సినిమా వార్తలు

నివేదా పేతురాజ్ పెళ్లి రద్దు?

Published by
Srinivas

తెలుగు ప్రేక్షకులకు “బ్రోచేవరెవరురా”, “అల వైకుంఠపురములో” వంటి చిత్రాల ద్వారా సుపరిచితమైన నివేదా పేతురాజ్, ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను తొలగించారు. ఆమె నిశ్చితార్థం చేసుకున్న దుబాయ్‌ వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను కూడా అన్‌ఫాలో చేశారు. రాజ్‌హిత్ కూడా ఆమెను అన్‌ఫాలో చేయడంతో విడిపోయినట్టే అంచనాలు బలపడుతున్నాయి.

ఆగస్ట్ 2025లో ఇద్దరూ తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించి, త్వరలో పెళ్లి చేసుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాజ్‌హిత్ పలు ఫోటోలను షేర్‌ చేస్తూ వచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా ఆ పోస్టులన్నీ కనిపించడం లేదు.

ప్రస్తుతం నివేదాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా… ఆమె ఎవ్వరిని ఫాలో అవ్వడం లేదు. రాజ్‌హిత్ కూడా తన అకౌంట్‌ నుంచి వారి రిలేషన్‌కు సంబంధించిన అన్నింటిని తొలగించేశారు. ఈ చర్యలతో వారి మధ్య విభేదాలు వచ్చినట్టుగా అభిమానులు భావిస్తున్నారు.

తమిళ చిత్ర పరిశ్రమలో ఎనిమిది ఏళ్ల క్రితం అడుగుపెట్టిన నివేదా, “మెంటల్ మధిలో” ద్వారా తెలుగులోకి వచ్చింది. తర్వాత “చిత్రలహరి”, “బ్రోచేవరెవరురా”, “అల వైకుంఠపురములో”, “రెడ్”, “పాగల్”, “వీరాట పర్వం”, “దాస్ కా ధమ్కీ” వంటి సినిమాల్లో నటించింది.

నివేదా గత రెండు సంవత్సరాలుగా కొత్త సినిమాలకు సంతకం చేయలేదు. వివాహ జీవితంపై దృష్టి పెట్టేందుకు సినీ రంగం నుంచి కొంతదూరం అవుతున్నారనే అభిప్రాయం పరిశ్రమలో ఏర్పడింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ విడిపోవడం తర్వాత ఆమె తిరిగి సినిమాల్లోకి వస్తారా? లేక వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తారా? అన్నది అభిమానులలో ప్రశ్నగా మారింది.

ప్రస్తుతం నివేదా లేదా రాజ్‌హిత్ ఎవ్వరూ అధికారిక ప్రకటన చేయని నేపథ్యంలో… ఈ వార్తలపై అసలు నిజం ఏంటో తెలుసుకునేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts