సినిమా వార్తలు

సుమంత్ ప్రభాస్ ‘బబ్లూ XXL’ ఫస్ట్ స్పార్క్ రిలీజ్..

Published by
Srinivas

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ మరో ఆసక్తికరమైన ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు పుష్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ ఎన్. నారంగ్ నిర్మిస్తున్న చిత్రం ‘బబ్లూ XXL’. సోనాలి నారంగ్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆయన, తన రెండో సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

దీపావళి సందర్భంగా చిత్రబృందం ‘బబ్లూ XXL’ నుంచి ఫస్ట్ స్పార్క్‌ను విడుదల చేసింది. బబ్లూ ప్రేమకథకు శ్రీకారం ఎలా పడుతుందో సరదాగా, అందంగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. తొలిచూపులోనే ప్రేమలో పడే క్షణాల్లో ఉండే ఆనందం, ఉత్సాహం, చిన్న చిన్న భావోద్వేగాలను యూత్‌ఫుల్ టచ్‌తో ప్రజెంట్ చేశారు.

ఈ గ్లింప్స్ ద్వారా గహజీ ఎస్‌కేను కథానాయికగా పరిచయం చేశారు. బబ్లూతో ఆమెకు జరిగే తొలి పరిచయం కథలో ఆసక్తికరమైన రొమాంటిక్ ట్రాక్‌కు పునాది వేస్తుంది. సుమంత్ ప్రభాస్, గహజీ ఎస్‌కే మధ్య కనిపించిన ఫ్రెష్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన అందం, సహజమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో గహజీ తొలి పరిచయంలోనే ఆకట్టుకున్నారు.

మరోవైపు సుమంత్ ప్రభాస్ తనదైన కామెడీ టైమింగ్, ఎనర్జీతో బబ్లూ పాత్రలో అలరించారు. ఈ గ్లింప్స్‌లో ఆయన సాయిపల్లవి వీరాభిమానిగా కనిపించడం మరో ఆసక్తికరమైన అంశం. యూత్‌ను ఆకట్టుకునే వినోదం, రొమాన్స్‌తో ఈ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

మంచిర్యాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, జయలలిత, శివాజీ రాజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం, నేపథ్య సంగీతం ఫస్ట్ స్పార్క్‌లోని రొమాంటిక్ మూడ్‌కు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి.

వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నరేష్ అడుప ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎల్లపు ఆర్ట్ డైరెక్టర్‌గా, ఆయేషా మరియం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. జానీ, జేడీ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘బబ్లూ XXL’ను 2027 ప్రారంభంలో థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, తాజాగా విడుదలైన ఫస్ట్ స్పార్క్‌తో మరింత చర్చనీయాంశంగా మారింది. ఫ్రెష్ లవ్ స్టోరీ, యూత్‌ఫుల్ కామెడీతో బబ్లూ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts