‘హైకూ’ సినిమా ప్రమోషన్స్ చూసినప్పుడు టైటిల్ ఏదో విచిత్రంగా ఉందే అనిపించింది ప్రతి ఒక్కరికీ. ఆ తరువాత వచ్చిన అప్‌డేట్స్‌లో విమెన్స్ కాలేజ్ మొత్తమ్మీద ఒకే ఒక్క యువకుడు చదువుతుండటం చాలా ఆసక్తికరంగా అనిపించింది. దీంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఏదో డిఫరెంట్ సబ్జెక్ట్‌తో రాబోతున్నారని భావించారు. అప్‌డేట్స్‌తో అంచనాలు బాగానే పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.
మనోహరన్ అలియాస్ మనో (ఏగన్) కాలేజ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ లేడీస్ టాయ్‌లెట్స్ ఎలా ఉంటాయో చూడాలనుకుంటాడు. ఈ క్రమంలోనే లేడీస్ టాయ్‌లెట్‌లోకి వెళ్లి బయటకు వస్తుంటే ఓ స్నేహితుడు వీడియో తీసి కాలేజ్ గ్రూప్‌లో పెడతాడు. దానిని కాలేజ్ ప్రిన్సిపాల్ చూసి మనోను కాలేజ్ నుంచి డిస్మిస్ చేస్తాడు. మనోకి కాలేజ్ సెట్ చేసే బాధ్యత ప్రెండ్స్ నెత్తిపైనే పడుతుంది. ఏ కాలేజ్ చూసినా అసలు మనోని కాలేజ్ నుంచి ఎందుకు డిస్మిస్ చేశారో కారణం అడిగి తీసేస్తుంటారు. అలా అప్పుడే కో ఎడ్‌గా మారిన విమెన్స్ కాలేజ్‌లో మనోకు సీటు లభిస్తుంది. కాలేజ్ మొత్తానికి మనో ఒక్కడే పురుషుడు. తొలుత అమ్మాయిల మధ్య భయంభయంగా కాలం గడిపినా కోడి (శ్రీదేవి) పరిచయంతో ఆ భయమంతా తొలగిపోతుంది. తొలుత స్నేహంగా మొదలైన వీరి పరిచయం క్రమక్రమంగా ప్రేమగా మారుతుంది. హ్యాపీగా సాగిపోతున్న వీరి ప్రేమకథకు ఓవర్ పొసిసివ్‌నెస్ బ్రేక్ వేస్తుంది. ఇద్దరూ విడిపోతా. ఆ తర్వాత మనో చెన్నైకి వెళ్లి జాబ్‌లో స్థిరపడతాడు. అక్కడ నివేదా అలియాస్ నివి (ఫెమినా జార్జ్) పరిచయమవుతుంది ఆ తరువాత మనో జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? ఈ కథలో నివేదా అలియాస్ నివి (ఫెమినా జార్జ్) పాత్రేంటి? కోడి ఏమైంది? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
అతి అన్నివేళలా అనర్ధమే. అలాగని అసలేమీ లేకున్నా కూడా ఇబ్బందే. అంటే ప్రేమ ఎక్కువైపోయి అది ఓవర్ పొసెసివ్‌నెస్‌గా మారితే అది ఇబ్బంది. అలాగని ప్రేమికుడు అసలు పొసెసివ్‌గా లేకున్నా ఇబ్బందే. ఏది ఎంతలో ఉండాలో అంతలే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఈ సినిమా ద్వారా దర్శకుడు స్పష్టం చేశాడు. ప్రేమ, విరహం, జీవితంలో రెండో అవకాశం రావడం.. వంటి అంశాలతో ఈ సినిమా రూపొందింది. యంగ్‌స్టర్ ప్రేమకథకు ఒక విలువైన పాఠాన్ని జోడిస్తూ ఈ చిత్రాన్ని దర్శకుడు యువరాజ్ చిన్నస్వామి తెరకెక్కించారు. నేటి తరం రిలేషన్స్‌ను ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ప్రేమలో ఎదురయ్యే విరహాన్ని విషాదంగా చూపించకుండా మనో జీవితంలో మార్పునకు ఆ అనుభవం ఓ మలుపుగా మారడం ఆసక్తికరం. అయితే భావోద్వేగాలను మరింత స్ట్రాంగ్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. సినిమా ఫస్ట్ హాఫ్‌లో కొంతమేర, సెకండాఫ్‌లో కొంతమేర సాగదీతలా అనిపించింది. ఒకే అంశాన్ని మూడు సార్లు చూపించడం అనేది కొంత చిరాకుగా అనిపిస్తుంది. కాన్సెప్ట్ అయితే బాగుంది. యూత్‌కి కనెక్ట్ అవుతుంది.
మనో పాత్రలో ఏగన్ చక్కగా ఒదిగిపోయాడు. అమాయకంగా అయితే బాగా ఆకట్టుకున్నాడు కానీ పొసెసివ్ అయిపోయిన సన్నివేశాల్లో బలమైన నటనను కనబరచలేదనిపించింది. ఇక కోడి పాత్రలో శ్రీదేవి చాలా అద్భుతంగా నటించింది. చాలా యాక్టివ్‌గా కనిపించింది. ప్రతి సన్నివేశంలోనూ సహజ నటనతో ఆకట్టుకుంది. ఫెమినా జార్జ్ కూడా చాలా బాగా నటించింది. భావోద్వేగ సన్నివేశాల్లో చాలా బాగా నటించింది. మిగిలిన నటీనటులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
దర్శకుడు సినిమాను బాగా ప్రెజెంట్ చేశారు. ఒక్క భావోద్వేగాల విషయంలో జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. అలాగే మూడు పాత్రలకు మినహా మరే పాత్రకూ పెద్దగా ప్రాధాన్యం లేదు. అలా కొన్ని పాత్రలకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త వహించాల్సింది. సిద్దుకుమార్ అందించిన సంగీతం బాగానే ఉంది. బీజీఎం సన్నివేశాలకు ప్లస్ అయ్యింది.
కొన్నిసార్లు ప్రేమను కోల్పోవడమే.. నిజమైన ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకునేందుకు సోపానం.. యూత్‌కు కనెక్ట్ అవుతుంది.