
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్స్‌లో బుధవారం ఆగస్టు 12న ఈ సర్జరీ నిర్వహించినట్లు ఆసుపత్రి అధికారిక హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించింది.
ఇటీవల భుజానికి గాయం కావడంతో ఎన్టీఆర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనను పరిశీలించిన వైద్య నిపుణుల బృందం త్వరగా, పూర్తిస్థాయిలో కోలుకునేందుకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాలని నిర్ణయించింది.
కిమ్స్ హాస్పిటల్స్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలో డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సురపనేని ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్నారు.
సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, ఎన్టీఆర్ ప్రస్తుతం బాగానే ఉన్నారని కిమ్స్ హాస్పిటల్స్ తెలిపింది. ఇకపై ఆయన వైద్యుల పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ ప్రక్రియను కొనసాగించనున్నారు. పూర్తిస్థాయిలో కోలుకునేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాల షూటింగ్స్‌పై కూడా ఆసక్తి నెలకొంది. రికవరీ అనుకున్న విధంగా కొనసాగితే అక్టోబర్ లేదా నవంబర్ నాటికి ఆయన తిరిగి సాధారణ పనుల్లోకి వచ్చే అవకాశం ఉంది. వైద్యుల అనుమతి లభించిన తర్వాతే షూటింగ్స్‌కు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్‌పై కూడా ఈ రికవరీ ప్రభావం చూపనుంది. ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్టోబర్ లేదా నవంబర్‌లో షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి విశ్రాంతి, రిహాబిలిటేషన్‌పై దృష్టి పెట్టనున్నారు. సర్జరీ విజయవంతం కావడంతో ఆయన అభిమానుల్లోనూ ఊరట వ్యక్తమవుతోంది.
