ఆంధ్ర ప్రదేశ్

మదనపల్లెలో చారిత్రక అడుగు.. రాయలసీమ అభివృద్ధికి కొత్త అధ్యాయం

Published by
Srinivas

రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్‌ విలువ సుమారు రూ.1 లక్ష కోట్లుగా పేర్కొన్నారు. హార్టికల్చర్ రంగాన్ని ఆధునిక సాంకేతికత, పరిశోధన, మార్కెటింగ్, ప్రాసెసింగ్‌తో అనుసంధానం చేయడం ద్వారా రైతులకు కొత్త అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

రైతులకు కొత్త అవకాశాలు

రిలయన్స్ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వనుంది. రైతులు, వ్యవసాయ నిపుణులు, యువతకు కొత్త నైపుణ్యాలు అందించడంతో పాటు ఉద్యాన పంటల ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు విలువ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు” అన్న మహాత్మా గాంధీ ఆలోచనలకు అనుగుణంగా గాంధీ జయంతి రోజున రాయలసీమలో ఈ చారిత్రక కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో రాయలసీమను రూ.1 లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ISA వ్యవసాయ రంగంలో కీలక మార్పులకు నాంది పలుకుతుందని, అక్టోబర్ 2, 2026 రాయలసీమ చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఉంటుందని అన్నారు.

“రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పా.. నేడు చేసి చూపిస్తున్నా”

రాయలసీమను “రతనాల సీమ”గా మారుస్తానని గతంలో పలుమార్లు చెప్పానని, ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించామని చంద్రబాబు పేర్కొన్నారు. హార్టికల్చర్ హబ్, ISA ద్వారా సీమ రైతులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అనంత్ అంబానీ, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు ఉద్యాన పంటల మొక్కలను నాటారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts