టాలీవుడ్ యువ స్టార్ నితిన్ వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఎన్నో బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు శ్రీను వైట్ల కూడా గత కొన్నేళ్లుగా సరైన హిట్ రాక డిజాస్టర్లను మూటగట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరూ కలిసి ఒక కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
2016 నుంచి 2025 మధ్య నితిన్ నటించిన చిత్రాలలో ‘భీష్మ’ మాత్రమే మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన ‘తమ్ముడు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో నితిన్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఇక శ్రీను వైట్ల విషయానికొస్తే, ఒకప్పుడు కామెడీ మరియు మాస్ ఎంటర్‌టైనర్స్ రెడీ, దూకుడు, బాద్ షా వంటి సూపర్‌హిట్స్ అందించిన ఆయన, ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొన్నారు. ఇటీవల గోపీచంద్ హీరోగా వచ్చిన విశ్వంతో కూడా శ్రీను వైట్ల కు పెద్దగా ఒరిగిందేమి లేదు. ఇలాంటి సమయంలో నితిన్‌తో ఆయన కలయిక ఆసక్తికరంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా నిజమైతే, మరి అది ఏమవుతుందో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.