వార్తలు

తెలంగాణలో ఘనంగా ఈశా గ్రామోత్సవం.. 9,600 మందికిపైగా గ్రామీణ క్రీడాకారుల భాగస్వామ్యం

Published by
Srinivas

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఐక్యత, సమిష్టి భావనను ప్రోత్సహించే ఈశా గ్రామోత్సవం 2026 తెలంగాణ ఎడిషన్ ఘనంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ క్రీడా వేడుకల్లో 9,630 మంది గ్రామీణ క్రీడాకారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన డివిజనల్ రౌండ్ (స్టేట్ ఫైనల్)తో తెలంగాణ ఎడిషన్ కీలక దశకు చేరుకుంది.

ఈ ఏడాది తెలంగాణలోని 15 జిల్లాల్లో 25 ప్రాంతాల్లో ఈశా గ్రామోత్సవం నిర్వహించారు. మొత్తం 843 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఇందులో 7,200 మంది ఆటగాళ్లతో కూడిన 600 పురుషుల వాలీబాల్ జట్లు, 2,430 మంది ఆటగాళ్లతో కూడిన 243 మహిళల త్రోబాల్ జట్లు ఉన్నాయి.

క్లస్టర్ స్థాయి మ్యాచ్‌ల్లో ప్రతిభ చూపిన 28 జట్లు ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి డివిజనల్ రౌండ్‌లో తలపడ్డాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌తో పాటు కోయంబత్తూరులో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో పాల్గొనే అవకాశం దక్కనుంది.

మహిళల త్రోబాల్‌లో కొయచలక వారియర్స్ విజయం

మహిళల త్రోబాల్ ఫైనల్‌లో గోయచల్క గ్రామానికి చెందిన కొయచలక వారియర్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో పాపడ్పల్లికి చెందిన పాపడ్పల్లి ఫైటర్స్ జట్టుపై విజయం సాధించి రాష్ట్ర త్రోబాల్ ఛాంపియన్‌గా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకు చెందిన రాణి రుద్రమ దేవి జట్టు, సంగారెడ్డి జిల్లాకు చెందిన చింతల్ చెరువు జట్టు వరుసగా మూడు, నాలుగు స్థానాలను సొంతం చేసుకున్నాయి.

వాలీబాల్ టైటిల్ దేవుని పడకల్‌కు

పురుషుల వాలీబాల్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన దేవుని పడకల్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరికల్ జట్టును ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన గాడిపెద్దాపూర్, నల్గొండ జిల్లాకు చెందిన వెలుమినేడు బ్రదర్స్ జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

మహిళల భాగస్వామ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం

ఈసారి ఈశా గ్రామోత్సవంలో దాదాపు 2,500 మంది మహిళలు పాల్గొనడం విశేషం. ఖమ్మం జిల్లాకు చెందిన 84 ఏళ్ల నరసమ్మ, 83 ఏళ్ల కోటమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈశా గ్రామోత్సవ చరిత్రలో పాల్గొన్న అత్యంత పెద్ద వయస్కులుగా వీరు నిలిచారు. తెలంగాణ నుంచి వరుసగా నాలుగో ఏడాది కూడా వృద్ధ మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనడం గ్రామీణ ప్రజల్లో క్రీడలపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది.

గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న క్రీడా ఉద్యమం

ఈశా గ్రామోత్సవం కేవలం ప్రధాన పట్టణాలకే పరిమితం కాకుండా భద్రాద్రి కొత్తగూడెం వంటి ప్రాంతాలకు కూడా విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లోనే మ్యాచ్‌లు నిర్వహించడం ద్వారా స్థానిక ప్రజలను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంచుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

గ్రామీణ అభివృద్ధి, క్రీడల ప్రోత్సాహానికి చేస్తున్న కృషికి ఈశా గ్రామోత్సవానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ‘ఫిట్ ఇండియా’ గుర్తింపుతో పాటు భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (NSPO)గా గుర్తింపు పొందింది. క్రీడలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో చేసిన కృషికి 2018లో రాష్ట్రీయ్ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ కూడా అందుకుంది.

దేశవ్యాప్తంగా 80 వేల మందికిపైగా క్రీడాకారులు

ఈశా గ్రామోత్సవం ప్రస్తుతం 18వ ఎడిషన్‌లో కొనసాగుతోంది. 10 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 7,000 జట్లు, 40,000కుపైగా గ్రామాల నుంచి 80,000 మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో సుమారు 15,000 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు.

ఈశా అవుట్‌రీచ్‌ ఆధ్వర్యంలోని ‘యాక్షన్ ఫర్ రూరల్ రెజువనేషన్’ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు పుదుచ్చేరిలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. క్లస్టర్ మ్యాచ్‌లు, డివిజనల్ రౌండ్లు, గ్రాండ్ ఫినాలే—మూడు దశల్లో పోటీలు కొనసాగుతాయి.

విజేతలకు భారీ నగదు బహుమతులు

ఈ ఏడాది ఈశా గ్రామోత్సవం మొత్తం ప్రైజ్ మనీ రూ.1 కోటికిపైగా ఉంది. తెలంగాణ డివిజనల్ రౌండ్‌లో వాలీబాల్, త్రోబాల్ విజేతలకు రూ.15,000 చొప్పున, రన్నరప్‌లకు రూ.10,000 చొప్పున అందజేస్తారు. మూడో స్థానానికి రూ.6,000, నాలుగో స్థానానికి రూ.4,000 చొప్పున బహుమతులు ఉంటాయి.

రాష్ట్రస్థాయి విజేత జట్లు సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో పోటీపడనున్నాయి. అక్కడ విజేత జట్లకు రూ.5 లక్షలు, రన్నరప్‌లకు రూ.3 లక్షలు, మూడో స్థానానికి రూ.1 లక్ష, నాలుగో స్థానానికి రూ.50,000 చొప్పున నగదు బహుమతులు అందించనున్నారు.

తెలంగాణలో ఈశా గ్రామోత్సవం నిర్వహణకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) సహకారం అందించింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు చెందిన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఫ్రాంచైజీ కూడా ఈ కార్యక్రమంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈశా గ్రామోత్సవం 18వ ఎడిషన్‌కు గ్రావ్టన్ మోటార్స్ మొబిలిటీ పార్టనర్‌గా, నివియా స్పోర్ట్స్ స్పోర్ట్స్ & ఎక్విప్‌మెంట్ పార్టనర్‌గా, టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బ్రాంజ్ పార్టనర్‌గా, వండర్ సిమెంట్ ఆన్-గ్రౌండ్ సపోర్ట్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి.

అదేవిధంగా సిజి పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్, వరిందర కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్, రాయల్ ఇన్‌ఫ్రాకన్స్ట్రక్ట్ లిమిటెడ్, అగిలిసియమ్ కన్సల్టింగ్ సంస్థలు CSR భాగస్వాములుగా ఈ కార్యక్రమానికి మద్దతు అందిస్తున్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts