాంత్ కిషోర్” (PK) బృందం పర్యవేక్షణలో ఈ పార్టీ కార్యకలాపాలు సాగుతుండటం పెద్ద అడ్వాంటేజ్. క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ ప్రకారం ఎజెండా రూపొందించడం వల్ల ప్రజలకు త్వరగా చేరువయ్యే అవకాశం ఉంది.
అసంతృప్త నేతలకు వేదిక అయ్యేలా కనిపిస్తుంది. బీఆర్ఎస్ (BRS)లో ప్రాధాన్యత కోల్పోయిన సీనియర్లు, టికెట్లు దక్కని నేతలు కవిత వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ నేతలు ఆమెతో టచ్‌లో ఉండటం పార్టీ బలాన్ని పెంచుతుంది.
తెలంగాణ సెంటిమెంట్ ను, తండ్రి వదిలేసిన “టీఆర్ఎస్” సెంటిమెంట్‌ను తిరిగి రగిల్చడం ద్వారా, సెంటిమెంట్ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం సఫలమైతే ఆమె కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది.
”అప్పటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరు” అంటూ కవిత చేసిన తిరుగుబాటు వ్యాఖ్యలు ఆమె రాజకీయ తెగింపును చూపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలతో పాటు, సొంత తండ్రి పార్టీ బీఆర్ఎస్ తోనూ ఆమె పోరాడాల్సి ఉంటుంది. పైగా ఆమె “సర్వోదయ తెలంగాణ” అంటుంది, అంటే అందరి అభివృద్ధి.. ఇదే కవిత పార్టీ అంతిమ లక్ష్యం అని చెబుతుంది.
తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పిందని భావిస్తున్న ఉద్యమకారులు, సామాజిక న్యాయం కోరుకుంటున్న బహుజనులు కవిత వైపు మొగ్గు చూపితే, రాష్ట్ర రాజకీయాల్లో “తెలంగాణ రాష్ట్ర సేన” బలమైన శక్తిగా ఎదగడం ఖాయం. పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతానని ఆమె ఇస్తున్న హామీని ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేదే ఇప్పుడు మిగిలి ఉన్న ప్రశ్న. కాలమే సమాధానం చెబుతుంది.
ముగింపు: సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందన వేరే రకం గా ఉంది. కేసీఆర్ ను ఆమె విమర్శించడం జీర్ణించుకోలేక పోతున్నారు. తన రాజకీయ అవకాశానికి , ఎదుగుదల కోసం మాత్రమే ఈ తపన తప్ప, తండ్రి మీద లేని ప్రేమ జనం మీద ఎందుకు ఉంటుంది అని ఒక నెటిజన్ ప్రశ్నించడం గమనార్హం.