నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు హైదరాబాద్ నగర పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించింది. ఈ ఆంక్షలు ఇవాళ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
న్యూ ఇయర్ సందర్భంగా పెద్ద ఎత్తున జనసంచారం ఉండే నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలపైకి వాహనాలకు నో ఎంట్రీ విధించారు. ప్రజల భద్రత, వాహనాల రద్దీ నియంత్రణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అదేవిధంగా బేగంపేట్, టోలీచౌకి ప్రాంతాలను మినహాయించి నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఇక పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రయాణించాలంటే తప్పనిసరిగా ఫ్లైట్ టికెట్ ఉండాలని స్పష్టం చేశారు.
మరో కీలక నిర్ణయంగా, ఇవాళ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ సిటీ పరిధిలోకి ప్రైవేట్ బస్సులకు కూడా నో ఎంట్రీ అమలు చేయనున్నారు. ఈ ఏర్పాట్లతో అత్యవసర సేవలు, ప్రజల రాకపోకలు సజావుగా సాగుతాయని అధికారులు తెలిపారు.
నగరవాసులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, పోలీసులకు సహకరించాలని సూచించారు. పటిష్ట భద్రతా చర్యలతో హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.