పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? పెద్దలు.. పిల్లల విషయంలో ఎలా ఉండాలనే అంశంతో పాటు కుటుంబ విలువలతో కూడిన చిత్రమే ‘సమ్మర్ హాలిడేస్’. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
రావూరి వెంకటేశ్వర్లు అలియాస్ ఆర్‌వీ (మాస్టర్ అరుణ్ దేవ్)కి ఆటలంటే చాలా ఇష్టం. పిల్లలంతా క్రికెట్ ఆడుతుంటే తను కూడా ఆడాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ తండ్రి (హర్షవర్ధన్) గేమ్స్ జోలికే వెళ్లనివ్వడు. ఆయనకు ర్యాంకులే కావాలి. కానీ తల్లి (వాసుకి) మాత్రం ఆర్వీకి అండగా నిలుస్తూ ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ వస్తే క్రికెట్ కొనిపిస్తానని ఆర్వీకి తండ్రి చెబుతాడు. కానీ ఆర్వీకి 10వ ర్యాంక్ వస్తుంది. దీంతో తండ్రి గట్టిగా చివాట్లు పెడతాడు. ఆర్వీ చాలా డల్ అయిపోతాడు. అతడిని సమ్మర్ హాలిడేస్‌కి తల్లి అమ్మమ్మ (జయసుధ) గారింటికి తోటవారిపాలెం తీసుకెళుతుంది. వాళ్లింట్లో పని చేసే నాగమణి కొడుకే కాశీ వెంకటేశ్వర్లు అలియాస్ కేవీ (మాస్టర్ రోహన్). సరదాగా ఉండే కేవీకి తల్లే ప్రపంచం. తన తల్లిని సంతోషంగా చూసుకోవడం కోసం పేపర్లు వేస్తూ చాలా కష్టపడుతూ ఉంటాడు. రెండు మామిడి చెట్లను లీజుకు తీసుకుంటాడు. ఆర్వీ సరదాగా అక్కడి తన తల్లి చదివిన స్కూలుకి వెళతాడు. అక్కడ కేవీతో పరిచయం కాస్తా స్నేహంగా మారుతుంది. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? కేవీ స్నేహంతో ఆర్వీ ఎలా మారాడు? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
సినిమాలో ముందుగా మైనస్‌ల గురించి మాట్లాడుకుంటే అసలు లేవని కాదు. ఒకట్రెండు సన్నివేశాలు చాలా అతిగా అనిపిస్తాయి. వాటిని పక్కనబెడితే ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ మూవీ. ప్రతి ఒక్కరూ తన చిన్నతనంలోకి వెళ్లిపోతారు. గ్రామంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? పిల్లలంతా ఎంత చక్కగా ఆడుకుంటారు. చెరువులో ఈత కొట్టడం.. క్రికెట్ ఆడటం వంటివన్నీ దర్శకుడు చూపించారు. పిల్లలు అమ్మమ్మ గారింటికి వెళితే ఎంత ఆనందంగా గడుపుతారు. అక్కడి పిల్లలతో స్నేహం.. అమ్మమ్మ చెప్పే కథలు వంటివి చక్కగా చూపించారు. కల్మషం లేని ఇద్దరు పిల్లల స్నేహం ఎలా ఉంటుందనేది కూడా చూపించారు. తల్లి కోసం పిల్లలు పడే కష్టం.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ మరచిపోయి స్నేహితులతో గడపడం వంటి అంశాలను చూపించారు. మొత్తంగా సినిమా అయితే ఓ ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. స్టోరీ పెద్దగా ఏం లేదు. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు అమ్మమ్మగారింటికి వెళ్లి ఎలా గడుపుతారనే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓవరాల్‌గా అయితే సినిమా చూసి హ్యాపీగా బయటకు వస్తారు.
ఎవరెలా నటించారంటే…
రోహన్, అరుణ్ దేవ్ చాలా బాగా నటించారు. ప్రతి సన్నివేశంలో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్‌లా నటించారు. హర్షవర్ధన్ పాత్ర నిడివి తక్కువే అయినా కూడా ర్యాంకులే ప్రతిభకు కొలమానం అనుకునే ప్రతి తండ్రిని రిప్రెజెంట్ చేసినట్టుగా అనిపిస్తుంది. వాసుకి తల్లి పాత్రలో చాలా సహజంగా నటించింది. జయసుధ అమ్మమ్మగా తన పాత్రలో జీవించారు. రాజీవ్ కనకాల కూడా ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు.
టెక్నికల్ పరంగా…
దర్శకుడు తను రాసుకున్న కథను నిజాయితీగా తెరకెక్కించారు. సింజిత్ అందించిన మ్యూజిక్ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి.
ఫైనల్‌గా.. ‘సమ్మర్ హాలిడేస్’ ప్రతి ఒక్కరికీ అమ్మమ్మగారింటిని గుర్తు చేస్తుంది.