సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో సాయిదుర్గ తేజ్ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’..

Published by
Srinivas

సాయిదుర్గ తేజ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ (SYG) సినిమాకు ఎట్టకేలకు రిలీజ్ డేట్ వచ్చేసింది. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. భారీ స్థాయిలో తెరకెక్కుతుండటంతో నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టింది. ఒక దశలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే మేకర్స్ మాత్రం సినిమాను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు.

తాజాగా ‘సంబరాల ఏటి గట్టు’ షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే సినిమా విడుదల తేదీని కూడా లాక్ చేసింది. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో సాయిధుర్గ తేజ్ ఇంటెన్స్, రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఒళ్లంతా రక్తపు మరకలు, గాయాలతో ఉన్న ఆయన.. చుట్టూ మంటలు వ్యాపించిన ప్రాంతంలో చేతిలో ఆయుధంతో ధైర్యంగా నడుచుకుంటూ వస్తున్నారు. సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తున్న తేజ్ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

‘సంబరాల ఏటి గట్టు’లో సాయిధుర్గ తేజ్ ఇప్పటివరకు చూడని విధంగా పూర్తిగా భిన్నమైన, ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్, డ్రామా అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యం ఉన్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ వచ్చింది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

భారీ క్యాన్వాస్, యాక్షన్ ఎలిమెంట్స్, బలమైన నటీనటుల బృందంతో రూపొందుతున్న ‘సంబరాల ఏటి గట్టు’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. రెండేళ్లకు పైగా సాగిన షూటింగ్‌కు ముగింపు పలికిన మేకర్స్.. ఇప్పుడు ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు.

‘సంబరాల ఏటి గట్టు’ 2027 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts