సినిమా వార్తలు

దాసరి ఘాట్‌ను సందర్శించిన మనోజ్ మంచు, భూమా మౌనిక.. గురువుకు ఘన నివాళి

Published by
Srinivas

దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా హీరో ‘రా కింగ్’ మనోజ్ మంచు, ఆయన సతీమణి భూమా మౌనికతో కలిసి దాసరి ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. ఇటీవల ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో చూసిన మనోజ్ వెంటనే స్పందించి, స్వయంగా అక్కడికి వెళ్లి శుభ్రపరిచే కార్యక్రమాలను చేపట్టడం విశేషం.

శనివారం ఉదయం నుంచే తన బృందంతో కలిసి ఘాట్ వద్దకు చేరుకున్న మనోజ్, కార్మికులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్థానిక నాయకులు, అధికారులు సహకారంతో జేసీబీలు, సిబ్బందిని ఏర్పాటు చేసి ఘాట్ పరిసరాలను పూర్తిగా శుభ్రం చేశారు. అనంతరం సాయంత్రం భూమా మౌనికతో కలిసి మళ్లీ ఘాట్‌ను సందర్శించి దాసరి నారాయణరావుకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ దాసరి నారాయణరావు తన కుటుంబానికి గురువుతో సమానమని అన్నారు. కొన్ని రోజుల క్రితమే చిత్రపురి కాలనీలోని దాసరి విగ్రహాన్ని చూసి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు. అయితే ఘాట్ దుస్థితిని చూపించిన వీడియో చూసిన వెంటనే స్పందించి, వెంటనే శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు.

దాసరి నారాయణరావు గురించి మాట్లాడుతూ ఆయనను ఒక విశ్వవిద్యాలయంతో పోల్చారు. దర్శకత్వం, నటన, రచన, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే వంటి సినిమా 24 శాఖలపై పట్టు సాధించిన అరుదైన వ్యక్తిగా కొనియాడారు. తాను చిన్నప్పటి నుంచి దాసరి గారి దగ్గర ఎంతో నేర్చుకున్నానని, తనలో సినిమాపై ఉన్న ఆసక్తికి తండ్రి మోహన్ బాబుతో పాటు దాసరి గారే ప్రధాన కారణమని పేర్కొన్నారు.

‘ఒసేయ్ రాములమ్మ’ వంటి చిత్రాల ద్వారా మహిళా ప్రధాన కథలకు వాణిజ్య విజయాన్ని తీసుకొచ్చిన దర్శకుడు దాసరి అని గుర్తుచేసిన మనోజ్, ఆయన చిత్రాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ కార్మికుల సమస్యల పరిష్కారంలోనూ దాసరి గారు కీలక పాత్ర పోషించారని చెప్పారు.

ఘాట్ పరిస్థితికి ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన మనోజ్, దాసరి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని తెలిపారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన యాంకర్ గౌతమికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.

భూమా మౌనిక మాట్లాడుతూ దాసరి నారాయణరావు కేవలం సినీ రంగానికే కాకుండా సమాజానికి కూడా ఎంతో సేవ చేసిన మహానుభావుడని అన్నారు. ఆయన చిత్రాలు ఎన్నో సామాజిక అంశాలను ప్రస్తావించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయని పేర్కొన్నారు. దాసరి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

మనోజ్ జీవితంలోని ప్రతి ముఖ్యమైన సందర్భంలో దాసరి గారిని గుర్తు చేసుకుంటారని, ఆయన ప్రభావం మనోజ్ వ్యక్తిత్వం, సృజనాత్మకతపై ఎంతో ఉందని మౌనిక వెల్లడించారు. చివరగా దాసరి నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.