Download App

సముద్ర గర్భాన రక్షణ ‘శక్తి’… మన భారత ‘తారాగిరి’…

ఏప్రిల్ 5, 2026 By Suresh Thota
భారతదేశ సముద్ర తీర రక్షణ చరిత్రలో ఏప్రిల్ 3, 2026 ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు "INS తారాగిరి" యుద్ధనౌకను భారత నేవీ అధికారులకు అందజేశారు. ఈ నౌక ప్రవేశం తో హిందూ మహాసముద్ర...
సముద్ర గర్భాన రక్షణ 'శక్తి'… మన భారత 'తారాగిరి'…

భారతదేశ సముద్ర తీర రక్షణ చరిత్రలో ఏప్రిల్ 3, 2026 ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు “INS తారాగిరి” యుద్ధనౌకను భారత నేవీ అధికారులకు అందజేశారు. ఈ నౌక ప్రవేశం తో హిందూ మహాసముద్ర ప్రాంతంలో (IOR) భారతదేశ నేవీ ఒక తిరుగులేని, బలమైన శక్తిగా కీర్తి ప్రతిష్టలు అందుకుంటుంది.

తారాగిరి:

భారత నౌకాదళంలో ‘ప్రాజెక్ట్ 17A’ (నీలగిరి క్లాస్) కింద నిర్మితమైన ఐదవ యుద్ధనౌక ఈ తారాగిరి. హిమాలయాల్లోని ‘తారాగిరి’ అనే పర్వత శిఖరం పేరుని దీనికి నామకరణం చేశారు. 1980 నుండి 2013 వరకు దేశానికి సేవలందించిన పాత తారాగిరి నౌక స్థానంలో, ఇప్పుడు ఈ అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన “స్టేల్త్ ఫ్రిగేట్” “తారాగిరి” నౌక రంగ ప్రవేశం చేసింది.

నిర్మాణ విశేషాలు:

పొడవు: 149 మీటర్లు, ​వెడల్పు: 17.8 మీటర్లు, కాగా బరువు 6,670 టన్నులు, దీని వేగం 28 నాట్స్ అంటే సుమారు గంటకు 52 కిలోమీటర్లు…. ఈ నౌకను ‘మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్’ (MDL) నిర్మించింది. ఇందులో ఉపయోగించిన స్టీల్ నుండి ఆయుధాల వరకు 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవ్వడం గమనార్హం.

స్టైల్త్ టెక్నాలజీ:

రాడార్ల కళ్లు కప్పే టెక్నాలజీ మన ​తారాగిరి యొక్క ప్రధాన ఆకర్షణ, దాని “స్టేల్త్” (Stealth) సామర్థ్యం. సాధారణ యుద్ధనౌకలు రాడార్ స్క్రీన్ మీద పెద్ద చుక్కలా కనిపిస్తాయి, కానీ తారాగిరి డిజైన్ మరియు దానిపై వాడిన ప్రత్యేక పెయింట్ (Radar Absorbent Material) వల్ల ఇది శత్రు రాడార్లకు ఒక చిన్న పడవలా లేదా పక్షిలా కనిపిస్తుంది. ​తక్కువ స్థాయి లో అంటే ఇంజిన్ నుండి వచ్చే వేడిని తగ్గించే “ఇన్‌ఫ్రారెడ్ సప్రెషన్” సిస్టమ్ వల్ల శత్రువుల “హీట్ సీకింగ్” క్షిపణులు దీనిని గుర్తించడం అసాధ్యం. సముద్రం లోపల ఉండే సోనార్లకు చిక్కకుండా ఉండేలా దీని ఇంజిన్ శబ్దాన్ని నియంత్రించే సాంకేతికతను ఇందులో వాడారు.

యుద్ధనౌకకు ఆయుధాలు ఎంత ముఖ్యమో, శత్రువును గందరగోళానికి గురిచేసే ‘ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్’ అంతకంటే ముఖ్యం. ఈ తారాగిరిలో అమర్చిన ‘శక్తి’ వ్యవస్థ మూడు స్థాయిల్లో పనిచేస్తుంది.
​మొదటిది “ఎలక్ట్రానిక్ సపోర్ట్” (ES) ఇది నిరంతరం సముద్రంలోని రేడియో తరంగాలను స్కాన్ చేస్తుంది. శత్రువు తన రాడార్‌ను ఒక్క సెకను ఆన్ చేసినా, ఆ సిగ్నల్ ఆధారంగా అది ఏ దేశపు నౌక, అందులో ఉన్న ఆయుధాలేమిటి అనేది తారాగిరిలోని కంప్యూటర్లు వెంటనే విశ్లేషిస్తాయి.

రెండవది”ఎలక్ట్రానిక్ అటాక్” (EA) అంటే డిజిటల్ దాడి. దీనిని ‘సాఫ్ట్ కిల్’ అని పిలుస్తారు. శత్రువు మనపైకి క్షిపణిని ప్రయోగిస్తే, శక్తి సిస్టమ్ దాని గైడెన్స్ సిస్టమ్‌ను జామ్ చేస్తుంది. ఫలితంగా ఆ క్షిపణి లక్ష్యాన్ని తప్పి సముద్రంలో పడిపోతుంది. ​DRFM (Digital Radio Frequency Memory) ఇది శత్రువు పంపిన సిగ్నల్‌ను రికార్డ్ చేసి, దాన్ని మార్చి మళ్ళీ పంపిస్తుంది. దీనివల్ల శత్రువుకు మన నౌక ఉన్న చోట కాకుండా వేరే చోట ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. మూడవది ఎలక్ట్రానిక్ ప్రొటెక్షన్ (EP) మన స్వంత కమ్యూనికేషన్ వ్యవస్థను శత్రువుల జామింగ్ నుండి కాపాడటానికి ఇది నిరంతరం తన ఫ్రీక్వెన్సీని మారుస్తూ ఉంటుంది. (Frequency Hopping).

తారాగిరి కేవలం రక్షణకే కాదు, విధ్వంసానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ​”బ్రహ్మోస్” (Brahmos) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు దీని ప్రధాన ఆయుధం. ఇవి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని 99% కచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు. “​బరాక్ 8” (MRSAM) గాలిలో వచ్చే శత్రు విమానాలు లేదా డ్రోన్లను 70 కిలోమీటర్ల దూరంలోనే పేల్చివేసే క్షిపణి వ్యవస్థ. “బరాక్” అంటే “మెరుపు” అని అర్థం హీబ్రూ భాషలో…. దీనిని ఇజ్రాయెల్, ఇండియా కలసి అభివృద్ది చేశాయి. వీటిని తారగిరి నుండి ప్రయోగించవచ్చు.ఇందులో మరొక ప్రత్యేకత ఉంది. అది ​”యాంటీ సబ్ మెరైన్” సముద్రం లోపల దాగి ఉన్న జలాంతర్గాములను వేటాడటానికి ఇందులో స్వదేశీ ‘శ్యేన’ (Shyena) టార్పెడోలు మరియు రాకెట్ లాంచర్లు అమర్చి ఉన్నాయి.

​ప్రపంచ వేదికపై అమెరికా యొక్క (Constellation-class), రష్యా యొక్క (Admiral Gorshkov class) మరియు చైనా యొక్క (Type 054B)ఫ్రిగేట్లు తారాగిరికి సమానమైనవి. అయితే, భారత్ దగ్గర ఉన్న ఒకే ఒక ప్రత్యేకత ‘ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫాం’. అంటే మన రాడార్, క్షిపణులు మరియు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్ అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. దీనివల్ల స్పందన సమయం (Reaction Time) చాలా తక్కువగా ఉంటుంది. ​చైనా తన ప్రాబల్యాన్ని హిందూ మహాసముద్రంలో పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో, విశాఖ తీరంలో తారాగిరి వంటి నౌకల రాక వారికి గట్టి హెచ్చరిక లాంటిది.

సముద్ర గర్భాన రక్షణ 'శక్తి'… మన భారత 'తారాగిరి'…

ఆత్మనిర్భర భారత్ కు కిరీటం లో కలికితురాయి, “​INS తారాగిరి”. కేవలం ఒక యుద్ధనౌక కాదు, అది భారతదేశ సాంకేతిక సత్తాకు, పరిజ్ఞానానికి నిదర్శనం. గతంలో మనం ఇలాంటి నౌకల కోసం రష్యా లేదా బ్రిటన్ వైపు చూసేవాళ్ళం. కానీ నేడు మనమే స్వయంగా డిజైన్ చేసి, నిర్మించి, మన సొంత ‘ఎలక్ట్రానిక్ బ్రెయిన్’ (శక్తి సిస్టమ్)ను అమర్చుకుంటున్నాం.

సముద్రం మీద శాంతిని కోరుకుంటూనే, యుద్ధం వస్తే వెనక్కి తగ్గని భారత్ యొక్క కొత్త గొంతుక ఈ “తారాగిరి”. విశాఖ సాగర తీరంలో ఈ నౌక ప్రయాణం దేశ రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ కోవలోకి చెందినవే మొత్తం 7 షిప్పులు… INS నీలగిరి, INS ఉదయగిరి, INS హేమగిరి, INS వింద్య గిరి, INS ద్రోణ గిరి, INS మహేంద్ర గిరి… ఇవి భరత మాత మెడ లో మణిహారం గా ఉండబోతున్నాయి.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading