రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ది రాజాసాబ్” సినిమాను పూర్తి చేయడంపై దృష్టి పెడుతుండగా, మరోవైపు హనురాఘవపూడి దర్శకత్వంలో మరో ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న “ది రాజాసాబ్” విడుదల కానుంది. అంతకుముందే ప్రభాస్ హనురాఘవపూడి సినిమా షూటింగులో కూడా పాల్గొంటూ రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇదిలా ఉంటే, హనురాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు గతంలో వార్తలు బయటకు వచ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కానీ తాజాగా యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ అనుకోకుండా ఆ టైటిల్‌ను లీక్ చేశాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విషయంలోకి వెళ్తే — ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కీర్తి స్వరణ్ దర్శకత్వంలో, మమిత బైజు హీరోయిన్‌గా రూపొందుతున్న సినిమా “డ్యూడ్”. ఈ చిత్రం అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అదే బ్యానర్‌పై ప్రభాస్ – హనురాఘవపూడి కాంబినేషన్‌లో మరో సినిమా కూడా రూపొందుతోంది.
ఈ నేపథ్యంలో “డ్యూడ్” ప్రమోషన్లలో భాగంగా ప్రదీప్ మాట్లాడుతూ — “నేను ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ, ప్రభాస్ సార్ నటిస్తున్న ఫౌజీ సినిమాలోని కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. ఆ క్లిప్పింగ్స్ మేకర్స్ యొక్క అభిరుచి ఎంత ఉన్నతంగా ఉందో చూపిస్తున్నాయి. అదో అసాధారణమైన విజన్!” అంటూ వ్యాఖ్యానించాడు.
ఇప్పుడు ఈ కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇంతవరకు “ఫౌజీ” అనేది కేవలం రూమర్‌గా వినిపించిన టైటిల్ కాగా, ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ నోటితో అనుకోకుండా బయటపడటంతో అభిమానులు “ఇక టైటిల్ కన్‌ఫర్మ్ అయిపోయింది!” అంటూ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి, ప్రభాస్ – హనురాఘవపూడి కాంబో చిత్రం ‘ఫౌజీ’ అనే టైటిల్‌తో వస్తుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందన్నదే ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిగా మారింది.