దొంగ నా కొడుకు

Published by
Srinivas

Donga Naa Koduku Telugu: ‘లిటిల్ హార్ట్స్’ విజయం తర్వాత మౌళి నటించిన సినిమా ‘దొంగ నా కొడుకు’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి. 

Mouli Tanuj Prasanth’s Donga Naa Koduku Movie Review:

సెన్సార్ బోర్డు సూచనతో ‘దొంగ నా కొడుకు’ టైటిల్‌ను ‘డీఎన్‌కే’గా మార్చారు. ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు హీరో మౌళి మీద సింపతీ క్రియేట్ అయ్యింది. అతనిపై ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూయర్ చేసిన వ్యాఖ్యలను నెటిజనులు ఖండించారు. మౌళికి మద్దతుగా నిలిచారు. ఎటువంటి నేపథ్యం లేకుండా కంటెంట్ క్రియేటర్ నుంచి హీరోగా ఎదిగిన… ‘నైంటీస్’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మౌళికి ప్రేక్షకులలో మంచి పేరు వచ్చింది. అయితే… ‘డీఎన్‌కే’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో మౌళి చేసిన కొన్ని కామెంట్స్, అతనికి సపోర్ట్ చేసిన నెటిజనులకు నచ్చలేదు. మరి సినిమా?

కథ (Donga Naa Koduku Movie Story):

ఈశ్వర్ (మౌళి)కి ఉద్యోగం లేదు. గుండు బాస్ (గుండు సుదర్శన్) జ్యువెలరీ కంపెనీలో పని చేసే తండ్రి ఆదినారాయణ (అలీ) ఏదో ఒక ఉద్యోగం చేయమని నెత్తి నోరు మొత్తుకున్నా పట్టించుకోడు. పైగా ఇంటిలో డబ్బులు దొంగతనం చేసి మరీ ఆన్‌లైన్ యాప్‌లలో బెట్టింగ్స్ వేయడం పనిగా పెట్టుకున్నాడు. ఆఖరికి ప్రేమించిన అమ్మాయి దీప (సుష్మితా శెట్టి) ఉంగరాలు కూడా తాకట్టు పెడతాడు. ఆ విషయంలో ఆమె తండ్రి పుల్లయ్య (రఘుబాబు)కు తెలుస్తుంది. ఈశ్వర్ ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు. తమకు ఇవ్వవలసిన పది లక్షలు నెలలోపు ఇవ్వాలని వార్నింగ్ ఇస్తాడు. 

డబ్బుల కోసం గుండు బాస్ జ్యువెలరీలో దొంగతనం చేయాలని స్నేహితుడు సత్య (బబ్లూ)తో కలిసి ప్లాన్ చేస్తాడు ఈశ్వర్. అయితే… వాళ్ళు వెళ్ళేసరికి వేరొకరు దొంగతనం చేస్తారు.పోలీసులకు ఈశ్వర్, సత్య దొరుకుతారు. అసలు దొంగతనం చేసింది ఎవరు? ఆ తర్వాత ఎవరి మర్డర్ జరిగింది? ఈ కేసు నుంచి ఈశ్వర్ ఎలా బయట పడ్డాడు? అనేది సినిమా.

విశ్లేషణ (Donga Naa Koduku Review In Telugu):

‘నైంటీస్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’, ‘లిటిల్ హార్ట్స్’ తర్వాత మౌళిపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘దొంగ నా కొడుకు’ టీజర్, ట్రైలర్ కూడా ప్రామిసింగ్ అనిపించాయి. సినిమాలో మౌళి మేజిక్ చేస్తాడని ఆడియన్స్ ఆశించారు. ఆ ఆశలు గల్లంతు కావడానికి మౌళి, కొత్త దర్శకుడు శ్రీను కంబాల ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు స్టార్టింగ్ నుంచి హింట్స్ ఇస్తూ వెళ్ళారు. చివరకు గట్టిగా డిజప్పాయింట్ చేశారు. 

పనీపాటా లేని ఓ చిల్లర కుర్రాడు, బెట్టింగ్స్ కోసం తల్లిదండ్రులతో పాటు లవర్ డబ్బును ఎలా తగలేశాడు? దొంగతనం కేసు నుంచి ఎలా తప్పించుకున్నాడు? అనేది క్లుప్తంగా ‘దొంగ నా కొడుకు’ కథ. క్రైమ్ కామెడీకి కావాల్సిన సెటప్ కుదిరింది. ట్విస్టులు బావున్నాయని చెప్పాలి. కానీ ఆడియన్స్ చేత నవ్వించడానికి అవసరమైన కామెడీ కొరవడింది. సినిమా మొదటి నుంచి చివరి వరకు పంచ్ డైలాగుల్లో ఒరిజినాలిటీ లేదని ప్రతి సన్నివేశంలో బయట పడుతూ ఉంది. తెలుగులో స్పూఫ్ కామెడీ ట్రెండ్ ఇటీవల తగ్గింది. అది క్యాచ్ చేసి కామెడీ చేస్తే ఫ్లాప్ నుంచి బయట పడవచ్చని మౌళి, శ్రీను కంబాల అండ్ టీం భావించినట్టు ఉంది. హిట్ ప్రోడక్ట్ ఇవ్వడంలో మాత్రం క్లీన్ బౌల్డ్ అయ్యింది.

గుండు బాస్ జ్యువెలరీ షాప్, గుండు సుదర్శన్ గెటప్ చూస్తే… లలితా జ్యువెలరీ గుర్తుకు వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మౌళి, జయకృష్ణ ట్రాక్ చూస్తే… ‘డోరతీ’ని స్పూఫ్ చేశారనిపిస్తుంది. అఫ్‌కోర్స్, ఆ తమిళ్ సినిమా కంటే ముందు ‘డీఎన్‌కే’ అనౌన్స్ చేశారు, సినిమా తీశారు. ఓ సన్నివేశంలో బాలయ్యను ఇమిటేట్ చేశారు అలీ. ఎవరెన్ని చేసినా కథతో ట్రావెల్ చేసేలా కథనం, సన్నివేశాలు లేవు. కామెడీ పూర్తిగా నవ్వించలేదు. కథకు తగ్గట్టు ఎడిటింగ్ సాగింది. సింజిత్ యెర్రమిల్లి మాత్రం తన పాటలు, నేపథ్య సంగీతంతో ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. కెమెరా వర్క్ ఓకే. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి చిన్న సినిమా అయినా బాగా ఖర్చు చేశారు.

మౌళి కామెడీ టైమింగ్, యాక్టింగ్ ఎప్పట్లా ఉన్నాయి. తన ఎనర్జీతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ, కథ – సన్నివేశాల్లో సత్తా లేనప్పుడు హీరోలు – ఆర్టిస్టులు కూడా ఏమీ చేయలేరని చెప్పే చిత్రమిది. మౌళి స్నేహితుడిగా బబ్లూ కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. అలీ, రఘుబాబు, రజిత, ప్రియా, భద్రం వంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఒక్కరికీ సరైన సన్నివేశాలు లేవు. సరిగ్గా నవ్వించలేదు. చివరిలో సత్య అతిథి పాత్రలో మెరిశారు. హీరోయిన్ సుష్మితా శెట్టి లుక్స్, యాక్టింగ్ పర్వాలేదు. కానీ, మౌళితో పెయిర్ సెట్ కాలేదు.

Donga Naa Koduku Verdict:

స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సినిమా ‘డీఎన్‌కే’. మధ్య మధ్యలో కొన్ని నవ్వులు తప్ప కామెడీలో కొత్తదనం లేదు. సినిమాలో సత్తా లేదు. చిల్లర్ కామెడీ పేరుతో కొన్ని చోట్ల గీత దాటి మరీ డైలాగులు రాశారు. అవి వల్గర్‌గా ఉన్నాయి. నవ్వించడంలో ‘డీఎన్‌కే’ టీమ్ ఫెయిల్ అయ్యింది.మౌళి డిజప్పాయింట్ చేశారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

చంద్రయాన్

నవంబర్ 13, 2026

మాయ లేడీ

నవంబర్ 13, 2026

ఇట్లు అర్జున

నవంబర్ 13, 2026

సీన్

నవంబర్ 6, 2026

సమ్మర్ హాలిడేస్

నవంబర్ 6, 2026

రామాయణ: పార్ట్ 1

నవంబర్ 5, 2026