సినిమా వార్తలు

త్రివిక్రమ్ ‘AK47’: ‘చిట్టిబాబు’గా వెంకీ మామ ఎంట్రీ

Published by
Srinivas

విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – AK47’ ప్రమోషన్స్‌కు మేకర్స్ శ్రీకారం చుట్టారు. సినిమాకు సంబంధించిన పాత్రలను ఒక్కొక్కటిగా ప్రేక్షకులకు పరిచయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన చిత్రబృందం.. తొలి క్యారెక్టర్‌గా వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ పాత్రను రివీల్ చేసింది.

విడుదలైన క్యారెక్టర్ గ్లింప్స్‌లో చిట్టిబాబు కుటుంబాన్ని ప్రేమతో కట్టిపడేసే వ్యక్తిగా కనిపించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కుటుంబ సభ్యులను ఒక్కటిగా ఉంచే బాధ్యతగల మనిషిగా వెంకటేష్ పాత్రను డిజైన్ చేసినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఆయన మార్క్ కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్ ఈ పాత్రలో మరోసారి హైలైట్ కానున్నాయి.

ఈ గ్లింప్స్‌లో శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కూడా కనిపిస్తూ సినిమా కథలోని ప్రధాన కుటుంబ బంధాలకు చిన్న పరిచయం ఇచ్చారు. అలాగే యువినా పార్థవి, రాజా ప్రజ్వాల్ పాత్రలను కూడా మేకర్స్ పరిచయం చేశారు. మిగిలిన కీలక పాత్రల పరిచయాలు కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఫ్యామిలీ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్.. ‘చిట్టిబాబు’ పాత్రతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేలా కనిపిస్తున్నారు. ఆయన సహజ నటన, కామెడీ టైమింగ్, భావోద్వేగాలను పలికించే తీరు ఈ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చనున్నట్లు గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.

హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, కెవిన్ కుమార్ యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – AK47’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ‘చిట్టిబాబు’ పాత్ర పరిచయంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. త్రివిక్రమ్ ఈసారి మరో హృదయానికి హత్తుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నారనే నమ్మకం అభిమానుల్లో మరింత బలపడుతోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.