తిరుమలలో భక్తులకు నిత్యం అన్నప్రసాదం అందించే అన్నదానం ట్రస్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం నుంచి విశేష సహకారం కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో స్థాపించబడిన ఈ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం వితరణ జరుగుతోంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో ఈ సేవ నిరంతరం కొనసాగుతోంది.
చంద్రబాబు నాయుడు మనుమడు దేవాన్ష్ జన్మించినప్పటి నుంచి ప్రతి ఏడాది ఆయన పేరుతో అన్నదానం కోసం విరాళం అందించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఒక్కరోజు అన్నదానానికి అవసరమైన సుమారు రూ.44 లక్షల విరాళాన్ని సీఎం కుటుంబం అందజేస్తోంది. ఇప్పటి వరకు దేవాన్ష్ పేరుతో 12 సార్లు ఈ విరాళం అందించడం విశేషం.
ఇక తిరుమల దర్శనానికి సంబంధించిన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకత చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారికి మహాద్వార దర్శనం అవకాశం ఉన్నప్పటికీ, “దేవుని ముందు అందరూ సమానమే” అనే సూత్రాన్ని ఆయన పాటిస్తున్నారు. అందుకే తిరుమల పర్యటనల సందర్భంగా క్యూ కాంప్లెక్స్ ద్వారానే శ్రీవారి దర్శనం చేసుకోవడం ఆయన అలవాటుగా మార్చుకున్నారు.
మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించే ప్రత్యేక సందర్భాన్ని మినహాయించి, మిగిలిన అన్ని సందర్భాల్లో కుటుంబంతో కలిసి సాధారణ భక్తుల మాదిరిగానే క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు.