
దర్శక రత్న దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిపై సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోకు స్పందించిన నటుడు మనోజ్ మంచు.. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించారు. యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోలో దాసరి ఘాట్ చుట్టూ పేరుకుపోయిన చెత్త, ఎండుటాకులు, నిర్లక్ష్యంగా మారిన పరిసరాలు కనిపించడంతో పలువురు సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియో చూసిన మనోజ్ మంచు వెంటనే స్పందించి, తన వంతు బాధ్యతగా ఘాట్‌ను శుభ్రం చేయిస్తానని హామీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో స్పందించిన మనోజ్.. “దాసరి నారాయణరావు గారి ఘాట్ చుట్టూ ఉన్న ఈ పరిస్థితిని చూసి నిజంగా చాలా బాధ కలిగింది. ఆయన తరతరాలకు స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు అపారమైనవి. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. నా వంతుగా నేను చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాను” అని పేర్కొన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం మరుసటి రోజే ఉదయం 7 గంటలకు తన బృంద సభ్యులతో కలిసి మనోజ్ దాసరి ఘాట్ వద్దకు చేరుకున్నారు. సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యతగా తీసుకున్న ఆయన, అక్కడి పరిస్థితిని పరిశీలించి స్వయంగా శుభ్రపరిచే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. “మూడు, నాలుగేళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఈ పరిస్థితిని చూసి చాలా బాధపడ్డాను. చిత్రపురి కాలనీ దాటుతుండగా దాసరి గారి విగ్రహం కనిపించి ఘాట్ గుర్తొచ్చింది. ఆ తర్వాత గౌతమి గారి వీడియో మా టీం చూపించింది. ఆ దృశ్యాలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. అందుకే షూటింగ్‌కు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి ఈ పనిని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు.

అనంతరం మనోజ్, ఆయన టీం కలిసి ఘాట్ పరిసరాల్లో పేరుకుపోయిన ఎండుటాకులు, చెత్తాచెదారాన్ని తొలగించి ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన దాసరి నారాయణరావు గారి స్మృతికి తగిన గౌరవం దక్కాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇటీవల మనోజ్ మంచు, మౌనికా మంచు కలిసి ప్రారంభించిన ‘ఐక్య ధైర్య సేనా సమితి’ సామాజిక సేవా కార్యక్రమాల వెనుక ఉన్న స్ఫూర్తిని ఈ చర్య మరోసారి చాటిచెప్పింది. రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు, మాతృదేవోభవ అనాథాశ్రమం సందర్శన వంటి అనేక కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవ చేస్తూ వస్తున్న మనోజ్.. వాయిస్ లెస్‌కు వాయిస్‌గా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

ఇప్పుడు దాసరి నారాయణరావు గారి ఘాట్‌ను స్వయంగా సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆయన తన సామాజిక బాధ్యతను మరోసారి చాటిచెప్పారు. ఒక మహానుభావుడి జ్ఞాపకాన్ని కేవలం గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు, ఆ జ్ఞాపకానికి తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యమనే సందేశాన్ని మనోజ్ తన చర్యల ద్వారా అందించారు.
