ఆంధ్ర ప్రదేశ్

SAAP కార్యాలయం వద్ద ఉద్రిక్తత… ‘మాపై దాడికి వైసీపీ కుట్ర’.. స్పోర్ట్స్ కోటా టీచర్ల ఆరోపణ

Published by
Rahul N

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాల వ్యవహారం మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ నేతలు విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అదే సమయంలో తమ నియామకాలు నిబంధనల ప్రకారమే జరిగాయని చెబుతూ స్పోర్ట్స్ కోటా టీచర్లు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

క్రీడా ప్రతిభతో ఉద్యోగాలు సాధించామని టీచర్ల వెల్లడి

స్పోర్ట్స్ కోటా ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన తాము ఎన్నో ఏళ్లుగా క్రీడల్లో శ్రమించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచామని తెలిపారు. క్రీడల్లో సాధించిన విజయాలు, పతకాలు, సర్టిఫికెట్ల ఆధారంగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు ఎంపికయ్యామని స్పష్టం చేశారు.

తమ అర్హతలపై అనుమానాలు ఉంటే అధికారికంగా ధ్రువపత్రాలను పరిశీలించాలని, అయితే రాజకీయ ఆరోపణల పేరుతో తమను అవమానించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అభ్యర్థులు తమ వద్ద ఉన్న అసలు క్రీడా పతకాలు, సర్టిఫికెట్లను కూడా ప్రదర్శించారు.

SAAP కార్యాలయం వద్ద పోటాపోటీ నినాదాలు

వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ SAAP కార్యాలయం వద్ద నిరసన చేపట్టగా.. మరోవైపు స్పోర్ట్స్ కోటా టీచర్లు తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను వేర్వేరుగా నిలిపారు.

‘మాపై దాడికి కుట్ర’.. టీచర్ల ఆరోపణ

SAAP కార్యాలయం ముట్టడి పేరుతో తమను లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రయత్నించారని స్పోర్ట్స్ కోటా టీచర్లు ఆరోపించారు. కష్టపడి క్రీడల్లో రాణించి ఉద్యోగాలు సాధించిన తమపై రాజకీయ ఆరోపణలు చేయడం, భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని వారు అన్నారు.

అయితే స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. పరీక్ష నిర్వహణ, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పరిశీలన, కొన్ని నియామకాలపై అనుమానాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయంగా ముదురుతున్న వివాదం

ఈ వ్యవహారం ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. స్పోర్ట్స్ కోటా టీచర్లపై జరిగిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, క్రీడల్లో ప్రతిభ చూపి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై దాడులను సహించబోమని పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Rahul N

Recent Posts