నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ విడుదలకు సిద్ధమైంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
ఈ వేడుకలో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో తనతో కలిసి పనిచేసిన సవారీ గ్యాంగ్ సభ్యుల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని అన్నారు. కాసర్ల శ్యామ్ అందించిన పాటల సాహిత్యాన్ని, డ్యాన్స్ మాస్టర్ పనిని నాని ప్రశంసించారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో తనకున్న అనుబంధం గురించి కూడా నాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీకాంత్‌తో తనకు అన్నదమ్ముల అనుబంధం ఉందని, అతని విషయంలో తాను చాలా గర్వంగా ఫీల్ అవుతానని చెప్పారు. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ దీనిని తమ సినిమాగా భావించి పనిచేశారని తెలిపారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు కూడా ఈ వేడుకకు హాజరుకావడం సంతోషంగా ఉందని, సినిమా విడుదలైన తర్వాత వారి ఆనందం మరింత పెరుగుతుందని నాని అన్నారు.
‘ది ప్యారడైజ్’లో కీలక పాత్రలు పోషించిన నటీనటులపై కూడా నాని ప్రశంసలు కురిపించారు. సంపూర్ణేష్ బాబు పాత్రను ప్రేక్షకులు అసలు ఊహించలేరని, ఆయన అద్భుతంగా నటించారని చెప్పారు. సోనాలి కులకర్ణి తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారని, ఆమె చేసిన క్యారెక్టర్‌ను మరెవరితోనూ ఊహించలేమని అన్నారు.
రాఘవ్ జుయల్‌ను అమేజింగ్ యాక్టర్‌గా అభివర్ణించిన నాని.. మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. మోహన్ బాబు ఎంత పెద్ద స్టార్ అనేది అందరికీ తెలుసని, ‘ది ప్యారడైజ్’లో ఆయన ఇంపాక్ట్ ఈ జనరేషన్‌కు కూడా గుర్తుండిపోతుందని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన సమయంలో ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నానని, ఆయన చాలా స్వీట్ హార్ట్ అని నాని పేర్కొన్నారు. సినిమాలో ఆయన పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు.
‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి స్పందనను తెచ్చుకుంది. ఈ సినిమా కోసం అనిరుధ్ ప్రాణం పెట్టి పనిచేశారని నాని తెలిపారు.
సినిమా ఒక పెద్ద సెలబ్రేషన్‌లా ఉండబోతోందని, సెప్టెంబర్ 23 రాత్రి నుంచే ఆ సెలబ్రేషన్ మొదలవుతుందని నాని అన్నారు. థియేటర్లు ఊగిపోతాయని, ప్రేక్షకుల సెలబ్రేషన్‌ను చూడటానికి తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.
‘ది ప్యారడైజ్’లో నాని పోషిస్తున్న ‘జడలు’ పాత్ర ఇప్పటికే సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ నాని తన పాత్రను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా మొదలైనప్పుడే ‘జడలు’తో ప్రేక్షకులకు ఒక లాక్ పడుతుందని, ఆ తర్వాత వైల్డ్ ఫైర్‌లా సినిమా ముందుకు సాగుతుందని అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పినట్టుగా థియేటర్లు తగలబడిపోయే స్థాయిలో సినిమా ఉంటుందని నాని ధీమా వ్యక్తం చేశారు.
సినిమా చుట్టూ ఏర్పడే పాజిటివ్, నెగెటివ్ ప్రచారంపై కూడా నాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మనం ఎదుగుతున్న కొద్దీ మన చుట్టూ పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా పెరుగుతుందని, అయితే నెగెటివ్ అంశాలను పట్టించుకోకుండా పాజిటివ్‌ను మాత్రమే తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు.
తనను ప్రేమించే, తనపై నమ్మకం ఉంచే ప్రేక్షకుల కోసం తాను ఎప్పటికీ కష్టపడుతూనే ఉంటానని చెప్పారు. ప్రేక్షకులు తనకు 100 ఏళ్లకు సరిపడే ప్రేమను ఇచ్చారని, వారి నమ్మకంతోనే ఈ సినిమా కోసం ముందుకు సాగుతున్నానని నాని తెలిపారు.
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ నాని అభిమానుల ఉత్సాహాన్ని ప్రశంసించారు. ఈ వేడుక చూస్తుంటే సినిమా ఇప్పటికే బ్లాక్‌బస్టర్ అయినట్టుగా అనిపిస్తోందని అన్నారు.
‘దసరా’తో సూపర్ హిట్ అందుకున్న నాని, ‘ది ప్యారడైజ్’తో మరో పెద్ద విజయాన్ని అందుకోబోతున్నారని దిల్ రాజు పేర్కొన్నారు. నాని ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదుగుతున్నారని అన్నారు.
నిర్మాత సుధాకర్ చెరుకూరి గురించి కూడా దిల్ రాజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తున్నప్పటికీ ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్ల గురించి ఆలోచించే నిర్మాతగా ఆయనను ప్రశంసించారు.
హీరోయిన్ కయాదు లాహోర్ మాట్లాడుతూ నాని అభిమానుల ఎనర్జీ చూసి ఎంతో సంతోషంగా ఉందన్నారు. నానితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా పేర్కొన్నారు.
అనిరుధ్ అందించిన ఆల్బమ్ అద్భుతంగా ఉందని, సినిమాలో నాని గారిని బిగ్ స్క్రీన్‌పై చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. తమ జోడీ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. సెప్టెంబర్ 24న ‘జడలు జమానా’ మొదలవుతుందని అన్నారు.
నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ ‘ది ప్యారడైజ్’ ఒక ప్రత్యేకమైన ప్రయాణమని అన్నారు. సినిమా కోసం పనిచేసిన మొత్తం టీమ్‌ను ఒకచోటికి తీసుకురావడం ఒక పెద్ద ప్రయత్నమని పేర్కొన్నారు.
సినిమాను ఇప్పటికే చూసిన తాను చాలా సంతృప్తిగా ఉన్నానని, ప్రేక్షకులు థియేటర్‌లో చూసినప్పుడు బొమ్మ బ్లాక్‌బస్టర్ అనిపిస్తుందని అన్నారు. మోహన్ బాబు, రాఘవ్, సోనాలి కులకర్ణి సహా చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
రాఘవ్ జుయల్ మాట్లాడుతూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనకు ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. నానితో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతి అని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.
సంపూర్ణేష్ బాబు తన కెరీర్‌లో ఇది ఒక పెద్ద సినిమా అని పేర్కొన్నారు. నాని పక్కన మంచి పాత్ర చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
సోనాలి కులకర్ణి మాట్లాడుతూ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని అన్నారు.
కాసర్ల శ్యామ్, రామ్-లక్ష్మణ్ మాస్టర్స్, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా తదితరులు కూడా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సినిమాపై తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సినిమా రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో ప్రత్యేకంగా ఉంటుందని అవినాష్ కొల్లా తెలిపారు.
రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నాని చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన చూపించిన ఓపిక, అంకితభావాన్ని ప్రశంసించారు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని పేర్కొన్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.