తమిళ సినిమాలో మాన్‌స్టర్, వ్యాంపైర్ (రాక్షస, రక్తపిశాచి) నేపథ్యంలో కథలు చాలా అరుదు. దర్శకుడు మారియప్పన్ అలాంటి అరుదైన కథనే ఎంచుకునే ఎంచుకుని ‘ఇమ్మోర్టల్’ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. దీనికి ‘నాకు మరణం లేదు’ అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఒక కొత్త కథాంశాన్ని ఎంచుకుని దాని చుట్టూ కథను అల్లారు. ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాష్ కుమార్, కాయాదు లోహార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫాంటసీ, హారర్, రొమాన్స్, సర్వైవల్ థ్రిల్లర్ అంశాల కలయికగా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే…
వేల సంవత్సరాల క్రితం ఒక గిరిజన గ్రామంలో, ఒక జంట తమకు పుట్టబోయే బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురుచూసే సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. ఆమెకు డెలివరీ అవుతుంది. పుట్టిన బిడ్డను చూడగానే ఆ తల్లి భయంతో అరిచి, ఈ బిడ్డ చనిపోవాలని తన భర్తతో చెబుతుంది. ఇక ప్రస్తుతం చెన్నై సిటీకి కథ మారుతుంది. మగి (జీవీ ప్రకాష్ కుమార్) తన బాబాయ్ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తూ, ఒక చిన్న గదిలో నివసిస్తుంటాడు. అతను అమ్మాయిల పట్ల ఆకర్షితుడవుతూ ఉంటాడు. అతనికి గది ఖాళీ చేయాల్సిన తరుణం ఆసన్నమవుతుంది. రూ. 5000 బడ్జెట్‌లో అద్దె గది కోసం తీవ్రంగా వెతుకుతాడు. కానీ ఎక్కడా దొరకక నిరాశ చెందుతుంటాడు. ఆ సమయంలోనే ఓ యువతి నుంచి అతనికి కాల్ వస్తుంది. తన వద్ద ఒక రూమ్ ఉందని చెబుతుంది. అయితే ఓ కండిషన్ కూడా ఉంటుంది. అదేంటంటే.. తనతో అపార్ట్‌మెంట్‌ను పంచుకోవాలని. ఆ మాట వినగానే మగి ఉత్సాహంగా ఆ కొత్తింటికి పరుగెత్తుతాడు. దానిని చూసి తనకు అంత విలాసవంతమైన ఇల్లు తనకు దక్కినందుకు ఆశ్చర్యపోతాడు. విచిత్రమైన ప్రవర్తన కలిగిన సింధు (కాయాదు లోహార్)తో కలిసి రూమ్‌మేట్‌గా జీవనం ప్రారంభిస్తాడు. మొదట్లో వారి మధ్య ఆకర్షణగా అనిపించినా, త్వరలోనే వాతావరణం భయంకరంగా మారుతుంది. అసలేం జరిగింది? తాను ఆమెతో కలిసి ఈ ఇంట్లో చిక్కుకుపోయానని భయపడిన మాగి, చివరకు ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడతాడు? సింధు దాచిన ఆ రహస్యం ఏమిటి? వంటి విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే…
తమిళ సినిమాలో చాలా అరుదైన కథాంశాన్ని ఎంచుకున్నందుకు దర్శకుడు మారియప్పన్ చిన్నను అభినందించాలి. జంప్ స్కేర్స్‌పై మాత్రమే ఆధారపడకుండా, ఆ రాక్షస జీవి నేపథ్యాన్ని వివరించేందుకు పురాణాలను, మైథాలజీని ఆధారంగా చేసుకున్నారు. తద్వారా కథను ఆసక్తికరంగా పరిచయం చేయడానికి ప్రయత్నించారు.
ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, మాగి-సింధు మధ్య రొమాంటిక్ కోణాన్ని పరిచయం చేయగా.. సెకండాఫ్ వచ్చేసి.. ట్విస్ట్‌లు రివీల్ చేయడం నుంచి కథను సర్వైవల్ థ్రిల్లర్ దిశగా నడిపించారు. ప్రథమార్ధంలో దర్శకుడు కాయాదు లోహార్ పాత్రను చాలా గ్లామరస్‌గా చూపించారు. అయితే ఈ గ్లామర్ అంశాలకు కథతో ఎలాంటి సంబంధమూ ఉండదు. అనవసరంగా దీనిని ఎక్కువగా చూపించారేమో అనిపిస్తుంది. అలా చేయడం వలన సింధు పాత్రను కేవలం గ్లామర్ పాత్రగానే పరిమితం చేసినట్లయింది. తీసుకున్న లైన్ బాగుంది. కానీ బలహీనమైన కథనం, స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు అతి పెద్ద మైనస్. కొన్నిచోట్ల స్లో నెరేషన్ కారణంగా చూసేవారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. మైథాలజీ అంశాలను ఇంకా లోతుగా చూపించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా పాత్రల మధ్య భావోద్వేగాలు బలంగా లేవు. అలాగే సింధుకు మాగి ఎందుకు నచ్చాడనేది చెప్పలేదు. ఇక కథ భయంకరమైన మలుపు తిరిగినప్పుడు ప్రేక్షకులు ఏమాత్రం భావోద్వేగానికి గురి కారు. పైగా మాగి ప్రాణాల కోసం చేసే పోరు ఆసక్తిని కలిగించదు. సినిమాలో అతిపెద్ద మైనస్.. మాన్‌స్టర్, వ్యాంపైర్ భావనలను మిక్స్ చేయడం. దీంతో ఆ జీవి రెండింటి లక్షణాలలో దేనికి సరిగా సెట్ కాక గందరగోళమవుతుంది. కానీ అసలది మాన్‌స్టర్‌గా ఎలా మారిందనేది మాత్రం చూపించలేదు. దీంతో ప్రేక్షకుడు అయోమయానికి గురవుతాడు. అసలు ఆ రాక్షస జీవి మాగిని ఎందుకు ఇష్టపడిందనే దానికి స్పష్టత లేదు.
ఎవరెలా నటించారంటే..
సినిమాకు ప్రధాన బలం జీవీ ప్రకాష్ నటన. భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్న ఒక సాధారణ వ్యక్తిగా తన భయాన్ని, బలహీనతను చాలా సహజంగా చూపించారు. కాయాదు లోహార్‌ది ఒక క్లిష్టమైన పాత్ర. ఒకే సమయంలో అందంగా, ఆకర్షణీయంగా ఉంటూనే… భయపెట్టేలా, బ్యాడ్‌గా కనిపించాలి. ఆమె ఆ పాత్రను అద్భుతంగా చేసింది. మిగిలిన పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
ఇలాంటి చిత్రాలకు బీజీఎం, వీఎఫ్‌ఎక్స్ కీలకం. సంగీత దర్శకుడు శామ్ సీఎస్ తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలకు కావలసిన టెన్షన్, బిల్డప్‌ను అందించి సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. వీఎఫ్ఎక్స్ కూడా బాగుంది. సినిమా ఎక్కువ భాగం ఒకే అపార్ట్‌మెంట్‌లో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. బోర్ కొట్టకుండా నడిపించారు.
ఫైనల్‌గా.. ‘ఇమ్మోర్టల్’ కొంతమేర ఆకట్టుకుంటుంది.