సినిమా వార్తలు

‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఫైర్.. కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్

Published by
Srinivas

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాట ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. అయితే ఈసారి పాటకు సంబంధించిన ఓ ఏఐ మార్ఫింగ్ వీడియో కారణంగా వివాదం తెరపైకి వచ్చింది.

‘చుట్టమల్లే’ పాటలోని అసలు విజువల్స్‌ను ఏఐ టెక్నాలజీతో మార్చి అసభ్యకరమైన కంటెంట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఎన్టీఆర్ దృష్టికి రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐని ఇలాంటి దారుణమైన రీతిలో ఉపయోగించడాన్ని తప్పుబట్టిన ఆయన.. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

“డిస్గస్టింగ్, సిక్ అండ్ షేమ్‌లెస్. మహిళలను తల్లులుగా, దేవతలుగా గౌరవించే మన దేశంలో.. ‘మాతృదేవోభవ’ అనేది కేవలం ఒక మాట కాదు, మన సంస్కృతిలో భాగం. అలాంటి చోట ఒక మహిళను అవమానించేలా ఏఐని ఉపయోగించడం సిగ్గుచేటు. ఇంత దారుణమైన కంటెంట్‌ను రూపొందించేందుకు ఏఐని ఉపయోగించడం మాటల్లో చెప్పలేనంత అవమానకరం” అంటూ ఎన్టీఆర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ వీడియోను రూపొందించిన వారితో పాటు సోషల్ మీడియాలో దానిని ప్రచారం చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.

“ఈ మార్ఫింగ్ ‘చుట్టమల్లే’ వీడియో వెనుక ఉన్న వారిని నేను వదిలిపెట్టను. దీన్ని రూపొందించిన వారిపై, ప్రచారం చేస్తున్నవారిపై సాధ్యమైన ప్రతి చట్టపరమైన చర్య తీసుకుంటాను. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ చూడొద్దు, షేర్ చేయొద్దు. దానితో ఎలాంటి ఎంగేజ్‌మెంట్ చేయొద్దు. ఈరోజు మరొకరిని టార్గెట్ చేశారు.. రేపు అది మీ తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె కావచ్చు” అని ఆయన పేర్కొన్నారు.

ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దాని దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ఆయన కోరారు.

“ఇది చాలా తీవ్రమైన సమస్య. ఏఐ దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు తీసుకురావాలి” అని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts