భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రయోగాలనేవి చాలా అరుదు. అలాంటి ఒక అరుదైన ప్రయోగాన్ని తన 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు చేశారు. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్, ప్రమోషన్స్ తో అంచనాలకు రెక్కలు కట్టేశారు. మరి సినిమా అంచనాలను అందుకుందా? చూద్దాం.
కథేంటంటే..
భోపాల్ సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ప్రతాప్ మన్నెం (అయాన్)కి తన తండ్రి ఆస్తి పేపర్లు లభిస్తాయి. ఆ ఆస్తి కుబేరపురం అనే ఊరిలో ఉందని తెలుసుకున్న ప్రతాప్ ఆ ఊరికి వెళతాడు. అక్కడ చెట్టంటే ప్రాణం ఇచ్చే గౌరి(అహిల్య)ను కలుస్తాడు. ప్రతాప్‌ని ఆమె.. రేణు(షాలిని) అనే సెల్ఫిష్ మైనింగ్ బిజినెస్ విమెన్ దగ్గరకు తీసుకెళుతుంది. తనకు చెందిన గోల్డ్ మైన్‌ని అక్రమంగా రేణు అమ్మేస్తుందని ప్రతాప్ తెలుసుకుంటాడు. దీంతో తనకు ఆ మైన్‌లో 50 శాతం వచ్చేలా డీల్ మాట్లాడి మైనింగ్ అమ్మకానికి అంగీకరిస్తాడు. ఈ క్రమంలోనే గౌరి ప్రాణంగా చూసుకుంటున్న చెట్టుని కొట్టిస్తాడు. గౌరి ఎంతగా వేడుకున్నా గ్రామస్తులంతా బంగారంపై ఆశతో ఎవరూ ఆ చెట్టు కొట్టడాన్ని అడ్డుకోరు. చెట్టు కొట్టేసిన తరువాత అనూహ్యంగా ఆ ఊరిలోని వారంతా మాట్లాడటం మానేసి పాటలు పాడుతూ ఉంటారు. ఏం చెప్పాలన్నా పాటతోనే చెబుతుంటారు. వారికి తిరిగి మాట ఎలా వచ్చింది? అసలు ప్రతాప్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఒకప్పుడు పచ్చగా ఉన్న కుబేరపురం ఎందుకు పాడబడినట్టుగా అయిపోయింది? వంటి అంశాలను వెండితెరపై వీక్షించాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
ఒక అద్భుతమైన ప్రయోగం.. సంగీతం నేపథ్యంలో గతంలోనూ సినిమా వచ్చి ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది. అదే శంకరాభరణం. కానీ ఇది మరో తరహా కథ. ఇక్కడ క్రెడిట్ దేవిశ్రీ ప్రసాద్‌కు కూడా ఇవ్వాలి. పాటలతో సినిమా సాగుతున్నా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా.. ఈ తరానికి నచ్చేలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. సింగీతం శ్రీనివాసరావు సినిమాను తెరకెక్కించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఒక అద్భుతమైన మెసేజ్‌ను కూడా సినిమాతో ఇచ్చారు. మనిషి అత్యాశను ప్రధాన కథాంశంగా తీసుకుని అద్భుతంగా కథ నడిపించారు. అసలు ఈ తరహా సినిమా అనేది ఇండియన్ హిస్టరీలోనే ప్రథమమని చెప్పాలి. ఒక చిన్న విలేజ్ నేపథ్యంలో పూర్తిగా కథను నడిపించారు. ప్రతి పాత్రకూ ప్రాధాన్యమిచ్చారు. అయితే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పలేం. సంగీత ప్రియులకైతే పండుగ లాంటి సినిమా. ఒక ఆర్ట్ ఫిలిం అని చెప్పాలి. కానీ మాస్‌కు ఎక్కడం కష్టమే.
ఎవరెలా నటించారంటే..
ఈ కథలో మెయిన్ పాత్రధారులైన అహిల్య, అయాన్, షాలిని అద్బుతంగా నటించారు. ఎక్కడా హీరోకి కానీ.. హీరోయిన్ కానీ భారీ భారీ ఎలివేషన్స్ లేవు. వీరు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక శివనారాయణ, బెనర్జీ, తులసి వంటి వారు సైతం తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
టెక్నికల్ పరంగా..
ముఖ్యంగా చెప్పాల్సింది లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గురించి. ఆ ఆలోచనకే హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను రూపొందించిన తీరు అద్భుతం. పాటలతో సినిమా ఎలా ఉంటుందనేది ఆయన చూపించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో మరోసారి తన పవరేంటో చూపించారు. క్లాస్, మాస్ అందరికీ నచ్చేలా మ్యూజిక్ ఇచ్చారు. సినిమాకు ఆయన మ్యూజిక్కే ప్రాణం. నిర్మాత నాగ్ అశ్విన్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవకుండా సినిమాను రూపొందించారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది.
తీర్పు: ‘సింగ్ గీతం’ ఒక అద్భుతమైన సినిమా