కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం ‘కింగ్ 100’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పాత్రల పరిచయాలతో సినిమాపై అంచనాలను పెంచుతున్న మేకర్స్ తాజాగా మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు.
అశోక్ సెల్వన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయనను ‘కర్ణ’ అనే విభిన్నమైన పాత్రలో పరిచయం చేశారు. ఇప్పటివరకు చూడని సరికొత్త అవతార్‌లో అశోక్ సెల్వన్ కనిపించడం పోస్టర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మరూన్ కలర్ షర్ట్, పొడవాటి జుట్టు, ఒత్తైన గడ్డంతో అశోక్ సెల్వన్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. కుర్చీలో ఎంతో కూల్‌గా కూర్చున్నప్పటికీ ఆయన బాడీ లాంగ్వేజ్‌లో ప్రత్యేకమైన అటిట్యూడ్ కనిపిస్తోంది. చేతిలో సిగరెట్, పక్కనే ఉంచిన ఖాకీ పోలీస్ యూనిఫామ్, పోస్టర్ ముందు భాగంలో ప్రముఖంగా కనిపిస్తున్న చెస్ బోర్డుపై కింగ్ పీస్.. ఇలా ప్రతి అంశం పోస్టర్‌పై ఆసక్తిని పెంచుతోంది. డార్క్ విజువల్ సెటప్ ఈ పాత్రలోని మిస్టరీని మరింత ఎలివేట్ చేస్తోంది.
అశోక్ సెల్వన్ లుక్‌లో కనిపిస్తున్న ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. కర్ణ పాత్ర స్వభావం ఏమిటి? కథలో ఆయన పాత్ర ఎలాంటి మలుపులకు కారణం కానుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, సతీష్ కుమార్ ఎన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
నాగార్జున, టబు, అశోక్ సెల్వన్ వంటి విభిన్నమైన నటీనటులు భాగమైన ‘కింగ్ 100’ ఇప్పటికే తన ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.