సినిమా వార్తలు

‘రామాయణ’ కోసం సాయి పల్లవి షాకింగ్ రెమ్యునరేషన్?

Published by
Srinivas

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రత్యేకమైన కథానాయికలలో సాయి పల్లవి (Sai Pallavi) ఒకరు. గ్లామర్‌కి పెద్దపీట వేయకుండా, కేవలం తన సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2015లో విడుదలైన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమమ్’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఆమె, విజయవంతంగా 11 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ కాలంలో ఎంతో మంది హీరోయిన్లు వచ్చి వెళ్లినా.. సాయి పల్లవి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా మరింత పెరుగుతూనే ఉంది.

సినిమాల ఎంపికలో కూడా సాయి పల్లవి తనదైన శైలిని కొనసాగిస్తుంటారు. పారితోషికం కంటే కథ, పాత్రకు ఉన్న ప్రాధాన్యానికే ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే ఆమె ఒప్పుకునే ప్రతి సినిమా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రంలో సీత పాత్రలో నటిస్తుండటంతో ఆమెపై అంచనాలు మరింత పెరిగాయి.

దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం కోసం సాయి పల్లవి దాదాపు రెండేళ్ల సమయాన్ని కేటాయించినట్లు సమాచారం. ఈ కాలంలో ఇతర సినిమాలను కూడా దాదాపు పక్కన పెట్టి, పూర్తిగా ఈ ప్రాజెక్ట్‌పైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సాయి పల్లవి అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి ఆమెకు రూ.20 కోట్లకు పైగా పారితోషికం అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పారితోషికం నిజమైతే, సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరిగా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు, సీత పాత్రలో ఆమె ఎలా మెప్పిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts