సినిమా వార్తలు

చిక్కుల్లో హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ… టాలీవుడ్‌లో కలకలం!

Published by
Rahul N

టాలీవుడ్‌లో మరో పెద్ద వివాదం వెలుగుచూసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాత కె. నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మపై తీవ్రమైన ఆరోపణలతో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC)లో ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 11, 2025న దాఖలైన ఈ ఫిర్యాదులో దర్శకుడిపై మోసం, ఒప్పంద ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

నిర్మాత ఫిర్యాదు ప్రకారం, 2024లో విడుదలైన “హనుమాన్” సినిమాకు ప్రశాంత్ వర్మతో కలిసి పని చేసిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, ఆ తరువాత “ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్” పేరిట ఒక పెద్ద ప్రాజెక్టును రూపొందించేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో అధీర, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మ రాక్షస, ఆక్టోపస్ వంటి సినిమాలు ప్రైమ్‌షో బ్యానర్‌లో రావాల్సి ఉండగా, నిర్మాత ఇప్పటికే సుమారు రూ.20.57 కోట్లు అడ్వాన్స్‌లు మరియు ప్రీ-ప్రొడక్షన్ ఖర్చులుగా చెల్లించినట్లు పేర్కొన్నారు.

అయితే నిర్మాత వాదన ప్రకారం, ఈ సినిమాలు ముందుగా అనుకున్న విధంగా ముందుకు సాగలేదని, ప్రశాంత్ వర్మ అనుమతి లేకుండా ప్రాజెక్టులను ఇతర బ్యానర్లకు మళ్లించారని ఆరోపించారు. ముఖ్యంగా అధీర టీజర్ 2022లో విడుదలైనప్పటికీ ఇప్పటి వరకు షూట్ మొదలవ్వలేదని, మహాకాళి సినిమా మాత్రం మరో నిర్మాతతో 40 రోజులపాటు షూట్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, దర్శకుడు RKD స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్, హోంబాలే ఫిలిమ్స్ వంటి ఇతర నిర్మాణ సంస్థలతో కొత్త ఒప్పందాలు చేసుకున్నారని కూడా ఆరోపించారు.

ప్రశాంత్ వర్మ రూ.20.57 కోట్లు 36 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలనీ, అదనంగా రూ.200 కోట్ల పరిహారం చెల్లించాలని నిర్మాత నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో పాటు, వివాదం పరిష్కారం అయ్యే వరకు ఇతర నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టులతో ముందుకు వెళ్లవద్దని TFPCను కోరారు.

తన ఫిర్యాదులో నిర్మాత సివిల్, క్రిమినల్ చర్యలను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వివాదం టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. “హనుమాన్”తో భారీ విజయాన్ని సాధించిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి.

Rahul N