భారతదేశ రక్షణ రంగ చరిత్రలో ఏప్రిల్ 3, 2026 ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. విశాఖపట్నంలోని రహస్య ‘షిప్ బిల్డింగ్ సెంటర్’ (SBC) నుండి ఉద్భవించిన “INS అరిదమన్” అణు జలాంతర్గామిని మొన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. “అరిదమన్… అంటే అది ఒక అజేయమైన శక్తి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, భారత నౌకాదళం యొక్క పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఈ పరిణామం హిందూ మహాసముద్రంలో భారతదేశాన్ని ఒక తిరుగులేని అగ్రగామిగా నిలబెట్టింది.
భారతదేశపు ప్రతిష్టాత్మక ‘అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెసెల్’ (ATV) ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన మూడవ అణు క్షిపణి జలాంతర్గామి ఈ “అరిదమన్”. ఇది తన పూర్వపు సబ్ మెరైన్స్ INS అరిహంత్ (2016), INS అరిఘాత్ (2024)ల కంటే సాంకేతిక పరంగా, పరిమాణ పరంగా ఎంతో ముందంజలో ఉంది.
“INS అరిహంత్” (6,000 టన్నులు) కంటే “INS అరిదమన్” బరువు సుమారు 7,000 టన్నులు. దీని పొడవు కూడా పెంచడం వల్ల ఇది శత్రువులకు మరింత భయంకరంగా కనిపిస్తుంది. ఇందులో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 83 మెగావాట్ల ప్రెషరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్ (CLWR) ఉంది. ఇది జలాంతర్గామికి అపరిమితమైన శక్తిని ఇస్తుంది.
దీని విధ్వంసక సామర్థ్యం గణనీయమైనది. రెట్టింపు ఆయుధ శక్తి దీని సొంతం. “INS అరిదమన్” యొక్క అత్యంత కీలకమైన శక్తి దాని క్షిపణి సామర్థ్యం.
లాంచ్ ట్యూబ్స్ అరిహంత్, అరిఘాత్‌లలో కేవలం 4 క్షిపణి ప్రయోగ ట్యూబ్స్ ఉండగా, అరిదమన్‌లో ఆ సంఖ్యను 8 కి పెంచారు. అంటే ఇది తన ముందు తయారైన సబ్ మెరైన్ ల కంటే రెట్టింపు దాడి చేయగలదు.
ఇది ఎనిమిది భారీ K 4 బాలిస్టిక్ క్షిపణులను మోసుకెళ్లగలదు. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను (చైనాలోని ప్రధాన నగరాలతో సహా) ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగల సామర్ధ్యం దీని ప్రత్యేకత. లేదా 24 చిన్న తరహా K-15 (సాగరిక) క్షిపణులను (750 కి.మీ రేంజ్) మోసుకెళ్లగలదు. సముద్రం లోపల కొన్ని వందల మీటర్ల లోతు నుండి కూడా ఈ క్షిపణులను ప్రయోగించే అద్భుత సామర్థ్యం దీనికి ఉంది.
అదృశ్య యుద్ధతంత్రం దీని ప్రత్యేకత అంటే “సాఫ్ట్ కిల్” టెక్నాలజీ, అరిదమన్ కేవలం క్షిపణులు వేయడానికే కాదు, శత్రువుల కళ్లు కప్పడంలోనూ సిద్ధహస్తురాలు. శత్రువుల అంచనాలకు, వారి యొక్క రాడార్ల కు దొరకకుండా, శబ్ద రహిత ప్రయాణం చేయగలదు. దీని డిజైన్ ఎంత అత్యాధునికంగా ఉంటుందంటే, ఇది నీటి అడుగున ప్రయాణించేటప్పుడు శత్రువుల సోనార్లకు కనీసం శబ్దం కూడా వినిపించదు.
అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్ అంటే దీనిలో అమర్చిన ‘ఉషస్’ (USHUS) మరియు ‘పంచేంద్రియ’ సోనార్ సిస్టమ్స్ శత్రువుల జామింగ్ ప్రయత్నాలను తిప్పికొడతాయి. శత్రువుల క్షిపణులు వస్తున్నా వాటిని దారి మళ్లించే “యాంటీ టార్పెడో డెకాయ్స్” ఇందులో ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలో అణు క్షిపణి జలాంతర్గాములు (SSBN) కలిగిన దేశాలు కేవలం ఆరు మాత్రమే. వాటిలో అమెరికా (14 – Ohio class), రష్యా (12 – Borei class) వంటి అగ్రరాజ్యాల సరసన భారత్ ఇప్పుడు 3 శక్తివంతమైన జలాంతర్గాములతో నిలిచింది. చైనా దగ్గర 7 జలాంతర్గాములు ఉన్నప్పటికీ, మన అరిదమన్ లోని “K సిరీస్” క్షిపణులు ఇచ్చే భద్రత మనకు వ్యూహాత్మక ఆధిక్యాన్ని ఇస్తుంది.
భవిష్యత్తు ప్రణాళికలు ఇంకా పటిష్టంగా రాబోతున్నాయి. మనకు ఈ 3 లేదా 4 జలాంతర్గాములు సరిపోవు అని మన రక్షణ శాఖ అధికారులు అంటున్నారు. నిరంతరం సముద్ర గర్భంలో ఒక అణు కవచంలా సిద్ధంగా ఉండాలంటే మనకు కనీసం 6 నుండి 8 ఇటువంటి నౌకలు అవసరం. “అరిదమన్” లాంటి మరో భారీ అణు జలాంతర్గామి ఇప్పటికే నిర్మాణం చివరి దశలో ఉంది.
దీని తర్వాత భారత్ 13,000 టన్నుల బరువున్న ‘మెగా’ జలాంతర్గాములను నిర్మించబోతోంది. ఇవి 5,000 నుండి 8,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను (Intercontinental range) కొట్టగలవు.
“INS అరిదమన్” ప్రారంభంతో భారత్ తన “నో ఫస్ట్ యూజ్” అంటూనే… అనగా ముందుగా అణు దాడి చేయము విధానానికి కట్టుబడి ఉంటూనే, ఒకవేళ ఎవరైనా మనపై దాడి చేస్తే వారిని సముద్ర గర్భం నుండి నామరూపాలు లేకుండా చేసే శక్తిని సంపాదించుకుంది. 70% కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో, మన దేశంలోని ప్రైవేట్ సంస్థల (L&T, టాటా వంటివి) సహకారంతో తయారైన ఈ నౌక భారతదేశ పారిశ్రామిక శక్తికి ప్రతీక.
శాఖ తీరంలో “INS అరిదమన్” గర్జన కేవలం పాకిస్తాన్, చైనాలకు హెచ్చరిక మాత్రమే కాదు… అది ప్రపంచ శాంతిని కాపాడే ఒక ‘భారత రక్షణ కవచం’ కూడా.