హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఘలై జంటగా నటించిన ‘దీవాన’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ సంఘిశెట్టి రూపొందించిన ఈ చిత్రం నుంచి అప్‌డేట్స్‌తో చిత్రంపై అంచనాలు పెరిగాయి. పైగా దర్శకుడు శ్రీకాంత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. సినిమాకు వంద కోట్ల రూపాయల లాభాలు వచ్చినా ఫరక్ పడదు కానీ ఎవరైనా సినిమాలో ఒక్క అంశం బాగాలేదన్నా తాను తీసుకోలేనన్నారు. మరి ఈ చిత్రం శ్రీకాంత్ చెప్పినట్టు అంత బాగుందా? ఒక్క అంశాన్ని కూడా వేలెత్తి చూపలేమా? చూద్దాం.
కథేంటంటే..
డిగ్రీ పూర్తి చేసిన మున్నా (హర్షిత్ రెడ్డి) ఫ్రెండ్స్‌తో కలిసి తిరగడం, తాగడం తప్ప ఇంటి బాధ్యతల్ని పట్టించుకోడు సరికదా కనీసం తండ్రి కష్టం గురించి కూడా పట్టించుకోడు. ఒకరోజు వినాయకచవితి సెలబ్రేషన్స్‌లో డ్యాన్స్ చేస్తుండగా.. అమూల్య (స్నేహా మణిమేఘలై)ని చూస్తాడు. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. మున్నా కరెంట్ బిల్ కట్టేందుకని వెళ్లి మీ సేవ కేంద్రానికి వెళ్లి అక్కడ అమూల్యను చూస్తాడు. ఇక ఆమె చుట్టూనే తిరగడమే పనిగా పెట్టుకుంటాడు. ప్రతీ రోజూ అమూల్య కోసం మీ సేవాలో ఎవరో ఒకరి బిల్లు తీసుకెళ్లి కట్టడమే పనిగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలోనే అరెస్ట్ కూడా అవుతాడు. అయితే తాను నెలకు రూ.20 వేలు సంపాదిస్తున్నానని.. నువ్వు కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని వచ్చి కనిపించమని అమూల్య చెబుతుంది. అప్పటి వరకూ తనను చూడవద్దని కండీషన్ పెడుతుంది. దీంతో మున్నా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని డిసైడ్ అవుతాడు. ఇంతకీ మున్నా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడా? మున్నాను అమూల్య రిజెక్ట్ చేయడానికి కారణం నిజంగానే అతనిపై ప్రేమ లేకపోవడమా? మరేదైనా కారణం ఉందా? చివరకు మున్నా కథ ఏమైంది? అనే అంశాలను చిత్రం చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు శ్రీకాంత్ కథ రాసుకున్నారు. వాస్తవానికి ఇటీవలి కాలంలో వస్తున్న ప్రేమకథలకు ఇది కాస్త భిన్నమైన ప్రేమకథే. తల్లిదండ్రుల కష్టాన్ని పట్టించుకోకుండా.. స్నేహితులతో జులాయిగా తిరిగే ఓ యువకుడి జీవితంలోకి అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేదే కథాంశం. ఇదొక సింపుల్ స్టోరీ. గతంలో ఇదే కథతో చాలా చిత్రాలు వచ్చాయి కానీ కథలోని ఓ చిన్న ట్విస్ట్‌తో సినిమా కొంచెం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రేమకు కులమతాలు, వయసు ఏవీ అడ్డుకావన్నట్టుగా ఇటీవలి కాలంలో చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. అలా చూసుకుంటే శ్రీకాంత్ చూపించిన కాన్‌ఫ్లిక్ట్ పెద్ద విషయమే కాదు. ఫస్టాఫ్ అంతా కూడా కేవలం ఫ్రెండ్స్, గొడవలతోనే సాగుతుంది. ఇంటర్వెల్ సమయంలో పెద్ద ట్విస్టే ఇచ్చాడు దర్శకుడు. ఇక ఆ తరువాత మున్నా జాబ్ కోసం పడే కష్టాలన్నీ ఏదో సినిమాటిక్‌గా సరదాగా ఉన్నాయే తప్ప ఆకట్టుకునేలా మాత్రం లేవు. మరి ఇది యూత్‌ని దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రం కాబట్టి వారికి కనెక్ట్ అవ్వొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్నా కూడా దానిని హైలైట్ చేయడం దర్శకుడు శ్రీకాంత్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఫ్యామిలీ సెంటిమెంట్‌లో మంచి డెప్త్ ఉండి ఉంటే.. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇది దగ్గరై ఉండేదేమో. ఇక సెకండాఫ్ పర్వాలేదనిపించినా కూడా ఏమాత్రం లాజిక్ లేని సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు.
ఎవరెలా చేశారంటే..
మున్నాగా హర్షిత్ రెడ్డి తన పాత్రను చక్కగా పోషించాడు. తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా.. ఫ్రెండ్స్‌తో గాలికి తిరుగుతూ ఉండే కుర్రాడిలా బాగానే మెప్పించాడు. హీరోయిన్ మణిమేఘలై చాలా అందంగా కనిపించింది. ఆమె నటనకు పెద్దగా స్కోప్ ఉన్న పాత్రమే కాదు కానీ కొన్ని సన్నివేశాల్లో మాత్రం మెప్పించింది. నరేష్ మరోసారి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఝాన్సీ కూడా చాలా నేచురల్‌గా అనిపించింది. హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. జీవన్ కామెడీ టైమింగ్‌ను దర్శకుడు పెద్దగా వాడుకోలేదేమో అనిపిస్తుంది. వేణు, రఘు తదితరులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
‘దీవాన’ అతిపెద్ద బలాల్లో ఒకటి నేపథ్య సంగీతం. సంగీతం దాదాపు ప్రతి సన్నివేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది, మరియు సంగీత దర్శకుడు సినిమా అంతటా అద్భుతంగా పనిచేశాడు. ఈ సినిమాలో ప్రేమ, భావోద్వేగం, యాక్షన్, మరియు నేపథ్య సంగీతం యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది. విజువల్ పరంగా ఓకే. నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఫ్యామిలీ సెంటిమెంట్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉండాల్సింది.
ఫైనల్‌గా.. ‘దీవాన’ ఒక అందమైన ప్రేమకథ, జెన్-జీ (Gen Z) ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే చిత్రం.