
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) న్యూజెర్సీ చాప్టర్‌కు కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగులను నియమించింది. నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల పాల్గొన్న ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా న్యూజెర్సీలో తెలుగు సమాజ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడం, యువతను సామాజిక సేవలో భాగస్వాములను చేయడం వంటి అంశాలపై నాయకులు చర్చించారు.
నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ మాట్లాడుతూ.. యువకుడు, ఉత్సాహవంతుడు, చురుకైన నాయకుడైన సాయి గంగులకు సామాజిక సేవ పట్ల ఉన్న అంకితభావం న్యూజెర్సీలో నాట్స్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతను నాట్స్ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల మాట్లాడుతూ.. నాట్స్ అభివృద్ధిలో న్యూజెర్సీ తెలుగు సమాజం అందించిన సేవలను ప్రశంసించారు. న్యూజెర్సీ నుంచి ముగ్గురు నాట్స్ అధ్యక్షులు రావడం ఈ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు అని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు మరింత చేరువవుతూ, సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి నాట్స్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి పలు తెలుగు సంఘాల నాయకులు, నాట్స్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. ఆప్టా (APTA), ఆత్మీయ (ATMIYA), మాటా (MATA), తానా (TANA), టీఫాస్ (TFAS), ఎన్‌ఆర్‌ఐవీఏ (NRIVA) సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగు సంఘాల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, సమాజ సేవ పట్ల ఉమ్మడి నిబద్ధతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు బిందు యలమంచిలి, టీపీ రావు, శ్యామ్ నాళం, మురళీకృష్ణ మేడిచెర్ల, శ్రీనివాస్ భీమినేని, వంశీ కొప్పురావూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాట్స్ జాతీయ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న నెక్సిల్లో హెల్త్ (Nexillo Health) సంస్థకు చెందిన శశి పర్వతం, బులియన్ ఫార్చ్యూన్ (Bullion Fortune) సంస్థకు చెందిన కల్యాణ్ లక్కింశెట్టి, వంశీకృష్ణ కొప్పురావూరి కూడా హాజరై నాట్స్ సేవా కార్యక్రమాలకు తమ మద్దతును తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ నాయకత్వాన్ని, ఆయన అందిస్తున్న సేవలను అభినందించారు. తెలుగు సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని రాజ్ అల్లాడ నొక్కిచెప్పారు. క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో నాట్స్‌తో కలిసి పనిచేయాలని వివిధ తెలుగు సంఘాలకు పిలుపునిచ్చారు.
తెలుగు సమాజంలో పరస్పర సంబంధాలను బలోపేతం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను విస్తరించడం వంటి లక్ష్యాలతో నాట్స్ ముందుకు సాగుతోందని ఈ సమావేశం మరోసారి స్పష్టం చేసింది.
