అఖండ 2 మూవీ రివ్యూ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. అఘోర పాత్రలో బాలయ్య అభిమానులను సహా సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదే జోడీ హ్యాట్రిక్ చిత్రం కూడా. దానికి కొనసాగింపుగా భారీ అంచనాల నడుమ తెరకెక్కిన “అఖండ 2: తాండవం” మొదట ఈ నెల 5న విడుదల కావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల వాయిదా పడి చివరకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సనాతన ధర్మం, ఇండో–చైనా ఘర్షణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? బాలయ్య తాండవం వర్కవుట్ అయిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
ఇండో – చైనా బోర్డర్‌లో జరిగిన ఘర్షణలో చైనా ఆర్మీ జనరల్ (సంగే సెల్ర్టామ్) కుమారుడు కూడా మరణిస్తాడు. దాంతో అతను కోపంతో భారత్‌ను సర్వనాశనం చేస్తాను అని సవాల్ విసురుతాడు.
ఈ సమయంలో భారత ప్రధాని పదవిపై కన్నేసిన అజిత్ ఠాకూర్ (కబీర్ సింగ్ దుహాన్)తో అతను చేతులు కలుపుతాడు. ఇద్దరూ కలిసి మహా కుంభమేళాకు వచ్చిన కోట్లాది భక్తులపై ప్రమాదకర వైరస్‌ను ప్రయోగించే ప్రణాళిక వేస్తారు.
కుంభమేళాలో ప్రజలు అపస్మారక స్థితిలో పడిపోతారు. దేవుడిపై ప్రజల నమ్మకం పోవాలన్న కుట్ర మొదలవుతుంది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ రూపొదించారు అఖండ (బాలకృష్ణ) సోదరుడు, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాల మురళీకృష్ణ (బాలకృష్ణ) కుమార్తె జనని (హర్షాలీ మల్హోత్రా). దాన్ని గ్రహించిన శత్రువులు ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు.
వైరస్ బారినుంచి దేశాన్నిఅఖండ ఎలా రక్షించాడు? ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని మళ్లీ ఎలా నింపాడు? దుష్టశక్తులను వశం చేసుకున్న నేత్ర (ఆది పినిశెట్టి) అసలు ఎవరు? దేశం, ధర్మం, సనాతన సంప్రదాయాల రక్షణ కోసం అఖండ ఏ తాండవం చేశాడు? ఇదే కథ.
విశ్లేషణ:
2025లో “సమీక్ష అవసరం లేని సినిమాలు” అనే ఒక లిస్ట్ చేస్తే, ముందువరుసలో నిలిచే చిత్రాల్లో ఒకటి అఖండ 2: తాండవం. భక్తి సినిమా చేయాలనే ప్రయత్నంలో, ఈసారి కుంభమేళాను కథలోకి బలవంతంగా ఇమిడ్చి ఉత్తర భారత ప్రేక్షకులను ఆకర్షించాలనే యత్నం స్పష్టంగా కనిపిస్తుంది.
కానీ… చైనా దేశపు రాజకీయ-సైనిక ధోరణుల పై సరైన అవగాహన లేకపోవడం… ఇండో-చైనా ఘర్షణను కార్టూన్ స్థాయికి తీసుకెళ్లిన విధానం సనాతన ధర్మం, దేవతత్వం, వైరస్, వ్యాక్సిన్ — అన్నింటినీ ఒకే పాత్రలో కలపడం కథను బరువెక్కించాయి కానీ లోతు ఇవ్వలేదు.
సినిమా విషయానికి వస్తే… అఖండ పాత్రలో బాలయ్య ఒంటరిగానే దేశం, ధర్మం, ప్రజలను రక్షించే మహాశక్తిగా చూపబడ్డారు. కానీ ఆ యాక్షన్ సీన్స్… అరచేత్తో మనిషిని తలకిందులుగా పట్టుకుని హారతి ఇవ్వడం, త్రిశూలంతో హెలికాప్టర్ రెక్కలు తిప్పడం, చైనా ఆర్మీని ఒంటరిగానే బద్దలు కొట్టడం, గద, శూలం, మిషన్ గన్… అంటూ విపరీత యాక్షన్… ఇవి ప్రేక్షకులకు “ఇక్కడి నుంచి మనల్ని ఎవరు కాపాడతారు?” అన్న భావన తెప్పిస్తాయి.
భక్తి + యాక్షన్ + హై వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ — ఇవన్నీ బోయపాటి మార్కే. కానీ కథలో నాణ్యత లేకపోవడం వల్ల ఈ మేళవింపు అంచనాలకు తగ్గట్టుగా పనిచేయలేదు.
టెక్నికల్:
తమన్ సంగీతం భారీ శబ్దంతో నింపినా కొత్తదనం లేదు. కెమెరా వర్క్ లో అదే యాక్షన్-స్లోమో-బీస్ట్ ఫార్ములా. ఎడిటింగ్‌ను మరింత కట్టుదిట్టంగా చేయవలసిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది.
పాత్రల రూపకల్పన — బాలయ్య కష్టపడ్డా, మిగతావారికి న్యాయం కాలేదు. బాలయ్య తన వంతు శ్రమను పూర్తి స్థాయిలో పెట్టారు. హర్షాలి మల్హోత్రా పాత్ర కథకు కీలకం అయినా రాయడంలో లోతు తక్కువ. ఆది పినిశెట్టి శక్తివంతమైన పాత్ర పోషించినా, సరైన స్థాయి ఇవ్వలేదు. సంయుక్త మీనన్ పాత్ర ఆకర్షించేలా తీర్చిదిద్దలేదు
మొత్తంగా — ఇది పౌరాణికమా? భక్తిరసమా? దేశభక్తి డ్రామానా? మసాలా యాక్షనా? ప్రేక్షకులే అనుకున్నట్లు భావించాల్సి వస్తుంది.
తీర్పు:
బాలయ్య తాండవం ఉన్నా, కథ తడబడింది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం నిరాశ కలిగించే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఎంజాయ్ చేస్తారు. కానీ కథ, భావోద్వేగం, లాజిక్ పరంగా సినిమా నిలబడలేకపోయింది.
ఈ రివ్యూ పూర్తిగా రచయిత అభిప్రాయమే…