రావు బహదూర్‌

Published by
Srinivas

సూపర్‌స్టార్ మహేశ్ బాబు సమర్పకులుగా చేసిన సినిమా ‘రావు బహదూర్’. అలాగే మహేశ్ బాబు.. సినిమా గురించి గొప్పగా చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే వెంకటేశ్ మహా, సత్యదేవ్ కాంబోలో గతంలో వచ్చిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం చాలా మంచి సక్సెస్ సాధించింది. తిరిగి అదే కాంబో రిపీట్ అవడంతో ఈ సినిమా కూడా చాలా మంచి సక్సెస్ సాధిస్తుందన్న ఆలోచనలో ప్రేక్షకులు ఉన్నారు. అలాగే రేపు సత్యదేవ్ పుట్టినరోజు. మరి ఈ సినిమా సక్సెస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందా? సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.

కథేంటంటే..

‘రావు బహదూర్ ఒక పిరియాడిక్ మూవీ. 1991లో భువన వంశానికి చెందిన రామప్ప రావు బహదూర్ అలియాస్ రాముడు(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ బారిన పడతాడు. డాక్టర్స్ సైతం బతికించలేమని చేతులెత్తేస్తారు. నాలుగు నెలలకు మించి బతకడని ఓ డాక్టర్ రిపోర్ట్ సైతం ఇస్తాడు కానీ ఆ రిపోర్ట్ ఇచ్చి ఏడాది దాటిపోయినా కూడా రామప్పకు ఏమీ కాదు. పైగా ఆల్కహాల్ తీసుకుంటున్నా ఏమాత్రం ప్రభావం చూపదు. కానీ సైకలాజికల్‌గా రామప్ప ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనకు తానే ఏదో ఊహించుకుని.. భయాందోళనకు గురవుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే నిద్రలో నుంచి లేచి అ‍ప్పుడప్పుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. దీనికంతటికి కారణం అతని చిన్న కొడుకు కుసుమప్ప. చాలా కాలం క్రితమే అతను మరణించాడు. అయితే కుసుమప్ప తన కొడుకు కాదని రామప్ప అనుమానం. దాన్నే పెనుభూతంగా మార్చుకుని మెంటల్‌గా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి(వికాస్ ముప్పల) కి చెప్పి డీఎన్‌ఏ టెస్ట్ చేయించమని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలా చేసి తనకు ప్రశాంత మరణం ప్రసాదించమని కోరతాడు. కానీ అవన్నీ కుదరవని ఆచారి చెబుతాడు. ఆ తరువాత ఏం జరిగింది? చివరకు డీఎన్ఏ టెస్ట్ చేయించారా? కుసుమప్ప.. రామప్ప కుమారుడు కాదా? వంటి విషయాలను వెండితెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

కథ ఏదైనా సరే.. ప్రెజెంట్ చేసే విధానమే కీలకం. ఎన్ని ట్విస్టులు పెట్టినా ఏం చేసినా కూడా అంతిమంగా ప్రేక్షకులకు అవన్నీ ఎక్కాలి. లేదంటే ఎలాంటి కథైనా కూడా పేలదు. ‘రావు బహదూర్’ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఇక్కడ సరైన కథ లేదు. దానిని ప్రెజెంట్ చేసిన తీరు బాగోలేదు. పైగా పాత్రదారులంతా దాదాపుగా కొత్తవారే.. ఎవరి ఫేస్ ప్రేక్షకులకు తెలిసింది కాదు. చాలా వరకూ కనీసం బీజీఎం కూడా లేకుండానే సినిమాను నడిపించారు. మరి ఇదొక వినూత్న ప్రయోగం అయితే అయ్యుండొచ్చేమో కానీ ప్రేక్షకులకు మాత్రం ఒక హింస. ఎవరికైనా అనుమానం పెనుభూతంగా మారితే అదొక సైకలాజికల్ ప్రాబ్లమ్‌గా అవుతుంది. చాలా ఇబ్బంది పడతారు. ఈ పాయింట్‌తో రూపొందింతే ఈ సినిమా. పాత్రధారులున్నా కూడా ఇది సత్యదేవ్ వన్ మ్యాన్ షోలాగే కనిపిస్తుంది. ఇతర పాత్రలన్నీ నామమాత్రంగానే అనిపిస్తాయి. ఓ ఫొటో ఫ్రేమ్ నుంచి బయటకొచ్చిన ఓ పిల్లాడు వేగంగా పరుగెత్తే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. కానీ అంతగా ఆకట్టుకోదు. ఆది నుంచి కూడా సినిమా రంజింపచేయలేకపోయింది. రామప్ప ఎంట్రీ.. ఫ్లాష్‌బ్యాక్.. తండ్రిని చూసుకోవడానికి వచ్చిన నర్స్‌తో రామప్ప వివాహం వంటి సన్నివేశాల్లో ఏ ఒక్కటీ ఆసక్తిగా అనిపించదు. పైగా సినిమా చాలా స్లో నెరేషన్. ఒకే ఒక్క పాయింట్‌ని పట్టుకుని దాదాపు మూడు గంటల పాటు సాగదీశారు. కొన్ని చోట్ల కామెడీ కాస్త వర్కవుట్ అయ్యింది.

ఎవరెలా నటించారంటే..

సత్యదేవ్ వన్ మ్యాన్ షో. అదరగొట్టేశాడు. తన పాత్రకు జీవం పోశాడు. చిత్ర విచిత్రమైన క్యారెక్టర్ ఆయనది. ఎప్పుడెలా మారుతాడో తెలియదు. కానీ ఎలా మారినా కూడా చక్కగా మెప్పించాడు. రామప్ప భార్య రేణుగా దీపా థామస్ చేసింది. ఆమె పాత్ర నిడివి తక్కువైనా బాగానే మెప్పించింది. ఇక రామప్ప ఇంట్లో పనిమనిషిగా చేసిన మహిళకు మంచి పాత్ర దక్కింది. కాస్త కామెడీ వర్కవుట్ అయ్యిందంటే ఆమె కారణంగానే. వికాస్ ముప్పలకు సైతం మంచి పాత్ర దక్కింది. ఆయన కూడా తన నటనతో ఆకట్టుకున్నారు.

టెక్నికల్ పరంగా..

డైరెక్టర్ వెంకటేశ్ మహా కథను కాస్త మంచిగా రాసుకుని ఉంటే బాగుండేది. ఏదో డిఫరెంట్‌గా ట్రై చేద్దామనుకుని మొత్తానికి దెబ్బేసుకున్నారు. కథ మొత్తం దాదాపుగా ఒకే ఇంట్లో నడిపించేశారు. అసలు కన్నా ఊహలకు ఎక్కువగా పదనుపెట్టి సినిమాను చిక్కుల్లో పడేశారు. వెంకటేశ్ మహా కూడా ఈ చిత్రంలో ఒక కేమియో చేశారు. రావు బహదూర్ ముత్తాత తాతకు తాత పాత్రలో కనిపించారు. మ్యాజిక్ విషయానికి వస్తే ఏమాత్రం మెప్పించదు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. ఎడిటింగ్ విషయంలో కత్తెరను బాగా వాడాల్సింది.

ఫైనల్‌గా.. ‘రావు బహదూర్’ సత్యదేవ్‌కు బర్త్‌డేకి ఇచ్చే బ్యాడ్ గిఫ్ట్ ఇది..

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

నాగబంధం

జూలై 3, 2026

బాలన్: ది బాయ్

జూన్ 20, 2026

దీవాన

జూన్ 20, 2026

వంద దేవుళ్లు

జూన్ 19, 2026

సింగ్ గీతం

జూన్ 12, 2026